
'మరుగు'న పడిన బిల్లులు
- అర్ధంతరంగా ఆగిన నిర్మాణాలు
– చేతిలో చిల్లిగవ్వలేక లబ్ధిదారులు ఆందోళన
– నీరుగారుతున్న స్వచ్ఛభారత్ లక్ష్యం
అనంతపురం రూరల్ : ప్రజా ప్రతినిధులంతా స్వచ్ఛభారత్ గురించి ఉపన్యాసాలు దంచేస్తున్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుని బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలు తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామంటూ గొప్పలు చెబుతున్నారు. మరోవైపు అధికారులు కూడా ఊరువాడా ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉంటున్నాయి. స్వచ్ఛభారత్‌లో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో వ్యక్తిగత మరుగుదొడ్ల లబ్ధిదారులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎంపికతో సరి
అనంతపురం రూరల్ మండల పరిధిలోని 5 పంచాయతీలను అధికారులు స్వచ్ఛభారత్ పథకం పైలెట్ ప్రాజెక్టు కింద పిక చేసి మరుగుదొడ్లను మంజూరు చేశారు. ఒక్కొక్క మరుగుదొడ్డికి ప్రభుత్వం రూ.15 వేలు మంజూరు చేస్తోంది. దీంతో ప్రజలు కూడా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ముందుకు వచ్చారు. అప్పులు చేసి నిర్మాణాలు చేసుకుంటున్నారు. అయితే మరుగుదొడ్లను పూర్తి స్థాయిలో నిర్మించుకున్నా. నేటికీ బిల్లులు మంజూరు కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 5 నెలలుగా బిల్లులు మంజూరు చేయాలని అధికారుల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నా అధికార యంత్రాంగం పట్టించు కోవడం లేదు. ఆరు బస్తాల సిమెంట్, రెండు పైకప్పు రేకులు, ఒక పైపు మినహా ఒక్క పైసా మంజూరు చేయలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి బిల్లులు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
రూ.5200 మాత్రమే మంజూరు చేశారు
రూ.25 వేలు అప్పు చేసి మరుగుదొడ్డి నిర్మించుకున్నాను. బిల్లు కోసం రోజుల తరబడి తిరగడంతో కేవలం రూ. 5,200 మంజూరు చేశారు. అంతే 5 నెలలుగా మిగతా బిల్లుల కోసం వేచి చూస్తున్నాను.
– నాగరాజు, నేతాజీనగర్
నిర్మాణ పనులు ఆపేశాం
మరుగుదొడ్డి నిర్మాణం కోసం 6 బస్తాల సిమెంట్, రెండు పైకప్పు రేకులు మినహా ఒక పైసా మంజూరు చేయలేదు. ప్రస్తుతం మరుగుదొడ్డి నిర్మాణ పనులు 70 శాతం పూర్తయ్యాయి. చేతిలో చిల్లి గవ్వలేక నిర్మాణపనులు ఆపేశాం.
– వన్నూర్‌స్వామి, రాజీవ్‌కాలనీ పంచాయతీ
జాప్యం వాస్తవమే
బిల్లుల పంపిణీలో జాప్యం జరిగిన మాట వాస్తవమే.. గతంలో చోటు చేసుకున్న పరిణామాల వల్లే బిల్లుల చెల్లింపు ఆలస్యమవుతోంది. క్షేత్ర స్థాయిలో మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు మంజూరు చేసే విధంగా చర్యలు చేపడతాం.
-లక్ష్మీనరసింహ, ఈఓఆర్‌డీ
మరుగుదొడ్డు నిర్మాణ పనులు వివిధ దశల్లో
గ్రామం పేరు మంజూరైనవి పూర్తి అయినవి బేస్‌మెంట్ వివిధ దశల్లో
రాచానపల్లి 308 92 144 72
కామారుపల్లి 256 14 70 172
మన్నీల 307 10 160 137
రాజీవ్‌కాలనీ 372 17 106 249
చిన్నంపల్లి 119 13 24 82