పుట్టగొడుగుల్లా ప్లే స్కూళ్లు
గ్రేటర్‌లో ప్రీ ప్రైమరీ స్కూళ్లు 3 వేలు
♦ లెక్కతేల్చిన జంట జిల్లాల విద్యాశాఖలు
♦ రిజిస్ట్రేషన్ల కోసం యాజమాన్యాలు క్యూ..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రీ ప్రైమరీ స్కూళ్ల లెక్క తేలింది. కేవలం పూర్వ ప్రాథమిక విద్య కోసమే ఏర్పాటైన స్కూళ్లు దాదాపు 1,200 వరకు ఉన్నట్లు అధికారులు లెక్కతేల్చారు. అంతేగాక ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు అనుమతి తీసుకుని.. అనధికారికంగా ప్రీ ప్రైమరీ స్కూళ్లను కూడా నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖాధికారులు గుర్తించారు. ఇటువంటి స్కూళ్లు దాదాపు 2 వేలు ఉంటాయని చెబుతున్నారు. ఈ రెండు కేటగిరీల్లో కలుపుకుంటే 3 వేల వరకు ప్రీ ప్రైమరీ విద్యనందించే స్కూళ్లు ఉన్నాయి. అనుమతి లేకుండా సాగుతున్న వీటి కట్టడికి ప్రభుత్వం పగ్గాలు వేసేందుకు సన్నద్ధమైంది. ఈనెల 17న గడ్డిఅన్నారం ఎక్స్ రోడ్ వద్ద స్టార్ కిడ్స్ ప్రీమియంలో జరిగిన లిఫ్ట్ ప్రమాదంలో చిన్నారి జైనబ్ మృతి చెందిన విషయం విదితమే.
ఈ ఘటనతో మేల్కొన్న సర్కారు... ప్రీ ప్రైమరీ స్కూళ్ల నియంత్రణకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్లే స్కూళ్ల నిర్వహణపై పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్.. ఆయా జిల్లాల డీఈఓలకు ఆదేశాలు జారీచేశారు. జిల్లాల వారీగా ప్రీ ప్రైమరీ స్కూళ్లను గుర్తించి నోటీసులు ఇవ్వాలని సూచించారు. ఇందులో భాగంగా జంట జిల్లాల డీఈఓల సూచనల మేరకు డిప్యూటీ ఈఓలు, డిప్యూటీ ఐఓఎస్‌లు, ఎంఈఓలు అనుమతి లేని ప్లే స్కూళ్లను గుర్తించారు. వెంటనే దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలని ఈ స్కూళ్లకు నోటీసులు జారీచేశారు.
రూ. 10 వేల చొప్పున జరిమానా..
వచ్చే విద్యా సంవత్సరం స్కూళ్లను కొనసాగించాలంటే.. ఈ ఏడాది అక్టోబర్ 30వ తేదీ లోపే విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. గడువులోగా అనుమతి పొందాలనుకుంటే రూ. 10 వేల ఎన్‌ఎస్‌సీ బాండ్ అందజేయాలి. ఈ గడువు దాటిపోయినా.. అనుమతి కోసం ముందుకు రాని స్కూళ్లకు నెలకు రూ. 10 వేల చొప్పున జరిమానా విధిస్తారు. ఈ లెక్కన డిసెంబర్ నెల నేటితో మొదలైంది కాబట్టి... ఇప్పటికీ అనుమతి తీసుకోని ప్రతి ప్లే స్కూల్ రూ. 20 వేల జరిమానాను ప్రభుత్వానికి విధిగా చెల్లించాలి. అక్టోబర్ నాటికి బాండ్ రూపంలో చెల్లించే రూ. 10 వేలు కాక ఇవి అదనం. ప్రభుత్వ తీరుతో అనుమతి కోసం స్కూళ్ల యాజమాన్యాలు పెద్ద ఎత్తున ముందుకొస్తుండడం విశేషం.
ఆ స్కూళ్లకూ తప్పనిసరి..: ఒకటి నుంచి పదో తరగతి బోధన వరకు అనుమతి పొందిన చాలా పాఠశాలల్లో.. అనధికారికంగా ప్రీ ప్రైమరీ విద్యను అందజేస్తున్నారు. ఈ స్కూళ్లు ఇకపై ప్రీ ప్రైమరీ విద్య కోసం తప్పనిసరిగా ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. ఇదే విషయాన్ని విద్యాశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ యాజమాన్యాలకు కూడా నెలకు రూ. 10 వేల చొప్పున జరిమానా వర్తిస్తుంది.