మబ్బులను మచ్చిక చేసుకుందాం
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మబ్బులు అలిగిపోతున్నాయని ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో అని, వాటిని మచ్చిక చేసుకోవాలంటే మొక్కలను పెంచాల్సిందేనని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చమత్కరించారు.
-
చెట్లు పెంచితే వర్షాలు
-
లక్ష్యం పూర్తయ్యే వరకు హరితహారం
-
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
ఎల్లారెడ్డి : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మబ్బులు అలిగిపోతున్నాయని ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో అని, వాటిని మచ్చిక చేసుకోవాలంటే మొక్కలను పెంచాల్సిందేనని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చమత్కరించారు. చెట్లు అధికంగా ఉంటేనే వర్షాలు కురుస్తాయని, ఇందుకు ఆదిలాబాద్ జిల్లానే నిదర్శమన్నారు. హరితహారం కార్యక్రమానికి ఎలాంటి కాలపరిమితి లేదని, ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో 40 వేల మొక్కలను పెంచే వరకు కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు. సోమవారం మండలంలోని అడివిలింగాల గ్రామంలో, మోడల్ డిగ్రీ కళాశాల ఆవరణలో హరితహారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మొక్కల కొరత, వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడం వల్ల రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో నిర్ణీత లక్ష్యాల మేరకు మొక్కలను నాటలేకపోయామన్నారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లగా లక్ష్యాలు పూర్తయ్యే వరకు కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆదేశించారని తెలిపారు. కార్యక్రమం పూర్తయ్యాక జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటిస్తామన్నారని తెలిపారు. రాష్ట్రంలో నాటిన ప్రతి మొక్కను లెక్కించాలని అనుకుంటున్నారని, అధికారులు చెబుతున్న లెక్కలకు వాస్తవంగా ఉన్న మొక్కలకు లెక్క కుదరకపోతే ఎంతటి వారినైనా ఉపేక్షించబోనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్, ఎంపీపీ నక్క గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
ఇనుప ట్రీగార్డులు ఏర్పాటు చేసేలా చూస్తాం..
హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించేందుకు ఏర్పాటు చేస్తున్న కంచెల కోసం ఏపుగా పెరిగిన చెట్లను నరుకుతున్న విషయాన్ని పలువురు మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన విస్మయం వ్యక్తం చేశారు. మొక్కల సంరక్షణ కోసం ఇతర చెట్లను నరకడం సరైన పద్ధతి కాదని దీనివల్ల హరితహారం ఉద్దేశమే తప్పుదోవ పడుతుందన్నారు. మొక్కలకు ట్రీ గార్డులను పెట్టేందుకు ఆదేశిస్తామని చెప్పారు.