కాపు కాసి మారణాయుధాలతో..
కాపు కాసి మారణాయుధాలతో..
Published Wed, Aug 24 2016 10:51 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
* కోర్టు వాయిదాకు వెళుతుండగా దాడి
* వ్యక్తి మృతి
* నలుగురికి తీవ్ర గాయాలు
* పరారీలో నిందితులు
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కారల్‌మార్క్స్ ఏనాడో చెప్పాడు. కొందరు మనుషుల మధ్య మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. ప్రస్తుత సమాజంలో మనుషుల మధ్య సంబంధాలు కేవలం ఆర్థికపరమైన అంశాలతోనే ముడిపడి ఉంటున్నాయి. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, తల్లిదండ్రులూ బిడ్డల మధ్య నెలకొన్న ఆర్థిక వివాదాల కేసులు ఇటీవల ఎక్కువగా బహిర్గతమవుతున్నాయి. రక్తసంబంధీకులు సైతం ఆస్తుల కోసం పంతాలకు పోయి అంతం చేసుకుంటున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బుధవారం తెనాలిలో జరిగిన హత్య తీరు ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
తెనాలి రూరల్: కోర్టుకు వెళుతున్నవారిపై దుండగులు కాపు కాసి మారణాయుధాలతో దాడిచేసి ఒకరిని హతమార్చిన ఘటన బుధవారం మండలంలోని నేలపాడు సమీపంలో జరిగింది. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్తి తగాదాలే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం కొల్లిపర మండలం తూములూరు గ్రామానికి చెందిన ఆళ్ల సీతమ్మకు 16 ఎకరాల పొలం ఉంది. ఇందులో ఆరెకరాలు తన ఏకైక కుమారుడు శ్రీకాంత్‌రెడ్డికి, మిగిలిన తొమ్మిది ఎకరాల్లో మూడెకరాల చొప్పున ముగ్గురు కుమార్తెలకు రాసింది. పెద్ద కుమార్తె శ్రీలక్ష్మిని తన తమ్ముడైన పగడాల బలరామిరెడ్డి(40)కి ఇచ్చి వివాహం చేసింది. నాలుగేళ్ల క్రితం శ్రీకాంత్‌రెడ్డి అనుమానాస్పద స్థితిలో రేపల్లె బ్యాంక్ కెనాల్‌లో పడి వృతి చెందాడు. అతని పేరిట రాసిన ఆరెకరాల పొలానికి సంబంధించి వివాదం జరుగుతోంది. దీనికి సంబంధించి సీతమ్మ, రెండో అల్లుడు, వల్లభాపురంలో నివసించే వంగా సుధాకర్‌రెడ్డికి మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో తమ పొలంలోకి అక్రమంగా ప్రవేశించారని, దాడి చేశారంటూ 2013లో పరస్పరం పోలీసు కేసులు పెట్టుకున్నారు.
కోర్టు వాయిదాకు వెళ్తుండగా..
ఈ కేసులకు సంబంధించి తెనాలి కోర్టులో బుధవారం వాయిదా ఉంది. దీనికి సీతమ్మ, ఆమె కుమార్తె శ్రీలక్ష్మి, అల్లుడు బలరామిరెడ్డి, కేసులో సాక్షి అయిన దేవయ్యను తీసుకుని తూములూరుకే చెందిన నాని ఆటోలో కోర్టుకు బయలుదేరారు. కొల్లిపర మండలం చివలూరు, తెనాలి మండలం నేలపాడు గ్రామాల మధ్యకు రాగానే అప్పటికే మాటు వేసి ఉన్న దుండగులు వీరి ఆటోను కారుతో అటకాయించారు. దీంతో ఆటో, కారు రోడ్డు పక్కన ఉన్న పంట కాల్వలోకి దూసుకెళ్లాయి. ఆటో బోల్తాపడి అందులోని వారు గాయపడ్డారు. కారులో నుంచి దిగిన ఐదుగురు వీరిని బయటకు లాగి ఆయుధాలతో విచక్షణారహితంగా దాడి చేసి కారును వదిలేసి పరారయ్యారు. ఈ ఘటనలో బలరామిరెడ్డి అక్కడికక్కడే వృతి చెందాడు. సీతమ్మ, దేవయ్య, నాని తీవ్రంగా గాయపడ్డారు. శ్రీలక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. కారులో ఒక వేట కొడవలి, కర్ర, మద్యం సీసా ఉన్నాయి. విషయం తెలుసుకున్న సీఐలు యు.రవిచంద్ర, బి.కళ్యాణ్‌రాజు, బి.శ్రీనివాసరావు, తెనాలి తాలూకా ఎస్‌ఐ ప్రభాకరరావు, కొల్లిపర ఎస్‌ఐ అనిల్‌కుమార్‌రెడ్డి, దుగ్గిరాల ఎస్‌ఐ మన్నెం మురళి తమ సిబ్బందితో ఘటనాస్థలాన్ని పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని 108లో తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. దేవయ్య, నాని పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు సమగ్ర వైద్యశాలకు పంపారు.
Advertisement
Advertisement