జుట్టు పెంచుకొనేందుకు అనుమతివ్వాలి
టీచర్ల మాదిరిగా చీర కట్టుకోవాలని ఉంది
ఫిర్యాదుల బాక్సుల్లో విద్యార్థుల అభ్యర్థనలు
వరంగల్ జిల్లా రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూళ్లలో విచిత్రాలు
‘మాకు హీరో ప్రభాస్‌లాగా హెయిర్ స్టైల్ కావాలి.. జుట్టు పొడుగ్గా పెంచుకొనేందుకు అనుమతి ఇవ్వాలి.. గాజులు వేసుకొనేందుకు పర్మిషన్ ఇవ్వాలి. టీచర్ల మాదిరిగా చీరలు కట్టుకోవాలని ఉంది’.. వరంగల్ జిల్లా రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూళ్లలో సమస్యలు తెలుసుకొనేందుకు అధికారులు ఏర్పాటుచేసిన ఫిర్యాదుల బాక్సుల్లో విద్యార్థులు వేసిన వినతులు ఇవి. ఆహారం బాగా లేదనో, హోం వర్క్ ఎక్కువ ఇస్తున్నారో, పుస్తకాలు లేవనో ఫిర్యాదులు వస్తాయని అధికారులు ఆశించారు. కానీ, ఫిర్యాదు బాక్సుల్లో మాత్రం ఇలాంటి వినతులు కనిపించాయి.
దీనిపై ఓ విద్యార్థిని ఒక సీనియర్ అధికారి ప్రశ్నించగా.. ‘స్థానిక బార్బర్ అబ్బాయిలందరికీ ఒకే రకమైన ఫ్లాట్ హెయిర్ కట్ ‘తాపేలి కట్’చేస్తున్నాడు. అది నచ్చడం లేదు. అందుకే హీరోల వంటి హెయిర్ కట్ కావాలని కోరాం’ అని తెలిపాడు. ఈ విషయంలో వారు సీరియస్‌గానే ఉన్నారని ఆ అధికారి చెప్పారు.
‘ఈ పిల్లలకు ఫోన్లు అందుబాటులో లేవు. తల్లిదండ్రులతో క్రమం తప్పకుండా మాట్లాడలేరు. అందుకే ఫిర్యాదు పెట్టెలను పెట్టించాం. వీళ్ల ఫిర్యాదులు ఆసక్తికరంగా ఉన్నాయి. తమ భావాలను స్పష్టంగా వ్యక్తీకరిస్తున్నారు’అని జిల్లా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గణేశ్ ఉత్సవాల సందర్భంగా కొంతమంది విద్యార్థులు పాఠశాలలో పూజలు ఏర్పాటు చేయాలని కోరారు. కొంతమంది విద్యార్థినులు సీనియర్లు తమను వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
సోషల్ మీడియా ప్రభావమే...
ఇదంతా సోషల్ మీడియా ప్రభావమేనని విద్యారంగ నిపుణులు అంటున్నారు. ‘క్యాంపస్‌లలో ఫోన్లను అనుమతించనప్పటికీ, చాలా పాఠశాలల్లో కంప్యూటర్ సైన్స్ ల్యాబ్‌లు ఉన్నాయి. వాటి ద్వారా పిల్లలు సోషల్ మీడియాలో లేటెస్ట్ ట్రెండ్లను తెలుసుకుంటున్నారు. వాళ్లు తమ మనసులోని మాటలను చెప్పడం మంచిదే. వాళ్లపై ఏవి ప్రభావం చూపుతున్నాయో తెలియాలి’ అని పాఠశాల పిల్లలతో కలిసి పనిచేసే డెవలప్‌మెంట్ ప్రొఫెషనల్ కన్సల్టెంట్ ఒకరు చెప్పారు. కోవిడ్ –19కి ముందు ఎక్కువ ఫిర్యాదులు ఆహారం నాణ్యత, ఉపాధ్యాయుల శిక్షణ గురించి ఉండేవని.. ఇప్పుడు ఇలా ఉంటున్నాయని చెప్పారు.
చదవండి: ముద్ద అన్నం.. తింటే కడుపు నొస్తోంది
Comments
Please login to add a commentAdd a comment