పీడీఎస్ బియ్యం పట్టివేత
పీడీఎస్ బియ్యం పట్టివేత
Published Tue, Jun 20 2017 11:20 PM | Last Updated on Tue, Sep 5 2017 2:04 PM
200 కింటాళ్లు స్వాధీనం
మండపేట గోదాముకు తరలింపు
దర్యాప్తు చేస్తున్న అధికారగణం
సంఘటన వెనుక భారీ రాకెట్ ?
ఆలమూరు : మడికి శివారు మల్లవానితోటలో 200 క్వింటాళ్ల రేషన్ బియ్యం (పీడీఎస్) సీజ్ చేయడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం వెనుక భారీ రాకెట్ ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అధికారులు సీజ్ చేసిన ఆ బియ్యాన్ని ఎక్కడి నుంచి ఎగుమతి చేశారో తెలుసుకునేందుకు స్థానిక అధికారులు రాత్రి పొద్దుపోయే వరకూ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో రాజమహేంద్రవరం నుంచి పౌరసరఫరాల శాఖ అధికారులు రంగ ప్రవేశం చేసి కేసు లోతును పరిశీలిస్తున్నారు. వివరాలల్లో కెళితే పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నారనే ముందస్తు సమాచారంతో స్థానికులు లారీని స్థానిక కడియం మండలం వీరవరం జంక‌్షన్ వద్ద అడ్డుకునే ప్రయత్నం చేయబోయారు. దీంతో భయాందోళనకు గురైన లారీ డ్రైవర్ వేగంగా వెళ్లి మండల పరిధిలోని మల్లవాని తోట పరిధిలో ఒక నిర్జీవ ప్రదేశంలో లారీని నిలిపి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న ఆలమూరు తహసీల్దార్ కె.పద్మావతి, మండపేట ఎంఎస్‌ఓ గాంధీ నేతృత్వంలో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని బియ్యాన్ని పరిశీలించి పీడీఎస్‌గా గుర్తించారు. స్థానిక అధికారులు రాజమహేంద్రవరం జీపీఏ కార్యాలయానికి సమాచారం అందించగా ఏజీపీఏ పి.భాస్కర్, ఏఎస్‌ఓ కె.ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అదుపులోకి తీసుకున్న లారీని మండపేట పౌరసరఫరాల గోదాము స్టాకు పాయింట్‌కు తీసుకువెళ్లి పీడీఎస్ బియాన్ని పరిశీలించారు. ఆ లారీలో సుమారు 200 క్వింటాళ్ల బియ్యం ఉండటంతో పాటు ఆ బస్తాలపై వివిధ ప్రాంతాలకు చెందిన ట్యాగ్‌లు ఉండటం అధికారులకు బియ్యం గుర్తింపు పక్రియ ఇబ్బందికరంగా మారింది. దీంతో కాకినాడ, రాజమహేంద్రవరం నుంచి పౌరసరఫరాలశాఖ నిపుణులను రప్పించి ట్యాగ్ ఆధారంగా బియ్యం బస్తాలను విడగొడుతున్నట్లు తెలిసింది. రాత్రి పొద్దు పోయే వరకూ పౌరసరఫరాల శాఖ ఏవిధమైన సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అలాగే మల్లవానితోటకు వచ్చిన పలువురు పౌరసరఫరాల అధికారులు స్థానికుల నుంచి సమాచారాన్ని సేకరించి వివరాలను నమోదు చేసుకున్నారు.
బియ్యం దిగుమతి ప్రయత్నం బెడసి కొట్టిందా?
మల్లవానితోట–వీరవరం పరిసర ప్రాంతంలో ఉన్న ఒక రైసుమిల్లులో 200 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని దిగుమతి చేయాల్సి ఉంది. ముందస్తు సమాచారంతో గుట్టు రట్టవ్వడంతో రైసుమిల్లు సమీపం వరకూ వచ్చిన లారీని డ్రైవర్ మరో ప్రదేశానికి తీసుకువెళ్లిపోయాడు. ఆ రైసుమిల్లు పాత్రపై అనుమానాలున్నా ప్రస్తుతం ఆధారాలు లేకపోవడంతో అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. పౌరసరఫరాల శాఖ «అధికారులు పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని స్టాకు పాయింట్‌లో దిగుమతి చేసి లారీని ఆలమూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటనపై సమగ్ర వివరాలను అందజేస్తే కాని తాము కేసుకు సంబంధించి ఏమీ చేయమలేమని ఎస్సై పి.దొరరాజు స్పష్టంచేశారు.
పౌరసరఫరాలశాఖ అదుపులో డ్రైవర్, క్లీనర్ !
రాజమహేంద్రవరం పౌరసరఫరాలశాఖ అధికారుల అదుపులో లారీ డ్రైవర్, క్లీనర్ ఉన్నట్లు తెలుస్తొంది. బియ్యం బస్తాలపై ఉన్న ట్యాగ్ ఆధారంగా పూర్తి వివరాలు తెలుసుకున్న తరువాత డ్రైవర్, క్లీనర్‌లను విచారించేందుకు పౌరసరఫరాలశాఖ నిర్ణయించుకున్నట్లు తెలుస్తొంది. రాత్రి పొద్దు పోయే వరకూ గోదాముల వద్ద సమయం సరిపోవడంతో బుధవారం నిందితులను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయంంగా తెలిసింది. విచారణలో బియ్యం ఎన్ని ప్రదేశాల నుంచి ఎగుమతి జరిగింది? ఎవరు ఎగుమతి చేశారు ? ఎక్కడికి వెళ్లవలసి ఉంది ? ఈకథ వెనుక ఎవరున్నారు? అనే విషయాలు తేలవలసి ఉంది.
Advertisement