పండుగకు పచ్చడి మెతుకులేనా..! | Pensions problems | Sakshi
Sakshi News home page

పండుగకు పచ్చడి మెతుకులేనా..!

Published Tue, Nov 10 2015 3:05 AM | Last Updated on Sun, Sep 3 2017 12:17 PM

పండుగకు పచ్చడి మెతుకులేనా..!

పండుగకు పచ్చడి మెతుకులేనా..!

సాక్షి, హైదరాబాద్: ప్రతినెలా 5వ తేదీలోపు అందాల్సిన ఆసరా పింఛన్లు ఈనెల 10వ తేదీ వచ్చినా పత్తాలేవు. దీంతో పింఛన్‌దారులు పండుగ నాడు పచ్చడి మెతుకులే గతి అయ్యేలా ఉందని వాపోతున్నారు. ప్రతి నెలా 1నుంచి 5లోగా పింఛను పంపిణీలో హడావిడిగా ఉండే గ్రామీణ పేదరిక నిర్మూలన (సెర్ప్) అధికారులు 10వ తేదీ వచ్చినా కిమ్మనడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా సామాజిక భద్రతా పింఛన్ల పథకం కింది వివిధ కేటగిరీల్లో సుమారు 36 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతినెలా దాదాపు రూ.394 కోట్ల విలువైన పింఛన్లు అందజేస్తారు. పింఛన్ పంపిణీ నిమిత్తం అవసరమైన ఏర్పాట్లు చేసినప్పటికీ ఆర్థిక శాఖ నుంచి నిధులు అందకపోవడంతో ఏమి చేయాలో పాలుపోవడం లేదని సెర్ప్ అధికారులు పేర్కొంటున్నారు.

ప్రతినెలా 25 లోగా బడ్జెట్ రిలీజ్ ఉత్తర్వులు ఇచ్చే ప్రభుత్వం అక్టోబర్ 30న బీఆర్వోలు జారీచేసింది. అయితే, ఐదారు రోజులు మాత్రమే ఆలస్యమవుతుందని భావించిన అధికారుల్లో  10వ తేదీ వచ్చినా డబ్బు అందకపోవడంతో నిరుత్సాహం ఆవహించింది. ఇదిలా ఉంటే.. ప్రతినెలా 5వ తేదీలోపు పింఛన్లు అందుకునే వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, నేత, గీత కార్మికులు, బీడీ కార్మికులు ఈ నెల పింఛన్ సొమ్ముకోసం బ్యాంకులు, పోస్టాఫీసులు, మండల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

 ఆర్థిక శాఖ వద్దే ఆలస్యం...
 నిధుల విడుదల విషయంలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లింపు తర్వాత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చేది పింఛన్ చెల్లింపులకే. అయితే, గత నెలలో రావాల్సినంత ఆదాయం రాలేదో... లేక ఆర్థికశాఖ అధికారుల నిర్లక్ష్యమో తెలియదు కానీ పెన్షనరలకు నిరీక్షణ తప్పడం లేదు. ఒకవేళ ఇప్పటికప్పుడు (మంగళవారం) ఆర్థిక శాఖ నిధులు విడుదల చేసినా పెన్షనర్లకు చేరేసరికి  మూడు నుంచి నాలుగు రోజులు పట్టే అవకాశం ఉందని, ఫలితంగా దీపావళి నాటికి  పెన్షనర్లకు పింఛన్లు అందజేసే అవకాశం లేదని సెర్ప్ అధికారులు సిబ్బంది చెబుతున్నారు.

 పెద్ద దిక్కులేని సెర్ప్...
 గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) పెద్దదిక్కు లేకుండాపోయింది. సెర్ప్ సీఈవోగా ఉన్న ఐఎఎస్ అధికారి మురళిని గత వారం బదిలీచేసిన ప్రభుత్వం ఆ పోస్టులో వేరెవరినీ నియమించలేదు. ఇన్‌చార్జి బాధ్యతలు చేపట్టాల్సిన అధికారి కూడా బిహార్ ఎన్నికల విధుల్లో ఉండడంతో కొద్దిరోజులుగా సెర్ప్ కార్యక్రమాలు పడకేశాయి. ఆసరా పెన్షన్లు, తెలంగాణ పల్లె ప్రగతి, పల్లె సమగ్ర సేవాకేంద్రాలు, స్వయం సహాయక సంఘాలకు డ్వాక్రా రుణాలు, జీవనోపాధుల కల్పన.. తదితర కార్యక్రమాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
 
 ఎన్నికలున్న జిల్లాలకు ఆగని పింఛన్లు!
 రాష్ట్రవ్యాప్తంగా ‘ఆసరా’లబ్ధిదారులకు నవంబర్ నెల పింఛన్ల పంపిణీ కోసం నిధులు విడుదల చేయని ప్రభుత్వం.. వరంగల్, హైదరాబాద్ జిల్లాల్లో మాత్రం పింఛన్ల పంపిణీని వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. వరంగల్ జిల్లాలో లోక్‌సభ ఉప ఎన్నికలు, హైదరాబాద్‌లో త్వరలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సర్కారు ఈ ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కారణాలతో పంపిణీ కాని పింఛన్ సొమ్మును ఈ రెండు జిల్లాల్లో లబ్ధిదారులకు అందించాలని సర్కారు సూచించింది. దీంతో పింఛన్ల పంపిణీ బాధ్యతలు నిర్వహిస్తున్న సెర్ప్ అధికారులు తమ వద్ద మిగిలి ఉన్న రూ.59 కోట్లలో వరంగల్ జిల్లాకు రూ.40 కోట్లు, హైదరాబాద్ జిల్లాకు రూ.19 కోట్లను తాజాగా విడుదల చేసినట్లు తెలిసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement