సీసీ కెమెరా నిఘాలో పెద్దపల్లి
► పట్టణంలో 77 చోట్ల ఏర్పాటు
►ప్రతీ పల్లెలో ఏర్పాటుకు సన్నాహాలు
పెద్దపల్లి : సీసీ కెమెరాల నిఘాలోకి పెద్దపల్లి సర్కిల్ వెల్లనుంది. పట్టణంలోని ప్రధాన సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనుండగా పెద్దపల్లి పోలీస్ సర్కిల్ పరిధిలోని నాలుగు పోలీస్‌స్టేషన్ లను నమూనాగా తీసుకొని అన్ని గ్రామాల్లోనూ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నారు. పట్టణంలో ప్రధాన కూడళ్లతోపాటు ప్రతీ విధిలో ఏర్పాటు చేసి, నేరాల నియంత్రణకు వ్యూహరచన చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు సీసీ ఫుటేజీలు ఉపయోగపడనున్నాయి. ఒక్కో సీసీ కెమెరా 360 మీటర్ల దూరంలోని వ్యక్తుల కదలికలను రికార్డు చేయనుంది. పెద్దపల్లి పట్టణంతోపాటు చుట్టు పక్కల గ్రామాల్లోనూ ఏర్పాటు చేసి, అక్కడి నుంచి సిటికేబుల్ ద్వారా పోలీస్‌స్టేషన్ కు అనుసంధానం చేస్తూ కంట్రోల్ రూం ద్వారా పర్యవేక్షణ చేపట్టనున్నారు.
ప్రతీ అంగుళం కూడా పోలీసుల గుప్పిట్లో ఉండేందుకు వీలుగా ఒక్క పెద్దపల్లి పట్టణంలోనే 77 చోట్ల ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. మేరకు జెండా చౌరస్తాలోని ఆరు వైపులా, మజీద్ చౌరస్తాలో ఆరు వైపులా, రైల్వే స్టేషన్ లో నాలుగు వైపులా, బస్టాండ్‌లో ఏడు వైపులా ఇలా ప్రతి వీధిని కవర్ చేస్తూ అమర్చనున్నారు. పెద్దపల్లి పోలీస్ సర్కిల్ పరిధిలోని బసంత్‌నగర్, ధర్మారం, వెల్గటూర్, పెద్దపల్లి పట్టణం, మండలంలో అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసుకునేందుకు ప్రజాప్రతినిధుల సహకారం కోరుతున్నారు. ఎంపీ బాల్క సుమన్ తన నిధుల కోటా ద్వారా రూ.15 లక్షలు కేటాయించారు.
స్థానిక వ్యాపారులు, విద్యా సంస్థలు, ప్రజాప్రతినిధుల సహకారాన్ని తీసుకుంటున్నట్లు సీఐ ఎడ్ల మహేశ్ తెలిపారు. ఇప్పటికే బసంత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాలకుర్తి మండలంలోని అన్ని గ్రామాల్లో కెమెరాల బిగింపు పూర్తయిందన్నారు. పెద్దపల్లి మండలంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి స్వగ్రామం కాసులపల్లి నుంచి బిగింపునకు శ్రీకారం చుట్టామన్నారు. ఆ గ్రామం నుంచి రూ. 90 వేలు విరాళాలు వచ్చాయని సీఐ తెలిపారు.
తగ్గనున్న నేరాలు
సీసీ కెమెరాలను ఏర్పాటుతో నేరాలు తగ్గుతాయని పోలీస్ అధికారులు చెబుతున్నారు. ఎక్కడైనా నేరం జరిగినా వెంటనే అరెస్టు చేసి, జైలుకు పంపించేందుకు, శిక్ష పడేందుకు కూడా దోహదపడతాయని అంటున్నారు. పెద్దపల్లి పోలీస్ సర్కిల్ పరిధిలో సుమారు రూ.కోటి 30 లక్షల వ్యయంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు యత్నిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఆనాటి అన్నల గ్రామాల్లో నిఘా
పెద్దపల్లి జిల్లాలోని అన్నల ప్రభావిత గ్రామాల్లో పోలీసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. రాణాపూర్, కుక్కలగూడూర్, పాలకుర్తి, పాలితం, వనపర్తి, ముంజంపల్లి ఇలా పదుల సంఖ్యలో మావోయిస్టులను ఇచ్చిన గ్రామాలు పోలీసుల నిఘా నేత్రంలో ఉండనున్నాయి.