ఓడిపోయిన వారికి గౌరవమా..ప్రొటోకాల్ అంటే ఇదేనా
జిల్లాలో ప్రొటోకాల్ ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను పిలవటం లేదు. ఓడిపోయిన అధికార పార్టీ నాయకులను వేదికలపైకి ఎక్కిస్తున్నారు.
మాచర్ల : ప్రజలు ఎన్నుకున్న నేతలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చి ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రొటోకాల్ ప్రకారం వారిని ఆహ్వానించాల్సి ఉంది. ప్రభుత్వాలు రూపొందించిన నిబంధనలను ఉల్లంఘించి ఓడిపోయిన వారిని పిలిచి వేదిక లపై ఎక్కించి ప్రొటోకాల్ పాటించకుండా నిర్లక్ష్యం చేయడంపై గెలుపొందిన ప్రజాప్రతినిధుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మాచర్ల నియోజకవర్గంలోప్రొటోకాల్ ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగుతోంది. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి కావడంతో ఆయనను ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవకుండానే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేస్తున్నారు.
ఏడాదిగా ఇదే తీరు
ఏడాదిగా ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి ఎమ్మెల్యే పీఆర్కేపై ఓటమి పాలైన ప్రస్తుత టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చలమారెడ్డి, అంతకుముందు ఉపఎన్నికల్లో ఓడిపోయిన చిరుమామిళ్ల మధుబాబు తండ్రి వెంకటనర్సయ్య,కౌన్సిలర్లుగా పోటీచేసి ఓడిపోయినవారిని సైతం ప్రభుత్వ కార్యక్రమాల వేదికపై పిలిచి మాట్లాడిస్తున్నారు. ఏఎంసీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు తన పరిధిని దాటి మండలాల్లో అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ, ఆదేశాలు జారీచేస్తూ ప్రొటోకాల్‌ను పట్టించుకోవటం లేదు.
ఎంపీ రాయపాటి పర్యటనల్లో..
ఎంపీ రాయపాటి సాంబశివరావు రెండు నెలల్లో మాచర్ల నియోజకవర్గంలో పదిసార్లు పర్యటిస్తే ఒక్కసారి కూడా ఎమ్మెల్యే పీఆర్కేను ఏ కార్యక్రమానికి ఆహ్వానించలేదు. ఇటీవల మాచర్ల మండలంలో ఎంపీ రాయపాటి పర్యటించి కృష్ణా పుష్కర ఘాట్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి కూడా ఎమ్మెల్యే పీఆర్కేను ఆహ్వానించలేదు. పురపాలక సంఘ కార్యాలయంలో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం, హోం మంత్రి చినరాజప్ప పర్యటన సమయంలోనూ ఎమ్మెల్యే పీఆర్కేను ఆహ్వానించలేదు.
పార్లమెంట్ ప్రోటోకాల్ కమిటీలో సభ్యుడిగా..
పార్లమెంట్‌లో ప్రొటోకాల్ కమిటీ సభ్యుడిగా ఉన్న ఎంపీ రాయపాటి పాల్గొనే కార్యక్రమాల్లోనే ప్రొటోకాల్‌ను అధికారులు పట్టించుకోవడం గమనార్హం! రాయపాటి సైతం ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పాల్గొనకపోయినా ఓడిపోయిన అభ్యర్థులతో కొబ్బరికాయలు కొట్టించి ప్రోత్సహిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.
అహంభావంతోనే ఇలా..
నిబంధనలు లేవు, చట్టం లేదు, ప్రొటోకాల్‌ను పాటిం చరు. అధికారం వచ్చిందని అహంభావంతో యథేచ్ఛగా ప్రొటోకాల్‌ను ఉల్లంఘిస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. రాష్ట్రాన్ని టీడీపీ సొంత రాజ్యంగా భావిస్తూ ప్రజాస్వామ్యహితంగా కాకుండా ఇష్టారాజ్యంగా పరిపాలిస్తున్నారు. అసెంబ్లీలో చెప్పుకుంటేనే దిక్కులేని పరిస్థితి. ప్రొటోకాల్ అమలు చేయాల్సిన ప్రజాప్రతినిధులే వాటిని ప్రోత్సహిస్తున్నారు.
- పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే, మాచర్ల
ప్రజలు ఎన్నుకున్న వారికి అవమానమా?
Published Wed, Jun 22 2016 9:01 AM | Last Updated on Tue, May 29 2018 2:33 PM
Advertisement
Advertisement