పెండ్లిమర్రి: పెండ్లిమర్రి మండలం మమ్ముసిద్దుపల్లె గ్రామానికి చెందిన ఆర్.రామకృష్ణారెడ్డి(45) అనే వ్యక్తి కువైట్‌లో ఉరివేసుకొని అత్మహత్య చేసుకున్నాడు. దాదాపు ఐదు నెలల క్రితం అతను ఆత్మహత్య చేసుకోగా మృతదేహం గురువారం స్వగ్రామానికి చెరింది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు... రామకృష్ణారెడ్డి 7 నెలల క్రితం జీవనోపాధి కోసం కువైట్‌కు వెళ్లాడు. డ్రైవర్‌గా పని ఇప్పిస్తానని నమ్మబలికి ఏజెంట్ పంపగా అక్కడ గొర్రెల కాపరిగా నియమించుకున్నారు. ఆ పని చేయలేక నరకయాతన అనుభవించాడు. ఇంటికి పంపేందుకు అక్కడివారు అంగీకరించలేదు. దీంతో త్రీవ మనస్తాపానికి గురై ఈ ఏడాది జూన్ నెలలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. న్యాయవాది ద్వారా కోర్టులో కేసు వేయడంతో గురువారం మృత దేహాన్ని స్వగ్రామానికి పంపించారు. మృతునికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఏజెంట్ చేసిన మోసానికి ఇంటి పెద్ద దిక్కును కోల్పోయామని కుటుంబ సభ్యులు విలపించారు. మృతదేహాన్ని కడప డీసీసీబీ ఛైర్మన్ అనిల్‌కుమార్‌రెడ్డి సందర్శించి మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.