pre-primary schools
-
ప్రారంభమైన వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లు
సాక్షి, అమరావతి: అంగన్వాడీ స్కూళ్లు.. సోమవారం ‘వైఎస్సార్ ప్రీ ప్రైమరీ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు’గా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ స్కూళ్లున్నాయి. వీటిలో 8.5 లక్షల మంది బాలలు విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నారు. ఇప్పటివరకు విద్యాబుద్ధులు నేర్పే పద్ధతులు మార్చి ఆట వస్తువుల ద్వారా విద్యను నేర్పించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. పిల్లలను స్కూళ్లకు పంపించేందుకు 85 శాతం మంది తల్లిదండ్రులు సుముఖత వ్యక్తం చేస్తూ లిఖిత పూర్వకంగా అంగన్వాడీ టీచర్లకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పిల్లలు స్కూళ్లకు హాజరయ్యారు. అంగన్వాడీ స్కూళ్లకు వచ్చే పిల్లల కోసం ప్రీ ప్రైమరీ1, ప్రీ ప్రైమరీ2, ప్రీ ఫస్ట్‌క్లాస్ తరగతులుగా విభజించి ఇంగ్లిష్ మాధ్యమంలో విద్యను నేర్పించే కార్యక్రమం మొదలైంది. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో వసతుల్ని మెరుగుపరిచింది. కాగా, రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలు సోమవారం ప్రారంభమయ్యాయి. -
పైకం కొట్టు.. ‘ప్రైమరీ’ పట్టు!
సాక్షి, హైదరాబాద్: ప్రీ ప్రైమరీ స్కూళ్ల అనుమతుల ప్రక్రియ కొందరు విద్యాధికారులకు కాసులు కురిపిస్తోంది. ప్రీ ప్రైమరీ స్కూల్‌కు గుర్తింపు తప్పనిసరి చేయడంతో జిల్లా విద్యాధికారులకు క్షేత్రస్థాయి నుంచి దరఖాస్తులు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి. ఈ క్రమంలో అనుమతుల వ్యవహారం దారితప్పుతోంది. పక్కా పరిశీలన నిర్వహించి గుర్తింపు ఇవ్వాల్సిన అధికారులు నిబంధనలు పట్టించుకోకుండా వసూళ్లకు పాల్పడుతూ ఇష్టానుసారంగా అనుమతులు జారీ చేస్తున్నారు. ఆ మూడు జిల్లాల్లో..: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో దాదాపు 6 వేలకుపైగా ప్రైవేటు ఇంగ్లిషు మీడియం స్కూళ్లు ఉన్నాయి. ఈ స్కూళ్లలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈ పాఠశాలలన్నీ ప్రీ ప్రైమరీ స్కూల్ అనుమతులు పొందాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయా పాఠశాలలు ప్రీ ప్రైమరీ గుర్తింపు కోసం ఇప్పటికే దరఖాస్తులు సమర్పించా యి. వీటిని పరిశీలిస్తున్న విద్యా శాఖ అధికారులు ఏకధాటిగా వందల సంఖ్యలో అను మతులు జారీ చేస్తున్నారు. వాస్తవానికి పాఠశాల గుర్తింపు ఇచ్చే క్రమంలో నిబంధ నల ప్రకారం క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకా రం సౌకర్యాలుంటేనే అనుమతులివ్వాలి. కానీ ప్రీ ప్రైమరీ పాఠశాలల విషయంలో విద్యా శాఖ అధికారులు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. క్షేత్రస్థాయి తనిఖీలకు స్వస్తి పలుకుతూ కాగితాలను పరిశీలించి అనుమతులు జారీ చేసేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో గతవారం ఏకంగా 400పైగా స్కూళ్లకు ప్రీ ప్రైమరీ అనుమతులు జారీ చేసినట్లు తెలిసింది. మరో 200 స్కూళ్లకు సంబంధించి అనుమతులు త్వరలో జారీ చేయనున్నట్లు సమాచారం. వేటు పడినా మారని తీరు: పాఠశాలల గుర్తింపు ప్రక్రియలో అక్రమాలకు పాల్పడిన మేడ్చల్ జిల్లా విద్యా శాఖ అధికారి ఉషారాణిపై ప్రభుత్వం గతవారం సస్పెన్షన్ వేటు వేసింది. సస్పెన్షన్ అంశం ఇతర జిల్లా అధికారుల్లో కొంత ఆందోళన కలిగించినా పెద్దగా ప్రభావం చూపలేదు. అయినా ప్రీ ప్రైమరీ స్కూళ్ల అనుమతుల్లో భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. మేడ్చల్ జిల్లాలో ఒక ప్రీ ప్రైమరీ స్కూల్ అనుమతికి రూ.25 వేల నుంచి 50 వేల వరకు వసూలు చేసి అనుమతులిచ్చినట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లాలోనూ ఇదే తరహాలో అక్రమ వసూళ్లకు పాల్పడు తున్నారు. హైదరాబాద్‌తోపాటు ప్రైవేటు స్కూళ్లు అధికంగా ఉన్న జిల్లాల్లోనూ అనుమతుల పేరిట భారీగా వసూళ్లు చేస్తున్నారు. -
10వేల దరఖాస్తు ఫీజు చట్ట విరుద్ధం
హైకోర్టును ఆశ్రయించిన పలు ప్రైవేటు విద్యా సంస్థలు సాక్షి, హైదరాబాద్: గుర్తింపు పొందాలంటే ప్రీ ప్రైమరీ స్కూళ్లు దరఖాస్తు ఫీజు కింద రూ.10వేల రుసుం చెల్లించాలంటూ జారీ చేసిన ఉత్తర్వులపై ఉమ్మడి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరింది. ఇందులో భాగంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, జిల్లా విద్యాశాఖాధికారులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. -
సర్కారీ స్కూల్లోనూ ప్రీ ప్రైమరీ
ప్రప్రథమంగా ఒంటిమామిడిపల్లి పాఠశాలకు దక్కిన అవకాశం సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఒంటిమామిడిపల్లికి ఓ అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఒంటిమామిడిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక (ప్రీ ప్రైమరీ) తరగతుల నిర్వహణకు విద్యాశాఖ అనుమతించింది. పాఠశాల విద్యా డెరైక్టర్ ఆదేశాల మేరకు వరంగల్ రీజనల్ జాయింట్ డెరైక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నర్సరీ నుంచి ఏడో తరగతి వరకు అనుమతిస్తూ ప్రాథమిక పాఠశాలను ప్రాథమికోన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేశారు. గ్రామ చిన్నారులు పట్టణానికి వెళ్లి చదువుకోవడం ఇబ్బందిగా మారిన తరుణంలో గ్రామ సర్పంచ్ ఊరిలోని సర్కారు బడిలోనే ఇంగ్లిష్ మీడియం చదువు చెప్పించాలనుకున్నారు. దీంతో గత నాలుగేళ్లుగా మూతబడిన ఈ స్కూలును గత జూలైలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తిరిగి ప్రారంభించారు. గ్రామ కమిటీ కృషి ఫలితంగా: గ్రామ కమిటీ నిరంతరం చేసిన కృషి ఫలితంగా పాఠశాలలో నర్సరీ నుంచి 7వ తరగతి వరకు అనుమతిస్తూ విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కేవలం ఇద్దరు టీచర్లే ఉండే ఈ స్కూల్లో ప్రస్తుతం తొమ్మిది మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రీ ప్రైమరీ (నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ) తరగతుల బోధన నిమిత్తం గ్రామస్థులు స్వచ్ఛందంగా విరాళాలు వేసుకొని వాలంటీర్లను నియమించుకున్నారు. గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో పట్టుదల ఉంటే ప్రభుత్వ పాఠశాలలను ప్రభావవంతంగా నడిపించవచ్చని ఒంటిమామిడిపల్లి పరిణామంతో రుజువైందని తెలంగాణ ప్రజల విద్యా సంస్కరణల ఉద్యమ చైర్మన్ కంచ ఐలయ్య, ప్రధాన కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ఒంటిమామిడిపల్లి పాఠశాలకు ఇచ్చిన మాదిరిగానే రాష్ట్రంలో ఆంగ్లమాధ్యమం బోధిస్తున్న ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు అవకాశం కల్పించాలని టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావ రవి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
