పట్టపగలే దారుణ హత్య
పట్టపగలే దారుణ హత్య
Published Thu, Mar 30 2017 6:17 PM | Last Updated on Tue, Sep 5 2017 7:30 AM
ఏలూరు రూరల్, ఏలూరు అర్బన్: ఏలూరు మండలం గుడివాకలంక మాజీ సర్పంచ్ జయమంగళ భద్రగిరిస్వామి హత్యకు గురయ్యారు. ఏలూరు మండల పరిషత్ ప్రాంగణంలో పదుల సంఖ్యలో ప్రజల సమక్షంలోనే అపరిచిత వ్యక్తి కత్తితో పొడిచి పారిపోయాడు. వివరాలిలా ఉన్నాయి.. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఏలూరు ఎంపీడీఓ కార్యాలయంలో పీఆర్‌ఏఈతో మాట్లాడి బయటకు వస్తుండగా భద్రగిరిస్వామిని ఓ వ్యక్తి పలకరించాడు. ‘మీతో మాట్లాడాలి రండి’ అంటూ భుజంపై చేయి వేసి పక్కకు తీసుకెళ్లాడు. సుమారు పది అడుగుల దూరం వెళ్లగానే కత్తి తీసి భద్రగిరిస్వామి మెడ, గొంతు భాగంలో పొడిచాడు. అగంతకుడు నుంచి విడిపించుకోవడానికి భద్రగిరిస్వామి ప్రయత్నించగా మరికొన్ని కత్తిపోట్లు పొడిచాడు. వీరిద్దరి పెనుగులాట చూసిన గుడివాకలంక గ్రామానికి చెందిన జయమంగళ నాగరాజు అనే వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అగంతకుడు మోటార్‌సైకిల్‌పై పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో నేలపై కొట్టుకుంటున్న భద్రగిరిస్వామిని అక్కడే ఉన్న కొల్లేరు పెద్దలు, నాయకులు హుటాహుటిన ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్దారించి పోస్టుమార్టంకు తరలించారు. భద్రగిరిస్వామి భార్య వెంకటరమణ ఎంపీటీసీగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు ముగ్గురు కుమారులు. ఆస్పత్రి ప్రాంగణం వద్ద మృతుని బంధువులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి.
ఉలిక్కిపడ్డ కొల్లేరు గ్రామాలు
భద్రగిరిస్వామి హత్యతో కొల్లేరు గ్రామాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. లంకగ్రామాల ప్రజలు పెద్దెత్తున ఆస్పత్రికి వచ్చారు. ఏఎస్పీ వలిసల రత్న, డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు, సీఐ ఉడతా బంగార్రాజు, ఎన్.రాజశేఖర్ మృతుని కుటుంబభ్యుల నుంచి వివరాలు సేకరించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆస్పత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. నిందితుడిని అరెస్ట్ చేయాలంటూ కొల్లేరు గ్రామాల ప్రజలు కొద్దిసేపు ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్ వద్ద ఆందోళన చేశారు.
వ్యక్తిగత కక్షా.. చెరువు తగాదానా..!
హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత కక్ష లేదా చేపల చెరువు వివాదాలు హత్యకు కారణమై ఉంటాయని భావిస్తున్నారు. ఏడాది క్రితం జరిగిన ఓ ప్రమాదంలో భద్రగిరిస్వామి నిందితుడుగా ఉన్నారు. అప్పట్లో వివాహానికి వెళ్లి కుటుంబసభ్యులతో కలిసి భద్రగిరిస్వామి వ్యాన్‌లో వస్తూ కొక్కిరాయిలంక వంతెన వద్ద వాడపల్లి భాస్కరరాజు అనే వ్యక్తిని ఢీకొట్టారు. ఈ ప్రమాదం తర్వాత భద్రగిరిస్వామి అనారోగ్య కారణంతో ఆస్పత్రిలో చేరారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆయన కుటుంబసభ్యుల్లో ఒకరిద్దరిని నిందితులుగా పేర్కొన్నారు. అయితే తర్వాత భాస్కరరాజు కుమారులతో భద్రగిరిస్వామి రాజీయత్నాలు చేసినట్టు తెలిసింది. దీనిలో భాగంగా పెద్ద మొత్తంలో నష్టపరిహారం సైతం చెల్లించేందుకు సిద్ధపడినట్టు సమాచారం. దీనిని భాస్కరరాజు కుటుంబం నిరాకరించినట్టు తెలిసింది. కొద్దికాలం తర్వాత భద్రగిరిస్వామిని సైతం పోలీసులు ఈ కేసులో నిందితుడిగా పేర్కొన్నారు. వీటితో పాటు ఇటీవల కాలంలో పలు చేపల చెరువుల తగాదాలకు భద్రగిరిస్వామి పెద్దరికం వహించినట్టు భోగట్టా.
Advertisement
Advertisement