Janmabhoomi meetings
-
పింఛన్ ఇక రూ.2 వేలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సంక్రాంతి కానుకగా పింఛను మొత్తాన్ని రూ. వెయ్యి నుంచి రూ.2 వేలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ నెల నుంచే దీన్ని అమలు చేస్తామన్నారు. అయితే ఈనెల మిగిలిన రూ.వెయ్యిని కలిపి ఫిబ్రవరిలో రూ.మూడు వేలు ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత నుంచి నెలకు రూ.రెండు వేలు చొప్పున పింఛన్ అందుతుందని వివరించారు. జన్మభూమి – మాఊరు 6వ విడత ముగింపు కార్యక్రమాన్ని శుక్రవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బోగోలు మండలంలో సీఎం పర్యటించారు. చిప్పలేరు హైలెవల్ వంతెన ప్రారంభించిన అనంతరం శ్రీపొట్టి శ్రీరాములు స్వగ్రామంలో స్మారక భవనాన్ని సందర్శించి విగ్రహన్ని ఆవిష్కరించారు. రూ.110 కోట్లతో జువ్వల దిన్నె గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. బోగోలు జన్మభూమి సభలో సీఎం మాట్లాడుతూ పింఛన్ల ద్వారా 54 లక్షల మందికి మేలు జరుగుతోందని చెప్పారు. విద్యార్థినుల కోసం రక్ష పథకం పేరుతో రేషన్ షాపుల ద్వారా శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేస్తామని తెలిపారు. విలేజ్ డెవలప్మెంట్ ప్లాను, వార్డు డెవలప్మెంట్ ప్లానుకు కూడ ఈ సభ నుంచే శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో 66,276 ఎకరాల సీజెఎఫ్ఎస్ భూములకు పట్టాలు ఇచ్చి పసుపు కింద మహిళలకు పంపిణీ చేసే కార్యక్రమం ఈవేదిక నుంచే నిర్వహిస్తున్నామని చెప్పారు. రుణమాఫీ మిగిలిన మొత్తాన్ని 10 శాతం వడ్డీతో ఈనెలలోనే విడుదల చేస్తామన్నారు. ఏప్రిల్ నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిని రూ. 5 లక్షలకు పెంచుతామన్నారు. పోలవరం ద్వారా గ్రావిటీతో మే నెలలో నీటిని విడుదల చేసి డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. ప్రతి ఇంటికి ఒక స్మార్ట్ ఫోన్ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. అనంతరం దగదర్తి మండలం దామవరం గ్రామంలో 1,379.71 ఎకరాల్లో నెల్లూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పి. నారాయణ, మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యేలు పాశం సునీల్ కుమార్, కురుగొండ్ల రామకృష్ణ,పొలంరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లినేని రామారావు,ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, రాజధాని నిర్మాణ కమిటీ సభ్యుడు బీదా మస్తానరావు పాల్గొన్నారు. -
జన్మభూమి సభలకూ పిల్లలే దిక్కు
నెల్లూరు (టౌన్) : జన్మభూమి–మా ఊరు సభలకూ విద్యార్థులే దిక్కయ్యారు. గ్రామసభలకు ఆశించిన స్థాయిలో ప్రజలు రాకపోవడంతో పాఠశాలలకు అనధికారికంగా సెలవులు ప్రకటించి విద్యార్థులను తరలిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చి హా మీ లను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైన నేపథ్యంలో.. చంద్రబాబు చెప్పే మాటలను ప్రజలు నమ్మడం లేదు. దీంతో గ్రామసభలు జనం రాక వెలవెలబోతున్నాయి.ఈ నేపథ్యంలో నెల్లూరు రూరల్ మండలం కోడూరుపాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న సభకు విద్యార్థులను పెద్దఎత్తున తరలిం చారు. సోమవారం కావలిలో నిర్వహించిన జన్మభూమి గ్రామ సభకు గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వచ్చారు. ఈ సభకు కూడా విద్యార్థులను తరలించారు. అంతకుముందు నగరంలోని వెంకటేశ్వపురం జనార్దనరెడ్డి కాలనీలో నిర్మిస్తున్న ‘హౌస్ ఫర్ ఆల్’ ఇళ్లను లోకేష్ పరిశీలించారు. ఈ కార్యక్రమానికి కూడా విద్యార్థులను, స్కూల్ బస్సులను బలవతంగా పంపించారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం జన్మభూమి సభలకు విద్యార్థులను తరలించడంపై వారి తల్లి దండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాయకులు, రాజకీయ కార్యక్రమాలకు విద్యార్థులను తీసుకెళ్లడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సంక్రాంతి సెలవుల అనంతరం రెండో సమ్మెటివ్ పరీక్షలు జరగనున్నాయి. ఈ తరుణంలో పాఠాలు చెప్పకుండా సెలవులు ఇచ్చి విద్యార్థులను తీసుకెళితే సిలబస్ ఎప్పుడు పూర్తిచేస్తారని నిలదీస్తున్నారు. ఓ వైపు కార్యాలయాల్లో అధికారులు లేకుండా చేస్తున్న ప్రభుత్వం మరోవైపు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను, చివరకు విద్యార్థులను సైతం సభలకు తరలిం చడం దారుణమంటున్నారు. కోడూరుపాడులో జరిగిన చంద్రబాబు సభకు మున్సిపల్, జెడ్పీ హైస్కూల్స్ విద్యార్థులను తీసుకెళ్లిన విషయం విదితమే. బలవంతంగా స్కూల్ బస్సుల తరలింపు మరోవైపు జన్మభూమి సభలకు ప్రజలను తరలించేం దుకు స్కూల్స్ బస్సులను వినియోగిస్తున్నారు. నిబం ధనల ప్రకారం స్కూల్ బస్సులను ఇలాంటి కార్యక్రమాలకు వినియోగించకూడదు. అధికారి పార్టీ నేతలు విజయవాడ, గుంటూరులలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలను బెదిరించి మరీ స్కూల్ బస్సులను పంపించాలని రవాణా శాఖ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం సీరియస్ అయ్యారు. స్కూల్ బస్సులను ఇతర కార్యక్రమాలకు వినియోగించకూడదంటూ 2015 ఫిబ్రవరి 16న 482/3 నంబర్‌తో కలెక్టర్లు, రవాణా శాఖ కార్యాలయాలకు సర్క్యులర్ జారీ చేశారు. అయినా.. రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. సభలకు స్కూల్ బస్సులను పంపించే విషయంలో రవాణా శాఖ ఉప కమిషనర్ ఎన్.శివరాంప్రసాద్ అత్యుత్సాహం ప్రదర్శించారు. చంద్రబాబు సభకు 370 బస్సుల్ని పంపించగా,లోకేష్ సభకు 150కు పైగా బస్సులను పం పిం చారు. ఆ బస్సులకు దగ్గరుండి డీజిల్ కొట్టించి రవాణా శాఖ పేరుమీద టోకెన్ ఇచ్చారు. ఆర్టీసీ బస్సులను పంపిస్తే.. సంస్థకు ఆదాయం లభించేదని పలువురు పేర్కొంటున్నారు. -
ఆశగా వెళ్లి.. బిక్కమొహంతో వెనక్కి
జంగారెడ్డిగూడెంకు చెందిన ఎన్.వెంకటేశ్వరరావు హోటల్లో పనిచేస్తారు. రేషన్‌కార్డు లేదు. జన్మభూమి సందర్భంగా ఇస్తారంటే దరఖాస్తు చేసుకున్నారు. కానీ రేషన్‌కార్డు మంజూరు కాలేదు. ఏం జరిగింది అని ఆరా తీస్తే ఈయనకు నాలుగు చక్రాల వాహనం ఉందంట. అందుకని రేషన్‌కార్డు ఇవ్వలేదు. ప్రజాసాధికార సర్వేలో ఈయనకు నాలుగు చక్రాల వాహనం ఉన్నట్లు నమోదు కావడంతో రేషన్‌కార్డు తిరస్కరించారు. ఆయనకు కనీసం ద్విచక్ర వాహనం కూడా లేదు. ఇదేంటని అధికారులను అడిగితే మాకేం తెలియదని సమాధానం చెబుతున్నారు. జంగారెడ్డిగూడెం: ఏ ఒక్క పేద కుటుంబం రేషన్‌కార్డు లేకుండా ఉండకూడదు. 5వ విడత జన్మభూమిలో రేషన్‌కార్డు లేని కుటుంబాలు అన్నింటికీ కార్డులు ఇస్తాం. ఇదీ ప్రభుత్వ ప్రకటన. అయితే ఆచరణలో మాత్రం కానరావడం లేదు. రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారంతా తమకు కార్డులు వస్తాయని ఆశగా జన్మభూమి సభలకు వెళితే, అక్కడ తమకు కార్డు రాలేదని అధికారులు వెనక్కి పంపించేస్తున్నారు. దీంతో దరఖాస్తుదారులు బిక్కమొహంతో వెనుదిరుగుతున్నారు. రేషన్‌కార్డు అనేది ప్రస్తుతం అందరికీ అవసరమే. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు, ఇతర అవసరాలకు, గుర్తింపు కార్డులుగా కూడా ఉపయోగపడుతోంది. దీంతో సగటు మనిషి రేషన్ కార్డు కోసం కాళ్ళరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ దరఖాస్తులు చేస్తూనే ఉన్నాడు. ప్రభుత్వ పథకాలు గతంలో ఏడాదిలో ఎప్పుడైనా అందించే వారు. కాని ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువగా ప్రభుత్వ పథకాలను జన్మభూమి మా ఊరు గ్రామసభలు నిర్వహించి అందులో మాత్రమే అందిస్తుంది. దీంతో గ్రామసభలు జరిగిన ప్రతీసారి రేషన్‌కార్డులు కోసం ఎదరుచూడటం, అదే గ్రామసభల్లో రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవడం పరిపాటిగా మారింది. అయితే కార్డుల కోసం డిమాండ్ ఉన్నప్పటికీ ప్రభుత్వం మంజూరు చేసే సమయంలో కొర్రీలు వేసి ఇవ్వడం లేదు. రేషన్‌కార్డు దరఖాస్తును ప్రభుత్వం ఆన్లైన్లో ప్రజాసాధికార సర్వేను ఆనుసంధానం చేసింది. దీంతో 70శాతం మంది అనర్హులుగా గుర్తించింది. ప్రజాసాధికార సర్వే సక్రమంగా జరగకపోవడంతో అర్హులకు రేషన్‌కార్డు మంజూరు భ్రమే అని తేలిపోయింది. ఇల్లున్నా, వాహనం ఉన్నా కార్డు ఇవ్వరట ప్రజా సాధికార సర్వే ప్రకారం రేషన్‌కార్డు దరఖాస్తు దారుడికి ఇల్లు ఉన్నా రేషన్‌కార్డు మంజూరుకాదట. అలాగే నాలుగు చక్రాల వాహనం ఉన్నా రేషన్‌కార్డు దరఖాస్తు ఆన్లైన్లో తిరస్కరణకు గురవుతోంది. ఉపాధి కోసం నాలుగు చక్రాల వాహనం తిప్పుకుంటూ జీవనోపాధి పొందుతున్న వారికి రేషన్‌కార్డులు మంజూరుకావడం లేదు. ప్రజాసాధికార సర్వేలో పలు ఆప్షన్లను రేషన్‌కార్డు దరఖాస్తుకు అనుసంధానం చేయడంతో తిరస్కరణకు గురైన దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి. ఇలా ప్రజాసాధికార సర్వే ప్రకారం ఆన్లైన్లో దరఖాస్తుచేస్తే చేసిన చాలా మందికి రేషన్‌కార్డు మంజూరు కాలేదు. ప్రజాసాధికార సర్వే సరిగా జరగకపోవడంతో అర్హులైన వారు కూడా రేషన్‌కార్డులు మంజూరు కాలేదు. ఇల్లు లేని వారికి ఇల్లు ఉన్నట్లు, వాహనం లేని వారికి వాహనం ఉన్నట్లు ప్రజా సాధికార సర్వేలో నమోదు కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో జన్మభూమి సభల్లో రేషన్‌కార్డు కోసం వెళ్లి, అది మంజూరు కాక బేలగా వెనుదిరుగుతూ ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు. జిల్లాలో ఇవీ వివరాలు జిల్లాలో సుమారు 34వేల మంది రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా, వీటిలో 11 వేల మందికి మాత్రమే రేషన్‌కార్డులు మంజూరయ్యాయి. మిగిలిన దరఖాస్తులన్నీ తిరస్కరణకు గురయ్యాయి. ప్రతీ మండలంలోను వేలాది కార్డులు ప్రజాసాధికార సర్వే ప్రకారం తిరస్కరణకు గురయ్యాయి. ఉదాహరణకు జంగారెడ్డిగూడెం మండలంలో సుమారు 6వేల మంది రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా, కేవలం 259 మందికి మాత్రమే రేషన్‌కార్డులు మంజూరు అయ్యాయి. మిగిలిన వారందరికీ మంజూరు కాలేదు. ఇలా ప్రతీ మండలంలోను వేలాది మంది దరఖాస్తు చేసుకుంటే వందల్లో మంజూరయ్యాయి. తాడేపల్లిగూడెంకు చెందిన కె.హరిబాబుకు మూడేళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి కార్డు కోసం దరఖాస్తు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ రాలేదు. ఈసారి జన్మభూమిలో వస్తుందేమో అని మరోసారి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ దఫా కూడా జాబితాలో ఆయన పేరు లేదు. దీంతో తీవ్ర నిరాశతో ఉన్నారు. చేసేది చిరుద్యోగం. ఉన్న కొద్దిపాటి సంపాదనతో బయట నిత్యావసరాలు కొనుక్కోవాలంటే ఇబ్బందులు పడుతున్నారు. రేషన్‌కార్డు వస్తే నిత్యావసరాలు ఆసరాగా వస్తాయని ఆశ. కాని రేషన్‌కార్డు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. -
సభ..రభస
నెల్లూరు(సెంట్రల్) : నిరసనలు, నిలదీతలు, బాయ్కాట్లతో జన్మభూమి సభలు రసాభాసగా మారాయి. జిల్లాలో జరుగుతున్న అధికశాతం సభల్లో అధికారులు, టీడీపీ నాయకులకు నిరసనసెగలు తగులుతున్నారుు. అబద్ధాలు చెప్పడానికి సభలెందకంటూ ఓ చోట.. గత జన్మభూమి సభలలో చెప్పిన వాగ్దానాలకే దిక్కులేదు, ఇప్పుడు చెప్పేవి ఇంకెప్పుడు చేస్తారంటూ మరో చోట.. ఇలా నిలదీతలు సర్వసాధారణమయ్యారుు. సోమవారం జరిగిన సభల్లో కూడా బాయ్కాట్లు చోటుచేసుకున్నాయి. ► వెంకటగిరి మండలంలోని పాళెంకోట గ్రామంలో సోమవారం గ్రామసభలు నిర్వహించేందుకు ఆ గ్రామానికి వస్తున్న అధికారులను పొలిమేరల్లోనే అడ్డుకున్నారు. దారిలో కంపను వేసి వాహనాలను రాకుండా అడ్డుకున్నారు. తమ గ్రామంలో కనీసపు స్థారుులో కూడా అభివృద్ధి పనులు చేయలేదని, ఎమ్మెల్యే వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చివరకు పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ► మనుబోలు మండలం కట్టువపల్లిలో జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తుండగా గ్రామస్తులు సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, సాగునీరు విడుదల చేసే వరకు జన్మభూమి సభలను జరగనివ్వమని రైతులు గ్రామసభను అడ్డుకున్నారు. చెరువును పరిశీలించి కలెక్టర్‌కు నివేదిక ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేయడంతో ఎంపీడీఓ హేమలత, ఇరిగేషన్ ఏఈ ఠాగూర్ చెరువును పరిశీలించారు. ► పొదలకూరు మండలం నావురుపల్లిలో జరిగిన కార్యక్రమంలో గ్రామస్తులు సభను బాయ్‌కాట్ చేశారు. కొంతకాలంగా మైనింగ్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని అధికారులకు విన్నవించుకుంటున్నా పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేశారు. మైనింగ్ సమస్యపై అధికారులకు వినతిపత్రం ఇచ్చి వెళ్లిపోయారు. దీంతో అధికారులు చేసేదేమీ లేక వెనుదిరగాల్సి వచ్చింది. ► ఉదయగిరి మండలం గండిపాళెంలో జరిగిన జ న్మభూమి - మా ఊరు కార్యక్రమంలో ఏపీఓను ఉ పాధి పనులలో సమస్యలపై గ్రామస్తులు నిలదీశారు. ► నెల్లూరు రూరల్ పరిధిలోని వనంతోపు సెంటరులో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో కనీసం తాగు నీరు ఇవ్వని ప్రభుత్వం మీదని, ఎందుకు ఈ సభలు పెడుతున్నారని టీడీపీ నాయకులను స్థానిక ప్రజలు నిలదీశారు. ► వెంకటగిరి నియోజక వర్గంలో జరిగే జన్మభూమి సభలకు సంబందించిన అధికారిక తేదీలను ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ మార్చేశారు. తనకు ఇష్టమొచ్చినట్లు చేస్తామని చెబుతూ నియోజక వర్గంలోని అధికారులందరిని ఒకే మండలానికి తీసుకుని వచ్చి అధికారిక తేదీలలో కాకుండా తను నిర్ణరుుంచిన తేదీలలో నిర్వహించడం గమనార్హం. ఎమ్మెల్యే తీరుతో అధికారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
సమస్యలు పట్టించుకోరా?
నెల్లూరు(సెంట్రల్) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న జన్మభూమి సభలు రసాభాసగా మారుతున్నాయి. అధికారం చేతపట్టి మూడు సంవత్సరాలు కావస్తున్నా ఇంత వరకు తమ సమస్యలు పట్టించుకోకుండా సభలు, సమావేశాలతో సరిపెట్టడం ఏమిటని ప్రజల అటు అధికారులను, ఇటు అధికార పార్టీ నాయకులను నిలదీస్తున్నారు. ప్రధానంగా నిరుపేదలకు అవసరమైన రేషన్ కార్డులు, పక్కాగృహాలు, పింఛన్లు అర్హులైన వారికి ఇవ్వకపోవడంతో ఎక్కడిక్కడ జన్మభూమి సభలలో అధికార పార్టీ నాయకులను ప్రజలు నిలదీస్తున్నారు. గెలిచిన తరువాత మా బాగోగులు పట్టించుకోకుండా ఏ మొహం పెట్టుకుని మా వద్దకు వస్తున్నారంటూ నిర్మొహమాటంగా ప్రశ్నిస్తున్నారు. సమస్యలు పరిష్కరించి సభలు పెట్టుకోమంటూ కరాఖండిగా ప్రజలు స్పష్టం చేస్తున్నారు. కొన్ని చోట్ల మీరు సభలు పెట్టుకోండి మేము మాత్రం రామంటూ ప్రజలు స్వచ్ఛందంగా బాయ్‌కాట్ చేస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీపై ఈ విధంగా ప్రజలలో వ్యతిరేకత ఉండటంతో అధికార పార్టీ నాయకులే నోరు వెళ్లబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ► కావలి పట్టణంలోని 14వ వార్డులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్నా ఇంత వరకు ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ఎక్కడ ఖర్చు పెట్టారని అధికారులను, అధికార పార్టీ నాయకులను నిలదీశారు. ఎమ్మెల్యే ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అధికార పార్టీకి చెందిన చోటా నాయకులు ఎమ్మెల్యే మాటలకు అడ్డుతగులుతూ గందరగోళం సృష్టించారు. ప్రజల తరఫున అడుగుతుంటే అడ్డుకుని గందరగోళం సృష్టించడం ఏమిటని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ► గూడూరు నియోజక వర్గంలోని వాకాడు మండలం కాశీపురం, కొండాపురం గ్రామాలలో జన్మభూమి సభలు నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి సుబ్రమణ్యం, ఎమ్మార్వో లావణ్య పాల్గొన్నారు. అధికార పార్టీ నాయకులు మాత్రం అక్కడ పరిస్థితిని చూసి మొహం చాటేశారనే విమర్శలు వినిపించాయి. గ్రామస్తులు మాత్రం పక్కా గృహాలు, రేషన్ కార్డులు, భూసమస్యలు పరిష్కరించలేదని వచ్చిన అధికారులను నిలదీశారు. ► ఎస్ఆర్పురం బసినేనిపల్లిలో గ్రామాలలో జన్మభూమి కార్యక్రమం జరిగింది. తాము మరుగుదొడ్లు కట్టుకున్నా వాటికి సంబంధించిన బిల్లులు మాత్రం ఇవ్వడం లేదని గ్రామస్తులు వచ్చిన అధికారులు, నాయకులను నిలదీశారు. ► ఆత్మకూరు నియోజకవర్గం అనుమసముద్రంపేట మండలంలోని గుడిపాడులో గ్రామసభ జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సమస్యలు పరిష్కరించకుండా మొక్కుబడిగా పెన్షన్లు, రేషన్‌కార్డులు పంచడానికి జన్మభూమి సభలెందుకని ప్రత్యేకాధికారి నారాయణమ్మను గ్రామస్తులు నిలదీశారు. ► సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పెళ్లకూరు మండలంలో ఉన్న అర్ధమాల, పునబాక గ్రామాల్లో జన్మభూవి గ్రామసభలు జరిగాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు పింఛన్లు ఇవ్వకుండా జన్మభూమి ఎందుకని అధికారులను ప్రశ్నించారు. ► ఇవే కాక చాలా నియోజక వర్గాల్లో కూడా జనం అధికారులు, అధికారపార్టీ నాయకులను నిలదీశారు. పలుచోట్ల సభలకు జనం రాలేదు. -
రచ్చ..రచ్చ...
విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో శనివారం జన్మభూమి గ్రామసభలను ప్రా రంభించారు. తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యాలు, బూతుపురాణాలు చోటుచేసుకున్నాయి. మరికొన్ని చోట్ల అధికారులను నిలదీశారు. అధికారుల తరఫున తెలుగు దేశం పార్టీ నాయకులే సమాధానం చెప్పడంతో ప్రజలు ఈ గ్రామసభలను బహిష్కరించారు. మక్కువ మండలం పనసభద్రలో గత జన్మభూమి వినతులే ఇంకా పరిష్కరించలేదని ఇప్పుడు మరో విడత గ్రామ సభలు ఎందుకని సర్పంచ్, ఎంపీటీసీలు రత్నాల పార్వతి, గంట అప్పలస్వామి, ప్రజలు నిలదీశారు. 2.70లక్షల ఉపాధి వేతనాలు ఇవ్వలేదని, రుణాలు మంజూరు చేయలేదని నిలదీశారు. సఎం సందేశం చదువుతుండగానే సభను బహిష్కరించామని చెప్పడంతో తరువాత అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పార్వతీపురంలో నిర్వహించిన గ్రామసభలో వైఎస్సార్సీపీ, సీపీఎం కార్యకర్తలు నాయకులు గత జన్మభూమి వినతుల గురించి ప్రశ్నించారు. దీనికి టీడీపీ నాయకులు అధికారుల తరపున వకాల్తా పుచ్చుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ నాయకులు వ్యక్తి గత దూషణలకు దిగారు. బూతు పురాణాలు లంకించుకున్నారు. సభ మొత్తం రసాభాసగా మారింది. ఈ సందర్బంగా ఒకరిపైకి మరొకరు దూసుకురావడంతో పాటు తోపులాటలు జరిగాయి. విజయనగరం మున్సిపాలిటీలోని 15వ వార్డులోని రామకృష్ణ నగర్లో తాగునీరు, విద్యుత్ దీపాల ఏర్పా టు చేయాలని లేకుంటే ఈ సభలు నిర్వహించవద్దని సీపీఎం నాయకులు అధికారులను నిలదీశారు. ప్రా రంభంలోనే అడ్డుకోవడంతో నగరపాలక కమిషనర్ నాగరాజు హామీ ఇవ్వడంతో సభను నడిపించారు. ఒకటవ వార్డులో గతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన వారికే జీప్లస్ ఇళ్లు కేటాయించాలని వైఎస్సార్సీపీ నాయకులు అధికారులను డిమాండ్ చేశారు. గత జన్మభూమి వినతులు ఎందుకు పరిష్కారం కాలేదని నిలదీశారు. విజయనగరం మండలం నారాయణ పురం గ్రామంలో పింఛన్లు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే టీడీపీ నాయకుల కుటుంబాలు, కార్యకర్తలకే ఇస్తున్నారనీ కూలిపోయిన ఇళ్లకు పరిహారాలు ఇవ్వలేదని చదువుల ఎల్లం నాయుడు, గుడారి పైడితల్లిలు నిలదీశారు. దీంతో జడ్పీటీసీ తుంపిల్లి రమణ మాట్లాడుతూ దరఖాస్తులు ఇస్తే మరోసారి పరిశీలిస్తామన్నారు. ఎన్ని సార్లు ఇవ్వాలి? ఎంతమందికి ఇవ్వాలని ప్రశ్నించడంతో మీరు మాట్లాడితే పోలీసులతో చెప్పి బయటకు గెంటేయిస్తామని అనడంతో సభలో దుమారం చెలరేగింది. సీతానగరం మండలం బూర్జ, పెదంకలాం, కృష్ణరాయపురం, సుమిత్రాపురం గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదనీ, రేషన్ కార్డులు తొలగిస్తున్నారనీ అధికారులను నిలదీశారు. బూర్జలో కొనుగోలు కేంద్రం మంజూరు చేసినా ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదని మరి ఎందుకు వీటిని ఏర్పాటు చేసినట్టోనని ప్రశ్నించారు. చీపురుపల్లి మండలం దేవరపొదిలాంలో గత ప్రభుత్వ హయాంలో 223 ఇళ్లు మంజూరై వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నప్పటికీ వాటిని ఎందుకు రద్దు చేశారని విజయనగరం పార్లమెంటరీ ఇన్చార్జి వైఎస్సార్ సీపీ నాయకుడు బెల్లాన చంద్రశేఖర్ అధికారులను నిలదీశారు. అన్యాయంగా స్కూల్ మూసేయడంతో తమ గ్రామంలోని 26 మంది విద్యార్థులు చదువుల్లేకుండా పోతున్నారని దీనిపై నాయకులు, అధికారులెందరికో మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా ఇప్పుడీ జన్మభూమి ఎందుకని ఎస్ కోట మండలం ముషిడిపల్లి గ్రామ విద్యార్థులు, గ్రామస్థులు జన్మభూమి బృందాన్ని రోడ్డుపైనే అడ్డుకున్నారు.