పింఛన్ ఇప్పిస్తాం
దివ్యాంగునికి కలెక్టర్ భరోసా
అనంతపురం అర్బన్: ఫించను ఇప్పిస్తాను... నీవేమి బాధపడవద్దు అంటూ దివ్యాంగుడు షేక్ ఖాజాపీరాకు కలెక్టర్ కోన శశిధర్ భరోసా ఇచ్చారు. డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్లుని పిలిచి తక్షణం పింఛను అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం, జేసీ-2 సయ్యద్ ఖాజా మొహిద్ధీన్, డీఆర్‌ఓ పీహెచ్ హేమసాగర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తాడిపత్రి పట్టణానికి చెందిన దివ్యాంగుడు షేక్ ఖాజాపీరాని గ్రీవెన్స్‌కి తీసుకొచి టేబుల్‌పై ఉంచారు. అక్కడికే కలెక్టర్ వచ్చి సమస్యను అడిగి తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని పీడీని ఆదేశించారు.
ఇక.. తప్పుడు పట్టాదారు పుస్తకంతో వేరొకరికి భూమిని విక్రయించే యత్నం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు, బాధితుడు ప్రసాద్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దళితుల సమస్యలు పరిష్కరించాలని కేవీపీఎస్ నాయకులు, ఎస్టీలకు ఉచిత విద్య అందేలా చూడాలని వైఎస్సార్‌సీపీ ఎస్టీసెల్ ప్రధాన కార్యదర్శి సాకే చిరంజీవి, నగర అధ్యక్షుడు సుబ్బరాయుడులు కలెక్టర్‌ను కోరారు.