ఆందోళన బాటలో పెట్రోలియం డీలర్లు
ఆదివారం అర్ధరాత్రి నుంచి ఒకరోజు సమ్మె
విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం విధించిన వ్యాట్ భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తున్న పెట్రోలు, డీజిల్ డీలర్లు పోరాటానికి సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు రాష్ట్ర వ్యాప్తంగా బంకులన్నింటినీ బంద్ చేయాలని ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ తీర్మానించింది. ఆరు మాసాల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ అమ్మకాలపై నాలుగు శాతం వ్యాట్ విధించింది. దీన్ని ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం డీలర్లు వ్యతిరేకిస్తూ పలుమార్లు సీఎం దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లారు.
ప్రభుత్వం రాష్ట్రంలో నాలుగు శాతం వ్యాట్ విధించటం వల్ల లారీల యజమానులు పక్క రాష్ట్రాలకు వెళ్లి డీజిల్ కొనుగోలు చేస్తున్నారని ఆ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు నరసింహారావు ఓ ప్రకటనలో తెలిపారు. మన రాష్ట్రంలో వ్యాట్ వల్ల పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా, కర్నాటకలకు వెళ్లి లారీ యజమానులు డీజిల్‌ను కొనుగోలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా 2,400 బంకుల్లో డీజిల్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయని తెలిపారు. ఏపీలో ఆరు మాసాలుగా 40 శాతం డీజిల్ అమ్మకాలు తగ్గిపోయి పక్క రాష్ట్రాలకు పెరిగాయని వివరించారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి మొదటి హెచ్చరికగా రాష్ట్రంలో ఒకరోజు పెట్రోలు, డీజిల్ అమ్మకాలు బంద్ చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. సమస్య పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని చుంచు నరసింహారావు హెచ్చరించారు.