- బ్యాంకు వద్ద బారులు తీరుతున్న లబ్ధిదారులు
- అకౌంట్ కోసం తిప్పలు
- నగదు బదిలీ నేపథ్యంలోనే అవస్థలు
రేషన్... పరేషాన్
Published Mon, Jul 25 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
దహెగాం : ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాల్లో మార్పులు తెచ్చినప్పుడల్లా లబ్ధిదారులకు తిప్పలు తప్పడం లేదు. గతంలో గ్యాస్ సబ్సిడీ విషయంలో గ్యాస్ వినియోగదారులు ఏజెన్సీల చుట్టూ, గ్యాస్ పంపిణీదారుల చుట్టూ తిరుగుతూ అవస్థలు పడ్డారు. నేడు రేషన్ లబ్ధిదారులకూ ఆ తిప్పలు తప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం రేషన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి రేషన్ కొనుగోలు సమయంలో చెల్లించిన నగదును జమచేసే నూతన విధానాన్ని తీసుకురాబోతోంది. ఈ నేపథ్యంలోనే రేషన్ లబ్ధిదారులు పరేషాన్ అవుతున్నారు.
నగదు నేరుగా ఖాతాలో జమ కాబోతున్నందున బ్యాంక్ అకౌంట్ కోసం బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. నగదు బదిలీ పథకంలో భాగంగా రేషన్ లబ్ధిదారుల ఖాతాల్లో నగదు నేరుగా జమ కానున్నందున ప్రతి ఒక్కరికి బ్యాంకు అకౌంట్ తప్పని సరిగా ఉండాలని ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో రేషన్ లబ్ధిదారులు బ్యాంక్ అకౌంట్ కోసం తిప్పలు పడుతున్నారు. బ్యాంకు ఖాతా కోసం వ్యవసాయ పనులు వదిలి బ్యాంకుకు వచ్చినా పని కాకపోవడంతో రేషన్ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
10,821 మంది లబ్ధిదారులు
మండలంలో మొత్తం రేషన్ కార్డుల లబ్ధిదారులు 10,821 మంది ఉన్నారు. బ్యాంకు ఖాతాలు సుమారు 75 శాతం లబ్ధిదారులకు ఇది వరకే ఉన్నాయి. మిగతా 25 శాతం మందికి బ్యాంకు ఖాతాలు లేకపోవడంతో తిప్పలు పడుతున్నారు. ఖాతా తెరవడం కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. గంటల తరబడి బ్యాంకు వద్ద ఉన్నా పని పూర్తి కాకపోవడంతో మళ్లీ పని వదిలి రావాలా అని ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం బ్యాంకుల్లో రైతులకు పంట రుణాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు రద్దీగా మారాయి. దీంతో రేషన్ లబ్ధిదారుల ఖాతా పనులు ముందుకు సాగడం లేదనేది బ్యాంక్ అధికారుల వాదన.
వ్యవసాయ పనులు వదిలి
జనాలు అందరూ బ్యాంకుల చుట్టూ తిరుగుతుండడంతో చేళల్లో పనులు చేయడానికి కూలీలు దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. రేషన లబ్ధిదారులు దాదాపు వారం రోజులుగా బ్యాంకుల చుట్టూ తిరుగుతుండడంతో కూలీల కొరత ఏర్పడింది. బ్యాంక్ ఖాతా కోసం వచ్చిన చాలా మంది సైతం వ్యవసాయ పనులను వదిలేసి వచ్చామని తెలుపుతున్నారు.
అనేక ఇబ్బందుల్లో..
అకౌంట్ తెరవడానికి బ్యాంక్ అధికారులు ఫారాలను ఇస్తున్నారు. మండలంలో ఎక్కువశాతం లబ్ధిదారులు నిరక్షరాస్యులు కావడంతో అకౌంట్ ఫాం నింపడానికి ఇబ్బంది పడుతున్నారు. ఖాతా తెరవడానికి అధికారులు ఆలస్యం చేయడంతో వారి ఇబ్బందులు అధికమవుతున్నాయి. ఖాతా తెరవడానికి సంబంధించిన పత్రాలు ఏవేవీ అందజేయాలో తెలియక తికమక పడుతున్నారు.
Advertisement
Advertisement