నోట్ల రద్దుతో ప్రజలకు ఇక్కట్లు
నోట్ల రద్దుతో ప్రజలకు ఇక్కట్లు
Published Thu, Nov 24 2016 10:19 PM | Last Updated on Mon, Sep 4 2017 9:01 PM
* కేవీపీఎస్ రౌండ్ టేబుల్‌లో సమావేశంలో వక్తల ఆవేదన
విజయవాడ(లబ్బీపేట): పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు అల్లాడుతున్నారని వివిధ సంఘాల నాయకులు మండిపడ్డారు. ‘కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి(కేవీపీఎస్) ఆధ్వర్యంలో గురువారం ‘పెద్ద నోట్లు రద్దు– దళిత గిరిజన ప్రజల ఇక్కట్లు’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. స్థానిక గిరిపురం బాబూజగ్జీవన్‌రామ్ గ్రంథాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో పలు సంఘాలకు చెందిన నేతలు మాట్లాడుతూ నోట్ల రద్దు విషయంలో ప్రధాని క్షమాపణ చెప్పాలన్నారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన వాగ్దానం ప్రకారం జన్‌ధన్‌యోజన అకౌంట్‌లో రూ.10 వేలు వేయాలని డిమాండ్ చేశారు. కొత్త నోట్లు వచ్చేంత వరకూ పాత నోట్లు చలామణిలో ఉంచాలన్నారు. క్యూలైన్లలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులకు నవంబర్ జీతాలు నగదు రూపంలోనే చెల్లించాలని కోరారు. దేశంలో చలామణిలో ఉన్న నగదులో 86 శాతం రూ.500, రూ1000 నోట్లు ఉన్నాయని, 90 శాతం నగదు రూపంలోనే ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయని తెలిపారు. కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుట్టి రాయప్ప, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నత్తా యోనారాజు, ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు కె. ఏసు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె. సుబ్బరావమ్మ, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు జి.నటరాజు. మాతంగి దిలీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement