రచ్చ..రచ్చ... | Janmabhoomi meetings in Vizianagaram | Sakshi
Sakshi News home page

రచ్చ..రచ్చ...

Published Sun, Jan 3 2016 1:00 AM | Last Updated on Sun, Sep 3 2017 2:58 PM

Janmabhoomi meetings in Vizianagaram


 విజయనగరం కంటోన్మెంట్:  జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో శనివారం జన్మభూమి గ్రామసభలను ప్రా రంభించారు. తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యాలు, బూతుపురాణాలు చోటుచేసుకున్నాయి. మరికొన్ని చోట్ల అధికారులను నిలదీశారు. అధికారుల తరఫున తెలుగు దేశం పార్టీ నాయకులే సమాధానం చెప్పడంతో ప్రజలు ఈ గ్రామసభలను బహిష్కరించారు.  మక్కువ మండలం పనసభద్రలో గత జన్మభూమి వినతులే ఇంకా పరిష్కరించలేదని ఇప్పుడు మరో విడత గ్రామ సభలు ఎందుకని సర్పంచ్, ఎంపీటీసీలు రత్నాల పార్వతి, గంట అప్పలస్వామి, ప్రజలు నిలదీశారు.
 
 2.70లక్షల ఉపాధి వేతనాలు ఇవ్వలేదని, రుణాలు మంజూరు చేయలేదని నిలదీశారు.  సఎం సందేశం చదువుతుండగానే సభను బహిష్కరించామని చెప్పడంతో తరువాత అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పార్వతీపురంలో నిర్వహించిన గ్రామసభలో వైఎస్సార్‌సీపీ, సీపీఎం కార్యకర్తలు నాయకులు గత జన్మభూమి వినతుల గురించి ప్రశ్నించారు. దీనికి టీడీపీ నాయకులు అధికారుల తరపున వకాల్తా పుచ్చుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ నాయకులు వ్యక్తి గత దూషణలకు దిగారు. బూతు పురాణాలు లంకించుకున్నారు. సభ మొత్తం రసాభాసగా మారింది. ఈ సందర్బంగా ఒకరిపైకి మరొకరు దూసుకురావడంతో పాటు తోపులాటలు జరిగాయి.
 
  విజయనగరం మున్సిపాలిటీలోని 15వ వార్డులోని రామకృష్ణ నగర్‌లో తాగునీరు, విద్యుత్ దీపాల ఏర్పా టు చేయాలని లేకుంటే ఈ సభలు నిర్వహించవద్దని సీపీఎం నాయకులు అధికారులను నిలదీశారు. ప్రా రంభంలోనే అడ్డుకోవడంతో నగరపాలక కమిషనర్ నాగరాజు హామీ ఇవ్వడంతో సభను నడిపించారు.   ఒకటవ వార్డులో గతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన వారికే జీప్లస్ ఇళ్లు కేటాయించాలని వైఎస్సార్‌సీపీ నాయకులు అధికారులను డిమాండ్ చేశారు. గత జన్మభూమి వినతులు ఎందుకు పరిష్కారం కాలేదని నిలదీశారు.
 
  విజయనగరం మండలం నారాయణ పురం గ్రామంలో పింఛన్లు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే టీడీపీ నాయకుల కుటుంబాలు, కార్యకర్తలకే ఇస్తున్నారనీ కూలిపోయిన ఇళ్లకు పరిహారాలు ఇవ్వలేదని చదువుల ఎల్లం నాయుడు, గుడారి పైడితల్లిలు నిలదీశారు. దీంతో జడ్పీటీసీ తుంపిల్లి రమణ మాట్లాడుతూ దరఖాస్తులు ఇస్తే మరోసారి పరిశీలిస్తామన్నారు. ఎన్ని సార్లు ఇవ్వాలి? ఎంతమందికి ఇవ్వాలని ప్రశ్నించడంతో మీరు మాట్లాడితే పోలీసులతో చెప్పి బయటకు గెంటేయిస్తామని అనడంతో సభలో దుమారం చెలరేగింది.
 
  సీతానగరం మండలం బూర్జ, పెదంకలాం, కృష్ణరాయపురం, సుమిత్రాపురం గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదనీ, రేషన్ కార్డులు తొలగిస్తున్నారనీ అధికారులను నిలదీశారు. బూర్జలో కొనుగోలు కేంద్రం మంజూరు చేసినా ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదని మరి ఎందుకు వీటిని ఏర్పాటు చేసినట్టోనని ప్రశ్నించారు.   చీపురుపల్లి మండలం దేవరపొదిలాంలో గత ప్రభుత్వ హయాంలో 223 ఇళ్లు మంజూరై వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నప్పటికీ వాటిని ఎందుకు రద్దు చేశారని విజయనగరం పార్లమెంటరీ ఇన్‌చార్జి వైఎస్సార్ సీపీ నాయకుడు బెల్లాన చంద్రశేఖర్ అధికారులను నిలదీశారు.  
 
  అన్యాయంగా స్కూల్ మూసేయడంతో తమ గ్రామంలోని 26 మంది విద్యార్థులు చదువుల్లేకుండా పోతున్నారని దీనిపై నాయకులు, అధికారులెందరికో మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా ఇప్పుడీ జన్మభూమి ఎందుకని ఎస్ కోట మండలం ముషిడిపల్లి గ్రామ విద్యార్థులు, గ్రామస్థులు జన్మభూమి బృందాన్ని రోడ్డుపైనే అడ్డుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement