
నెల్లూరు (టౌన్) : జన్మభూమి–మా ఊరు సభలకూ విద్యార్థులే దిక్కయ్యారు. గ్రామసభలకు ఆశించిన స్థాయిలో ప్రజలు రాకపోవడంతో పాఠశాలలకు అనధికారికంగా సెలవులు ప్రకటించి విద్యార్థులను తరలిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చి హా మీ లను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైన నేపథ్యంలో.. చంద్రబాబు చెప్పే మాటలను ప్రజలు నమ్మడం లేదు. దీంతో గ్రామసభలు జనం రాక వెలవెలబోతున్నాయి.ఈ నేపథ్యంలో నెల్లూరు రూరల్ మండలం కోడూరుపాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న సభకు విద్యార్థులను పెద్దఎత్తున తరలిం చారు. సోమవారం కావలిలో నిర్వహించిన జన్మభూమి గ్రామ సభకు గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వచ్చారు. ఈ సభకు కూడా విద్యార్థులను తరలించారు. అంతకుముందు నగరంలోని వెంకటేశ్వపురం జనార్దనరెడ్డి కాలనీలో నిర్మిస్తున్న ‘హౌస్ ఫర్ ఆల్’ ఇళ్లను లోకేష్ పరిశీలించారు. ఈ కార్యక్రమానికి కూడా విద్యార్థులను, స్కూల్ బస్సులను బలవతంగా పంపించారు.
విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం
జన్మభూమి సభలకు విద్యార్థులను తరలించడంపై వారి తల్లి దండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాయకులు, రాజకీయ కార్యక్రమాలకు విద్యార్థులను తీసుకెళ్లడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సంక్రాంతి సెలవుల అనంతరం రెండో సమ్మెటివ్ పరీక్షలు జరగనున్నాయి. ఈ తరుణంలో పాఠాలు చెప్పకుండా సెలవులు ఇచ్చి విద్యార్థులను తీసుకెళితే సిలబస్ ఎప్పుడు పూర్తిచేస్తారని నిలదీస్తున్నారు. ఓ వైపు కార్యాలయాల్లో అధికారులు లేకుండా చేస్తున్న ప్రభుత్వం మరోవైపు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను, చివరకు విద్యార్థులను సైతం సభలకు తరలిం చడం దారుణమంటున్నారు. కోడూరుపాడులో జరిగిన చంద్రబాబు సభకు మున్సిపల్, జెడ్పీ హైస్కూల్స్ విద్యార్థులను తీసుకెళ్లిన విషయం విదితమే.
బలవంతంగా స్కూల్ బస్సుల తరలింపు
మరోవైపు జన్మభూమి సభలకు ప్రజలను తరలించేం దుకు స్కూల్స్ బస్సులను వినియోగిస్తున్నారు. నిబం ధనల ప్రకారం స్కూల్ బస్సులను ఇలాంటి కార్యక్రమాలకు వినియోగించకూడదు. అధికారి పార్టీ నేతలు విజయవాడ, గుంటూరులలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలను బెదిరించి మరీ స్కూల్ బస్సులను పంపించాలని రవాణా శాఖ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం సీరియస్ అయ్యారు. స్కూల్ బస్సులను ఇతర కార్యక్రమాలకు వినియోగించకూడదంటూ 2015 ఫిబ్రవరి 16న 482/3 నంబర్‌తో కలెక్టర్లు, రవాణా శాఖ కార్యాలయాలకు సర్క్యులర్ జారీ చేశారు. అయినా.. రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. సభలకు స్కూల్ బస్సులను పంపించే విషయంలో రవాణా శాఖ ఉప కమిషనర్ ఎన్.శివరాంప్రసాద్ అత్యుత్సాహం ప్రదర్శించారు. చంద్రబాబు సభకు 370 బస్సుల్ని పంపించగా,లోకేష్ సభకు 150కు పైగా బస్సులను పం పిం చారు. ఆ బస్సులకు దగ్గరుండి డీజిల్ కొట్టించి రవాణా శాఖ పేరుమీద టోకెన్ ఇచ్చారు. ఆర్టీసీ బస్సులను పంపిస్తే.. సంస్థకు ఆదాయం లభించేదని పలువురు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment