స్థానికం ప్రశాంతం
స్థానికం ప్రశాంతం
Published Fri, Mar 17 2017 10:05 PM | Last Updated on Tue, Sep 5 2017 6:21 AM
ముగిసిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్
– మొత్తం ఓటర్లు 1,084.. ఓటేసింది 1,077 మంది
– మొత్తం 99.35 శాతం పోలింగ్
– 20న ఓట్ల లెక్కింపు
– గంటల తరబడి నిలబడిన ఓటర్లు
– ఓటు వేసేందుకు ఇంత సేపు ఏంటంటూ అసహనం
– పోలింగ్ కేంద్రంలో అధికార పార్టీ నేతలు
– ఫిర్యాదు చేస్తే తప్ప స్పందించని అధికారులు
– నంద్యాల డివిజన్‌లో క్రాస్ ఓటింగ్
– ఆందోళన చెందుతున్న అధికార పార్టీ నేతలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. శుక్రవారం జరిగిన ఓటింగ్ ప్రశాతంగా ముగిసింది. మొత్తం 1,084 మంది ఓటర్లలో 1,077 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిగిలిన 7గురు వివిధ కారణాలతో ఓటింగ్‌లో పాల్గొనలేదు. మొత్తం మీద 99.35 శాతం పోలింగ్ జరిగింది. ఈ నెల 20న ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే, ఓటింగ్‌లో నంద్యాల, ఆదోని డివిజన్‌లో మొదట్లో భారీగా ప్రారంభం కాగా.. కర్నూలు రెవెన్యూ డివిజన్‌లో నెమ్మదిగా ప్రారంభమయ్యింది. అదేవిధంగా కర్నూలు రెవెన్యూ డివిజన్‌లో ఓటు వేసేందుకు గంటల తరబడి క్యూ లైన్‌లో నిలబడాల్సి వచ్చింది. దీంతో ఓట్లు తక్కువగా ఉన్నప్పటికీ ఇంత సేపు క్యూలో నిల్చోవడం ఏమిటని ఓటర్లు అసహనాన్ని వ్యక్తం చేశారు.
ఒకానొక దశలో 11 గంటల ప్రాంతంలో క్యూలో నిల్చున్న ఓటరు.. రెండు గంటల పాటు వేచిచూసి ఓటు వేయాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు ఎండ వేడిమి భారీగా ఉండటంతో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఓటింగ్ కేంద్రంలోకి అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు వచ్చి ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. అధికారులు మాత్రం చూసీ చూడనట్టుగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. అయితే, ప్రతిపక్ష పార్టీ నుంచి అభ్యంతరం చెప్పిన తర్వాతే వారిని బయటకు పంపించారు.
ముఖ్యంగా నంద్యాల, కర్నూలు రెవెన్యూ డివిజన్‌లో క్రాస్ ఓటింగ్ జరిగిందని అధికార పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైఎస్‌ఆర్‌సీపీలో తాము గెలుస్తున్నామనే ధీమా కనబడింది. అయితే, ఎవరి భవితవ్యం ఏమిటనే విషయం ఈ నెల 20న జరిగే ఓట్ల లెక్కింపులో బయటపడనుంది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఎవరిది గెలుపనే అంశం సూచనప్రాయంగా తెలిసే అవకాశం ఉంది.
భయపెడుతున్న క్రాస్ ఓటింగ్
వాస్తవానికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైన మెజార్టీ ఓటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. అయితే అధికార పార్టీ నేతలు ప్రలోభాలకు గురిచేసి, బెదిరించి పలువురిని పార్టీ మార్పించారు. ఈ నేపథ్యంలో వీరు తమకు ఓటు వేస్తారా అనే అనుమానం అధికార పార్టీలో వ్యక్తమవుతోంది. ప్రధానంగా నంద్యాల డివిజన్‌లో భూమాకు చెందిన అనుచరులు తమ ప్రత్యర్థిగా ఉన్న శిల్పాకు ఓటు వేసేందుకు మొదటి నుంచీ నిరాకరించారు. దీంతో ఈ డివిజన్‌లో భారీగానే క్రాస్ ఓటింగ్ జరిగిందని అధికారపార్టీ నేతలే అంగీకరిస్తున్నారు.
అదేవిధంగా కర్నూలు డివిజన్‌లోని కోడుమూరు, నందికొట్కూరు నియోజకవర్గాల్లో పార్టీ మారిన పలువురు ఓటర్లు కూడా తాము గెలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రుణం ఈసారి తీర్చుకోవాలని నిర్ణయించుకుని ఓటింగ్‌కు వచ్చినట్టు తెలుస్తోంది. కర్నూలు డివిజన్‌లోనూ క్రాస్ ఓటింగ్ జరిగిందనే ప్రచారం జరుగుతోంది. ఇక ఆదోని రెవెన్యూ డివిజన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పక్కా మెజారిటీ ఉంది. మొత్తం మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి గెలుపు సూచనలు కనపడుతున్నాయి. అయితే, అధికారపార్టీ నేతలు మాత్రం.. ఎవరికి ఓటు వేసేది తెలుస్తుందని.. ఓటు వేయకపోతే సంగతి చూస్తామంటూ పలు చోట్ల బెదిరింపులకు దిగినట్టు సమాచారం.
నేరుగా పలువురు జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులతో పాటు కౌన్సిలర్లకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడినట్టు తెలిసింది. అంటే అధికార పార్టీలో ఏ స్థాయిలో ఓటమి భయం ఉందో ఈ విషయం తేటతెల్లం చేస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు అంటున్నారు. ఇక ఓటింగ్ జరుగుతుండగా... అధికారపార్టీ నేతలు పలువురు పోలింగ్ కేంద్రంలోకి వచ్చే ప్రయత్నం చేశారు. ఎక్కడా అధికారులు మాత్రం నిలువరించే ప్రయత్నం చేయలేదు. అయితే, వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డి అభ్యంతరం చెప్పడంతో పోలీసులు వారిని పంపించేశారు.
డివిజన్ల వారీగా ఉన్న ఓట్లు, పోలైన ఓట్ల వివరాలు
డివిజన్ ఉన్న ఓట్లు పోలైన ఓట్లు శాతం
కర్నూలు 386 384 99.48
ఆదోని 391 389 99.48
నంద్యాల 307 304 99.02
మొత్తం 1,084 1,077 99.35
ఓటు వేయని వారు
– భూమా నాగిరెడ్డి– ఎమ్మెల్యే, నంద్యాల (మరణించారు)
– సుంకమ్మ– రామతీర్థం ఎంపీటీసీ (చనిపోయారు)
– మస్తాన్ వలీ, చాగలమర్రి ఎంపీపీ (జైల్లో ఉన్నారు)
– మహదేవమ్మ–కోవెలకుంట్ల ఎంపీటీసీ (చనిపోయారు)
– పద్మావతమ్మ– బేతంచర్ల జెడ్పీటీసీ (విదేశాల్లో ఉన్నారు)
– బుట్టా రంగయ్య– ఎమ్మిగనూరు మునిసిపాలిటీ వైస్‌చైర్మన్ (అనారోగ్యం)
– మోహన్ రాజ్– మార్లమడికి ఎంపీటీసీ
Advertisement
Advertisement