మహిపాల్‌రెడ్డికి రెండున్నరేళ్ల జైలు
ఓ పరిశ్రమ యాజమాన్యాన్ని బెదిరించిన కేసులో శిక్ష
సంగారెడ్డి క్రైం: ఓ పరిశ్రమ యజమానిని బెదిరించి, బలవంతంగా రూ. 15 లక్షలకు చెక్కు రాయించుకున్న కేసులో మెదక్ జిల్లా పటాన్‌చెరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి రెండున్నరేళ్ల జైలు శిక్ష పడింది. దీనితోపాటు రూ. 2,500 జరిమానా విధిస్తూ సంగారెడ్డి అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ డి.దుర్గాప్రసాద్ గురువారం తీర్పు వెలువరించారు. అయితే జిల్లా కోర్టులో అప్పీలు చేసుకుంటామని, శిక్ష వాయి దా వేయాలని కోరడంతో అనుమతించారు.
2014, మే 5న పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని పాశమైలారంలో ఉన్న వర్సటైల్ పరిశ్రమలో పనిచేస్తున్న మహేశ్ అనే కార్మికుడు మృతి చెందాడు. దీంతో మహిపాల్‌రెడ్డి, 70 మంది అనుచరులతో కలసి పరిశ్రమ వద్దకు వచ్చి.. కార్మికుడి కుటుంబానికి నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఆ కార్మికుడిని మీరే చంపారంటూ మహిపాల్‌రెడ్డి తమను బెదిరించారని పరిశ్రమ యజమాని పాటి చందుకుమార్... 2014, మే 7న బీడీఎల్ భానూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఆ సమయంలో పరిశ్రమ జీఎం మదన్‌కాంత్, ఏజీఎం ప్రశాంత్ ఉన్నారని.. తన వద్ద నుంచి రూ. 15 లక్షలకు బలవంతంగా చెక్కు రాయించుకున్నారని అందులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిఛ పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ కేసును విచారించిన సంగారెడ్డి కోర్టు న్యాయమూర్తి... ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిని దోషిగా నిర్ధారించి శిక్ష ఖరారు చేశారు. అయితే జిల్లా కోర్టులో అప్పీలు చేసుకుంటామని విజ్ఞప్తి చేయడంతో... న్యాయమూర్తి నెల రోజులు గడువు ఇచ్చారు. విచారణను 2016 జనవరి 6కి వాయిదా వేశారు.