
చీకట్లో వెలుగుతుంది వెలుగొస్తే ఆరుతుంది
ప్రయోజనం
* మార్కెట్‌లోకి ఫొటో రిసెప్టర్ బెడ్‌లైట్స్
* కొత్త మోడల్స్‌లో ఎల్‌ఈడీ బెడ్ లైట్స్ కూడా
అనంతపురం : శయన మందిరాల చిరుకాంతులు చిందించేందుకు ఇప్పుడు ఎన్నో మోడల్స్‌లో ఎల్‌ఈడీ లైట్లు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. కోడిగుడ్డు లాంతరులా ఉండే బల్బులు కొంత కాలం పడక గదులను ఏలాయి. వాటి స్థానంలో చిన్న బల్బులు (జీరో వాట్) వచ్చాయి. అయితే వీటికి ట్రాన్స్‌ఫార్మర్ ఉండేది. బల్బు మిణుకు మిణుకుమంటుంటే ట్రాన్స్‌ఫార్మర్ మార్చుకునే పరిస్థితి ఉండేది.
బెడ్‌రూమ్ అలంకరణలకు ప్రాధాన్యత పెరగడంతో బెడ్‌బల్బులు కూడా రూపాంతరం చెందాయి. త్వరగా మారుతున్న టెక్నాలజీతో అతి తక్కువ విద్యుత్ వినియోగించుకుంటూ కంటికి ఇంపుగా ఉండే బల్బులకు ప్రాధాన్యత పెరిగింది. తాజ్‌మహల్, వేలాడే ఇల్లు, పక్షుల ఆకారాలు, నత్త, డాల్ఫిన్, గ్లోబ్ తదితర ఎన్నో ఆకారాల్లో బెడ్ బల్బులు మార్కెట్‌ను ఎప్పుడో ఆక్రమించాయి. తాజాగా ఎల్‌ఇడీ బల్బులు హవా నడుస్తున్న తరుణంలో చైనా నుంచి ఎల్‌ఈడీ నైట్ ల్యాంపులు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. చైనాకు చెందిన ఈ ఎల్‌ఈడీ లైట్లు రూ.100 నుంచి రూ.200 మధ్య ధరలో లభిస్తున్నాయి.
ఫొటో రిసెప్టర్ లైట్ల ప్రత్యేకత
కొత్తగా వస్తున్న ఫొటో రిసెప్టర్ లైట్లకు ఓ ప్రత్యేకత ఉంది. పడక గది (ఏ గది అయినా) లో లైట్ వేసేవరకు వెలుగుతూ ఉన్న రిసెప్టర్ ఎల్‌ఈడీ లైట్ ఆటోమేటిక్‌గా ఆరిపోతుంది. ఈ లైట్ కాంతి ఉన్నప్పుడు అంటే పగలు వెలుతురు ఉన్న గదిలోను, రాత్రివేళ లైటు వెలిగి ఉన్న గదిలోను ఆరిపోయి ఉంటుంది. చీకటి ఉంటే వెలుగుతుంది. చైనాకు చెందిన వీటి ధర సుమారు రూ.2 వేల వరకు ఉంటుంది.