సమస్యలు పట్టించుకోరా?
నెల్లూరు(సెంట్రల్) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న జన్మభూమి సభలు రసాభాసగా మారుతున్నాయి. అధికారం చేతపట్టి మూడు సంవత్సరాలు కావస్తున్నా ఇంత వరకు తమ సమస్యలు పట్టించుకోకుండా సభలు, సమావేశాలతో సరిపెట్టడం ఏమిటని ప్రజల అటు అధికారులను, ఇటు అధికార పార్టీ నాయకులను నిలదీస్తున్నారు. ప్రధానంగా నిరుపేదలకు అవసరమైన రేషన్ కార్డులు, పక్కాగృహాలు, పింఛన్‌లు అర్హులైన వారికి ఇవ్వకపోవడంతో ఎక్కడిక్కడ జన్మభూమి సభలలో అధికార పార్టీ నాయకులను ప్రజలు నిలదీస్తున్నారు.
గెలిచిన తరువాత మా బాగోగులు పట్టించుకోకుండా ఏ మొహం పెట్టుకుని మా వద్దకు వస్తున్నారంటూ నిర్మొహమాటంగా ప్రశ్నిస్తున్నారు. సమస్యలు పరిష్కరించి సభలు పెట్టుకోమంటూ కరాఖండిగా ప్రజలు స్పష్టం చేస్తున్నారు. కొన్ని చోట్ల మీరు సభలు పెట్టుకోండి మేము మాత్రం రామంటూ ప్రజలు స్వచ్ఛందంగా బాయ్‌కాట్ చేస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీపై ఈ విధంగా ప్రజలలో వ్యతిరేకత ఉండటంతో అధికార పార్టీ నాయకులే నోరు వెళ్లబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
► కావలి పట్టణంలోని 14వ వార్డులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్నా ఇంత వరకు ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ఎక్కడ ఖర్చు పెట్టారని అధికారులను, అధికార పార్టీ నాయకులను నిలదీశారు. ఎమ్మెల్యే ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అధికార పార్టీకి చెందిన చోటా నాయకులు ఎమ్మెల్యే మాటలకు అడ్డుతగులుతూ గందరగోళం సృష్టించారు. ప్రజల తరఫున అడుగుతుంటే అడ్డుకుని గందరగోళం సృష్టించడం ఏమిటని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
► గూడూరు నియోజక వర్గంలోని వాకాడు మండలం కాశీపురం, కొండాపురం గ్రామాలలో జన్మభూమి సభలు నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి సుబ్రమణ్యం, ఎమ్మార్వో లావణ్య పాల్గొన్నారు. అధికార పార్టీ నాయకులు మాత్రం అక్కడ పరిస్థితిని చూసి మొహం చాటేశారనే విమర్శలు వినిపించాయి. గ్రామస్తులు మాత్రం పక్కా గృహాలు, రేషన్ కార్డులు, భూసమస్యలు పరిష్కరించలేదని వచ్చిన అధికారులను నిలదీశారు.
► ఎస్‌ఆర్‌పురం బసినేనిపల్లిలో గ్రామాలలో జన్మభూమి కార్యక్రమం జరిగింది. తాము మరుగుదొడ్లు కట్టుకున్నా వాటికి సంబంధించిన బిల్లులు మాత్రం ఇవ్వడం లేదని గ్రామస్తులు వచ్చిన అధికారులు, నాయకులను నిలదీశారు.
► ఆత్మకూరు నియోజకవర్గం అనుమసముద్రంపేట మండలంలోని గుడిపాడులో గ్రామసభ జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సమస్యలు పరిష్కరించకుండా మొక్కుబడిగా పెన్షన్లు, రేషన్‌కార్డులు పంచడానికి జన్మభూమి సభలెందుకని ప్రత్యేకాధికారి నారాయణమ్మను గ్రామస్తులు నిలదీశారు.
► సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పెళ్లకూరు మండలంలో ఉన్న అర్ధమాల, పునబాక గ్రామాల్లో జన్మభూవి గ్రామసభలు జరిగాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు పింఛన్లు ఇవ్వకుండా జన్మభూమి ఎందుకని అధికారులను ప్రశ్నించారు.
► ఇవే కాక చాలా నియోజక వర్గాల్లో కూడా జనం అధికారులు, అధికారపార్టీ నాయకులను నిలదీశారు. పలుచోట్ల సభలకు జనం రాలేదు.