జంగారెడ్డిగూడెంకు చెందిన ఎన్.వెంకటేశ్వరరావు హోటల్‌లో పనిచేస్తారు. రేషన్‌కార్డు లేదు. జన్మభూమి సందర్భంగా ఇస్తారంటే దరఖాస్తు చేసుకున్నారు. కానీ రేషన్‌కార్డు మంజూరు కాలేదు. ఏం జరిగింది అని ఆరా తీస్తే ఈయనకు నాలుగు చక్రాల వాహనం ఉందంట. అందుకని రేషన్‌కార్డు ఇవ్వలేదు. ప్రజాసాధికార సర్వేలో ఈయనకు నాలుగు చక్రాల వాహనం ఉన్నట్లు నమోదు కావడంతో రేషన్‌కార్డు తిరస్కరించారు. ఆయనకు కనీసం ద్విచక్ర వాహనం కూడా లేదు. ఇదేంటని అధికారులను అడిగితే మాకేం తెలియదని సమాధానం చెబుతున్నారు.
జంగారెడ్డిగూడెం: ఏ ఒక్క పేద కుటుంబం రేషన్‌కార్డు లేకుండా ఉండకూడదు. 5వ విడత జన్మభూమిలో రేషన్‌కార్డు లేని కుటుంబాలు అన్నింటికీ కార్డులు ఇస్తాం. ఇదీ ప్రభుత్వ ప్రకటన. అయితే ఆచరణలో మాత్రం కానరావడం లేదు. రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారంతా తమకు కార్డులు వస్తాయని ఆశగా జన్మభూమి సభలకు వెళితే, అక్కడ తమకు కార్డు రాలేదని అధికారులు వెనక్కి పంపించేస్తున్నారు. దీంతో దరఖాస్తుదారులు బిక్కమొహంతో వెనుదిరుగుతున్నారు. రేషన్‌కార్డు అనేది ప్రస్తుతం అందరికీ అవసరమే. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు, ఇతర అవసరాలకు, గుర్తింపు కార్డులుగా కూడా ఉపయోగపడుతోంది. దీంతో సగటు మనిషి రేషన్ కార్డు కోసం కాళ్ళరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ దరఖాస్తులు చేస్తూనే ఉన్నాడు. ప్రభుత్వ పథకాలు గతంలో ఏడాదిలో ఎప్పుడైనా అందించే వారు. కాని ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువగా ప్రభుత్వ పథకాలను జన్మభూమి మా ఊరు గ్రామసభలు నిర్వహించి అందులో మాత్రమే అందిస్తుంది.
దీంతో గ్రామసభలు జరిగిన ప్రతీసారి రేషన్‌కార్డులు కోసం ఎదరుచూడటం, అదే గ్రామసభల్లో రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవడం పరిపాటిగా మారింది. అయితే కార్డుల కోసం డిమాండ్ ఉన్నప్పటికీ ప్రభుత్వం మంజూరు చేసే సమయంలో కొర్రీలు వేసి ఇవ్వడం లేదు. రేషన్‌కార్డు దరఖాస్తును ప్రభుత్వం ఆన్‌లైన్‌లో ప్రజాసాధికార సర్వేను ఆనుసంధానం చేసింది. దీంతో 70శాతం మంది అనర్హులుగా గుర్తించింది. ప్రజాసాధికార సర్వే సక్రమంగా జరగకపోవడంతో అర్హులకు రేషన్‌కార్డు మంజూరు భ్రమే అని తేలిపోయింది.
ఇల్లున్నా, వాహనం ఉన్నా కార్డు ఇవ్వరట
ప్రజా సాధికార సర్వే ప్రకారం రేషన్‌కార్డు దరఖాస్తు దారుడికి ఇల్లు ఉన్నా రేషన్‌కార్డు మంజూరుకాదట. అలాగే నాలుగు చక్రాల వాహనం ఉన్నా రేషన్‌కార్డు దరఖాస్తు ఆన్‌లైన్‌లో తిరస్కరణకు గురవుతోంది. ఉపాధి కోసం నాలుగు చక్రాల వాహనం తిప్పుకుంటూ జీవనోపాధి పొందుతున్న వారికి రేషన్‌కార్డులు మంజూరుకావడం లేదు. ప్రజాసాధికార సర్వేలో పలు ఆప్షన్లను రేషన్‌కార్డు దరఖాస్తుకు అనుసంధానం చేయడంతో తిరస్కరణకు గురైన దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయి. ఇలా ప్రజాసాధికార సర్వే ప్రకారం ఆన్‌లైన్లో దరఖాస్తుచేస్తే చేసిన చాలా మందికి రేషన్‌కార్డు మంజూరు కాలేదు. ప్రజాసాధికార సర్వే సరిగా జరగకపోవడంతో అర్హులైన వారు కూడా రేషన్‌కార్డులు మంజూరు కాలేదు. ఇల్లు లేని వారికి ఇల్లు ఉన్నట్లు, వాహనం లేని వారికి వాహనం ఉన్నట్లు ప్రజా సాధికార సర్వేలో నమోదు కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో జన్మభూమి సభల్లో రేషన్‌కార్డు కోసం వెళ్లి, అది మంజూరు కాక బేలగా వెనుదిరుగుతూ ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు.
జిల్లాలో ఇవీ వివరాలు
జిల్లాలో సుమారు 34వేల మంది రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా, వీటిలో 11 వేల మందికి మాత్రమే రేషన్‌కార్డులు మంజూరయ్యాయి. మిగిలిన దరఖాస్తులన్నీ తిరస్కరణకు గురయ్యాయి. ప్రతీ మండలంలోను వేలాది కార్డులు ప్రజాసాధికార సర్వే ప్రకారం తిరస్కరణకు గురయ్యాయి. ఉదాహరణకు జంగారెడ్డిగూడెం మండలంలో సుమారు 6వేల మంది రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా, కేవలం 259 మందికి మాత్రమే రేషన్‌కార్డులు మంజూరు అయ్యాయి. మిగిలిన వారందరికీ మంజూరు కాలేదు. ఇలా ప్రతీ మండలంలోను వేలాది మంది దరఖాస్తు చేసుకుంటే వందల్లో మంజూరయ్యాయి.
తాడేపల్లిగూడెంకు చెందిన కె.హరిబాబుకు మూడేళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి కార్డు కోసం దరఖాస్తు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ రాలేదు. ఈసారి జన్మభూమిలో వస్తుందేమో అని మరోసారి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ దఫా కూడా జాబితాలో ఆయన పేరు లేదు. దీంతో తీవ్ర నిరాశతో ఉన్నారు. చేసేది చిరుద్యోగం. ఉన్న కొద్దిపాటి సంపాదనతో బయట నిత్యావసరాలు కొనుక్కోవాలంటే ఇబ్బందులు పడుతున్నారు. రేషన్‌కార్డు వస్తే నిత్యావసరాలు ఆసరాగా వస్తాయని ఆశ. కాని రేషన్‌కార్డు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment