పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయండి
పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయండి
Published Sat, May 13 2017 10:31 PM | Last Updated on Tue, Sep 5 2017 11:05 AM
- మంత్రి భూమా అఖిలప్రియ ఆదేశం
- కలెక్టర్‌తో కలిసి అధికారులతో సమీక్ష
కర్నూలు(అర్బన్): నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి భూమా అఖిలప్రియ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో కలెక్టర్ ఎస్.సత్యనారాయణతో కలసి శనివారం రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి పనుల విషయంలో సమస్యలుంటే కలెక్టర్‌తోపాటు తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. నంద్యాలలో రహదారి విస్తరణకు సెంట్రల్ లైనింగ్ మార్క్ పనుల ఆలస్యంపై మున్సిపల్ కమిషనర్‌ను ఆరా తీశారు. స్ట్రక్చర్ల వాల్యుయేషన్ పూర్తి చేసి సంబంధీకులకు నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆళ్లగడ్డకు మంజూరైన రూ.43 లక్షల పనులను ప్రారంభించాలన్నారు.
నంద్యాల మురికివాడల్లో వీధి లైట్లు ఏర్పాటు చేసి ఆ ప్రాంత ప్రజల ఇబ్బందులు తీర్చాలన్నారు. గృహనిర్మాణ పథకం కింద ఇళ్లు మంజూరై కట్టుకోకుండా ఉన్న వారిని గుర్తించి ఇతరులకు కేటాయించాలన్నారు. ఏడాది కాలంగా పూర్తి కాని గృహనిర్మాణాలను రద్దు చేయాలని జిల్లాకలెక్టర్ ఎస్.సత్యనారాయణ హౌసింగ్ పీడీని ఆదేశించారు. రుద్రవరం, శిరివెళ్ల, దొర్నిపాడు, ఆళ్లగడ్డ మండలాల్లో గృహనిర్మాణాల కోసం భూమి కొనుగోలు చేసినా అర్హులైన లబ్ధిదారులకు గృహాలు కేటాయించడంలో అధికారులు అలక్ష్యం చేస్తున్నారని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. పట్టాలు మంజూరు చేసిన వారికి ముందుగా నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టాలని ఆర్‌డీఓను కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, నంద్యాల ఆర్‌డీఓ రాంప్రసాద్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Advertisement