ప్రజలే మా బాసులు.. | people's are my boss | Sakshi
Sakshi News home page

ప్రజలే మా బాసులు..

Published Fri, Aug 26 2016 7:26 PM | Last Updated on Sat, Oct 20 2018 5:03 PM

ప్రజలే మా బాసులు.. - Sakshi

ప్రజలే మా బాసులు..

యాదగిరిగుట్ట : ప్రజలే మా బాసులు.. వాళ్లే మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును నిర్మించుకుంటారని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహరెడ్డి అన్నారు. మండలంలోని మైలార్‌గూడెంలో శుక్రవారం తన సమీప బంధువు కుమారుడి వివాహానికి హాజరయ్యారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపక్షాలే అవరోధాలు కలిగిస్తు.. తెలంగాణ ప్రజల నోట్లో మట్టిని కొట్టే కుతంత్రాలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజల ప్రయోజనాలను పక్కన పెట్టి రాజకీయ లబ్ధికోసం విపక్షాలు పాకులాడుతున్నాయని విమర్శించారు. ప్రతిపక్షాల కుట్రలను ప్రజలే తిప్పికొట్టి ప్రాజెక్టును నిర్మించుకొని తమ గ్రామాలను ససశ్యామలం చేసుకుంటారన్నారు. మల్లన్న సాగర్‌లోనే మీ బండారం బయట పడిందని ప్రతిపక్షాలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. విపక్షాల రెచ్చగొట్టే వాఖ్యలను ప్రజలు గుర్తించి ప్రాజెక్టు నిర్మాణానికి ముందుకు వచ్చారన్నారు. ఈ ప్రాజెక్టుతో నల్లగొండ జిల్లాలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలతో పాటు నిజామాబాద్, మెదక్, వరంగల్‌ జిల్లాలు ససశ్యామలం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో ఈ ప్రాంతాల ప్రజలకు నీటి కష్టాలు తీరుతాయని పేర్కొన్నారు. మిషన్‌ భగీరథ పథకంతో ఇంటిముందుకే మంచినీరు తెప్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. దీంతో ఆడపడుచులకు నీటి బాధలు తప్పుతాయని, ప్రతి గ్రామానికి కృష్ణా, గోదావరి నీటిని అందిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి కోసం భూసేకరణ చేస్తుంటే నోరుమెదపని ప్రతిపక్షాలు తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ భూసేకరణ జరుపుతుంటే అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు విపక్ష నేతలకు లేదన్నారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలకు ప్రజలే బుద్ధి చెబుతారని తెలిపారు. తెలంగాణ సర్కార్‌ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. రాష్ట్రం అభివృద్ధి అవుతున్న క్రమంలో ప్రతిపక్షాలు అడ్డుతగలడం సిగ్గు చేటన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ బస్సు యాత్ర చేపడుతారని వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునితమహేందర్‌రెడ్డి, ఎంపీపీ గడ్డమీది స్వప్న, టీఆర్‌ఎస్‌ యాదగిరిగుట్ట పట్టణ అధ్యక్షుడు కాటబత్తిని ఆంజనేయులు, యువజన విభాగం కన్వీనర్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్, నాయకులు కాంటేకార్‌ పవన్‌కుమార్‌ ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement