పింఛన్లకు కోత!
* సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు
* వేలిముద్రలు, కంటిచూపు మ్యాచ్ అయితేనే చెల్లించాలని ఉత్తర్వులు
* ఆధార్ ఆధారమే కాదంటూ నిర్ణయం తీసుకున్న పాలకులు
* ఆందోళనలో లబ్ధిదారులు
చిలకలూరిపేట రూరల్ : ఎన్టీఆర్ భరోసా పేరుతో అర్హులకు అందించే పింఛన్లలో కోతలు విధించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఆధార్ కార్డుల ఆధారంగా ఇస్తున్న పింఛన్లను తగ్గించే ప్రయత్నాలకు తెరలేపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయ కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న సీఎం కార్యాలయం నుంచి సీఎంపీ నంబర్ 2809– జేఎస్–2016తో ఆగస్టు 12న ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయ ఆదేశాల మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉన్న సెర్ప్ సీఈవో పి.కృష్ణమోహన్ జిల్లాలోని అన్ని మండల పరిషత్‌ల అధికారులు, మున్సిపల్ కమిషనర్‌లకు ఉత్తర్వులు పంపారు. దీనివల్ల వికలాంగులు, వృద్ధులు, వితంతువుల పింఛన్లకు కోత పడనుంది.
ఇప్పటివరకు ఇలా...
జిల్లా వ్యాప్తంగా 57 మండలాలు, 12 పురపాలక సంఘాలు, ఒక కార్పొరేషన్‌లో 63,616 మంది లబ్ధిదారులు రూ.7 కోట్ల 2 లక్షల 73 వేల 500 పింఛను పొందుతున్నారు. లబ్ధిదారుల వేలిముద్రలు, కంటిచూపు (ఐరిష్) ట్యాబ్‌లకు అనుసంధానం కాకపోవటంతో పింఛను పంపిణీ చేస్తున్న మున్సిపల్ ఉద్యోగి, పంచాయతీ కార్యదర్శి, వీఆర్వోలు వారి వేలిముద్రలు సేకరించి, ఆధార్ కార్డుల నంబర్లను నమోదు చేసుకుని సొమ్ము అందజేస్తున్నారు. ప్రస్తుత ఆదేశాల్లో ఈ నెల నుంచి తప్పనిసరిగా వేలిముద్రలు, ఐరిష్‌లు వేయించాలని పేర్కొన్నారు. దీంతో పింఛనుదారులు ఆందోళన చెందుతున్నారు.
మండిపడుతున్న ఉద్యోగులు...
లబ్ధిదారులందరికీ పింఛను అందిస్తున్నామని, వృద్ధుల్లో చేతి వేలిముద్రలు, కంటిచూపు కోల్పోయిన వారికి మాత్రమే తమ వేలిముద్రలు వేసి వారి ఆధార్ ఆధారంగా పంపిణీ చేస్తున్నామని మున్సిపల్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ తాజా ఆదేశాలతో ట్యాబ్ ఆమోదించేవరకు పింఛన్ల పంపిణీ సాధ్యం కాదని, అలాగైతే గంటలతరబడి వేలాదిమంది ప్రజలు నిరీక్షించాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు క్షేత్రస్ధాయిలో పర్యటించి వాస్తవాలను గుర్తించాలని ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు.
ఇలాగైతే సమస్యలే..
వృద్ధుల వేలిముద్రలను ట్యాబ్ ఆమోదిస్తేనే పింఛను చెల్లించాలని ఆదేశాలు జారీ చేస్తే వేలాది మంది ఇబ్బందులు పడతారని అధికారులు చెబుతున్నారు. దీనిపై ప్రజలు తమను నిలదీసే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఇప్పటికే సక్రమంగా పింఛను అందక ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు ఇకపై కొత్త నిబంధనలతో మరింత కష్టాల్లో పడతామని ఆందోళన చెందుతున్నారు. దీనిపై చిలకలూరిపేట ఎంపీడీవో వి.వసంతలక్ష్మిని వివరణ కోరగా, పింఛన్ల పంపిణీ త్వరగా ముగించేందుకు సిబ్బంది వారి వేలిముద్రలే ఎక్కువగా వేస్తున్నారని తెలిపారు. అర్హులు ఉన్నప్పటికీ ఇదే పద్ధతి అవలంబిస్తున్నారని చెప్పారు. వీటిని నియంత్రించేందుకే ప్రభుత్వం కొత్తగా నిర్ణయం తీసుకుందని వివరించారు.