రిమ్స్‌కు సుస్తి..!
► జ్వర పీడితులతో కిక్కిరిసిన ఆస్పత్రి
► ఒక్కో పడకపై ఇద్దరేసి రోగులు
► కంపుకొడుతున్న మరుగుదొడ్లు
► ఇదీ.. పెద్దాస్పత్రి తీరు
జిల్లా వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు ప్రబలు తుండడంతో రోగులు రిమ్స్ ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. దీంతో ఆస్పత్రిలోని ఆయా వార్డులు కిక్కిరిసిపోతున్నాయి. బెడ్లు సరిపడా లేక ఒక్కోదానిపై ఇద్దరేసి రోగులను పడుకోబెట్టి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అలాగే ఆస్పత్రిలో సరైన వసతులు లేక రోగులు అవస్థలు పడుతున్నారు.
ఆదిలాబాద్: జిల్లాలోని గిరిజన ప్రాం తాలైన నార్నూర్, ఉట్నూర్, నేరడిగొండ, ఇంద్రవెల్లి, బోథ్ తదితర మండలాల నుంచి రోగులు రిమ్స్‌కు వస్తున్నారు. వీరిలో చాలా మంది టైఫాయిడ్, మలేరియాతో జ్వరాలతో వస్తున్నారు. జిల్లా నలుమూలల నుం చి రోగులు వస్తుండగా వార్డుల్లో ఒక్కో పడకపై ఇద్దరు చొప్పున పడుకోబెడుతున్నారు. ఏటా వర్షాకాలంలో సీజన ల్ వ్యాధులతో రోగులు అధికసంఖ్య లో రిమ్స్‌కు వస్తుంటారు. అలాంటిది ముందస్తు చర్యలు తీసుకుని రోగులకు సరిపడా వార్డులు, పడకలు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఒకే బెడ్‌పై ఇద్దరు చొప్పున..
రిమ్స్ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగిపోయింది. ప్రతీరోజు ఓపీ విభాగంలో వెయ్యికిపైగా కేసులు వస్తున్నాయి. ఇన్‌పేషంట్‌గా 200 మంది ఆస్పత్రిలో చేరుతున్నారు. వీరిలో 30మంది వరకు జ్వరా>లతో బాధ పడుతున్నవారే. ఐటీడీఏ వార్డులో గత రెండు రోజుల్లోనే 25మంది వరకు రోగులు చేరారు. కాగా రోగులకు సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఒక్కో పడకపై ఇద్దరు రోగులను పడుకోబెట్టడంతో వారు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉన్న జబ్బు తగ్గడమేమోగానీ కొత్త జబ్బు పట్టుకునేలా ఉందని రోగులు వాపోతున్నారు. ఒకే పడకపై ఇద్దరు రోగులు ఉండడంతో ఎటూ కదలలేని పరిస్థితి. అటు సిబ్బందికి కూడా చికిత్స చేయడం ఇబ్బందే. రోజురోజుకు రోగుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా పడకలు ఏర్పాటు చేయడం లేదు.
ఎప్పుడూ తాళమే..
ఆస్పత్రిలోని మరుగుదొడ్లకు ఎప్పుడు చూసినా తాళం వేసి కనబడుతోంది. రూ.లక్షలు వెచ్చింది మరుగుదొడ్లు నిర్మిస్తే వాటికి తాళాలు వేసి నిరుపయోగంగా మార్చడం సరైంది కాదని పలువురు పేర్కొంటున్నారు. ఆస్పత్రిలోని వారి బంధువులను పరామర్శించేందుకు వస్తే అత్యవసర సమయంలో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. స్త్రీల కోసం మూత్రశాలలు మాత్రమే అందుబాటులో ఉంచారు. అందులో కూడా కొన్నింటికి తాళాలు వేసి కనిపిస్తున్నాయి. పైన పటారం.. లోన లొటారం అన్న మాదిరిగా.. ఆస్పత్రి ఆవరణను శుభ్రం చేస్తున్నా మరుగుదొడ్లను మాత్రం మరిచిపోతున్నారు.
ఆస్పత్రికి నిత్యం వందల సంఖ్యలో రోగులు, వారి బంధువులు వస్తూ వెళ్తుంటారు. రోగులున్న వార్డుల్లోని మరుగుదొడ్లను మాత్రమే శుభ్రం చేయిస్తున్నారు. కింది నుంచి మూడంతస్తుల వరకు బయటి మరుగుదొడ్లను అలాగే వదిలేస్తున్నారు. అత్యవసర పరిస్థితిలో ఒంటికి.. రెంటికి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. రోగులను పరామర్శించేందుకు వచ్చి ఇక్కడి అపరిశుభ్రతతో ఇతరులు అనారోగ్యం బారిన పడే పరిస్థితులను తీసుకురావద్దని, పారిశుధ్య నిర్వహణపై దృష్టి సారించాలని పలువురు సూచిస్తున్నారు. దీనికి తోడు నీటి సరఫరాలో అంతరాయం.. మరుగుదొడ్లలోని సింకులు, పైప్‌లు లేకపోవడంతో ఓ కారణంగా తెలుస్తోంది. ఏదేమైనా నిత్యం రోగుల తాకిడితో కిటికిటలాడే రిమ్స్ ఆస్పత్రిలో సరైన సదుపాయాలు కల్పించాలని పలువురు కోరుతున్నారు.
నా దృష్టికి రాలేదు
ప్రస్తుతం గతంలో మాదిరిగానే సాధారణ కేసులు వస్తున్నాయి. గతేడాది కంటే జ్వరాలతో ఈ ఏడాది తక్కువగానే ఉన్నాయి. వార్డుల్లో ఇద్దరేసి రోగులను పడుకోబెట్టినట్లు నా దృష్టికి రాలేదు. ఒకవేళ అలా ఉంటే పరిశీలించి సరిపడా పడకలు ఏర్పాట్లు చేస్తాం. – అశోక్, రిమ్స్ డైరెక్టర్
రిమ్స్ ఆస్పత్రిలో రోగులకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని చెబుతున్న అధికారులు కనీస వసతుల కల్పనలో విఫలమవుతున్నారు. సీజనల్ వ్యాధులు పెరుగుతున్నా ముందస్తు చర్యలు చేపట్టడంలేదు. ఒక్కో పడకపై ఇద్దరేసి రోగులను పడుకోబెడుతుండగా వారికి ఇక్కట్లు తప్పడంలేదు. గత రెండు రోజుల్లోనే చిల్డ్రన్స్ వార్డులో 75మంది చేరగా వారిని జబ్బుతో పాటు పడకల కొరత వేధిస్తోంది.
– చింతల అరుణ్‌రెడ్డి, సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్