జేబుదొంగలు అరెస్ట్
జేబుదొంగలు అరెస్ట్
Published Sun, Sep 25 2016 10:22 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
– రూ.6.18 లక్షల నగదు, సెల్‌ఫోన్, గ్రాము బంగారం స్వాధీనం
కర్నూలు: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో టోల్‌గేట్ల వద్దమాటు వేసి ప్రయాణికుల బ్యాగులు, జేబులు కత్తరించే దొంగల ముఠాను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఆలూరు నియోజకవర్గంలోని హాలహర్వి గ్రామానికి చెందిన నీలిషికారి ఫరూక్‌ఖాన్ కర్నూలు ముజఫర్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. అదే కాలనీకి చెందిన షాలిమియ్య అలియాస్ శాలు, మాదిగ గంగాధర్ అలియాస్ గంగ, గూడూరు గ్రామానికి చెందిన షేక్‌సుభాన్‌లతో ముఠాగా ఏర్పడి పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు. కర్నూలు రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతూ కన్పించడంతో సీసీఎస్ డీఎస్పీ హుసేన్‌పీరా, సీఐ పవన్‌కిషోర్, ఎస్‌ఐలు ఎస్‌ఎం రసూల్, శ్రీనివాసులు తదితరులు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా, నేరాల చిట్టా బయటపడింది. వారి వద్ద నుంచి రూ.6.18 లక్షల నగదు, నోకియా సెల్‌ఫోన్, గ్రాము బంగారం తాళిబొట్టు స్వాధీనం చేసుకొని ఎస్పీ ఆకే రవికృష్ణ ఎదుట హాజరు పరిచారు.
ఆదివారం మధ్యాహ్నం పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఎస్పీ వివరాలను వెల్లడించారు. కర్నూలు ఆర్టీసీ బస్టాండు, బళ్లారి చౌరస్తా, వెల్దుర్తి టోల్‌గేట్, పుల్లూరు టోల్‌ప్లాజా ప్రాంతాల్లో బ్యాగులు, వ్యక్తుల జేబులను కత్తరించి అందులో ఉన్న నగదును తస్కరించి జల్సాలు చేస్తూ తప్పించుకు తిరిగేవారు. ఏపీఎస్‌పీ రెండో పటాలం వద్ద ఇద్దరు మహిళలను ఆటోల్లో ఎక్కించుకొని, శివారు ప్రాంతాల్లోకి తీసుకెళ్లి, వారి బ్యాగును దొంగలించారు. 15 రోజుల క్రితం అలంపూర్ చౌరస్తా వద్ద కార్‌లో నిద్రిస్తున్న ప్రయాణికుల బ్యాగును అపహరించినట్లు పోలీస్ విచారణలో అంగీకరించారు. మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు పోలీస్ స్టేషన్, కర్నూలు రెండు, నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో వీరిపై చోరీ కేసులు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదును రికవరీ చేసేందుకు డీఎస్పీ హుసేన్‌పీరా, సీఐ పవన్‌కిషోర్, ఎస్‌ఐలు రసూల్, శ్రీనివాసులు, హెడ్‌కానిస్టేబుల్ మస్తా, కానిస్టేబుల్ సుదర్శనం, నాగరాజు, రవి, షమీర్, కిషోర్ తదితరులను ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు.
Advertisement
Advertisement