పుట్టగొడుగుల్లా ప్లే స్కూళ్లు
గ్రేటర్లో ప్రీ ప్రైమరీ స్కూళ్లు 3 వేలు ♦ లెక్కతేల్చిన జంట జిల్లాల విద్యాశాఖలు ♦ రిజిస్ట్రేషన్ల కోసం యాజమాన్యాలు క్యూ.. సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రీ ప్రైమరీ స్కూళ్ల లెక్క తేలింది. కేవలం పూర్వ ప్రాథమిక విద్య కోసమే ఏర్పాటైన స్కూళ్లు దాదాపు 1,200 వరకు ఉన్నట్లు అధికారులు లెక్కతేల్చారు. అంతేగాక ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు అనుమతి తీసుకుని.. అనధికారికంగా ప్రీ ప్రైమరీ స్కూళ్లను కూడా నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖాధికారులు గుర్తించారు. ఇటువంటి స్కూళ్లు దాదాపు 2 వేలు ఉంటాయని చెబుతున్నారు. ఈ రెండు కేటగిరీల్లో కలుపుకుంటే 3 వేల వరకు ప్రీ ప్రైమరీ విద్యనందించే స్కూళ్లు ఉన్నాయి. అనుమతి లేకుండా సాగుతున్న వీటి కట్టడికి ప్రభుత్వం పగ్గాలు వేసేందుకు సన్నద్ధమైంది. ఈనెల 17న గడ్డిఅన్నారం ఎక్స్ రోడ్ వద్ద స్టార్ కిడ్స్ ప్రీమియంలో జరిగిన లిఫ్ట్ ప్రమాదంలో చిన్నారి జైనబ్ మృతి చెందిన విషయం విదితమే. ఈ ఘటనతో మేల్కొన్న సర్కారు... ప్రీ ప్రైమరీ స్కూళ్ల నియంత్రణకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్లే స్కూళ్ల నిర్వహణపై పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్.. ఆయా జిల్లాల డీఈఓలకు ఆదేశాలు జారీచేశారు. జిల్లాల వారీగా ప్రీ ప్రైమరీ స్కూళ్లను గుర్తించి నోటీసులు ఇవ్వాలని సూచించారు. ఇందులో భాగంగా జంట జిల్లాల డీఈఓల సూచనల మేరకు డిప్యూటీ ఈఓలు, డిప్యూటీ ఐఓఎస్‌లు, ఎంఈఓలు అనుమతి లేని ప్లే స్కూళ్లను గుర్తించారు. వెంటనే దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలని ఈ స్కూళ్లకు నోటీసులు జారీచేశారు. రూ. 10 వేల చొప్పున జరిమానా.. వచ్చే విద్యా సంవత్సరం స్కూళ్లను కొనసాగించాలంటే.. ఈ ఏడాది అక్టోబర్ 30వ తేదీ లోపే విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. గడువులోగా అనుమతి పొందాలనుకుంటే రూ. 10 వేల ఎన్ఎస్సీ బాండ్ అందజేయాలి. ఈ గడువు దాటిపోయినా.. అనుమతి కోసం ముందుకు రాని స్కూళ్లకు నెలకు రూ. 10 వేల చొప్పున జరిమానా విధిస్తారు. ఈ లెక్కన డిసెంబర్ నెల నేటితో మొదలైంది కాబట్టి... ఇప్పటికీ అనుమతి తీసుకోని ప్రతి ప్లే స్కూల్ రూ. 20 వేల జరిమానాను ప్రభుత్వానికి విధిగా చెల్లించాలి. అక్టోబర్ నాటికి బాండ్ రూపంలో చెల్లించే రూ. 10 వేలు కాక ఇవి అదనం. ప్రభుత్వ తీరుతో అనుమతి కోసం స్కూళ్ల యాజమాన్యాలు పెద్ద ఎత్తున ముందుకొస్తుండడం విశేషం. ఆ స్కూళ్లకూ తప్పనిసరి..: ఒకటి నుంచి పదో తరగతి బోధన వరకు అనుమతి పొందిన చాలా పాఠశాలల్లో.. అనధికారికంగా ప్రీ ప్రైమరీ విద్యను అందజేస్తున్నారు. ఈ స్కూళ్లు ఇకపై ప్రీ ప్రైమరీ విద్య కోసం తప్పనిసరిగా ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. ఇదే విషయాన్ని విద్యాశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ యాజమాన్యాలకు కూడా నెలకు రూ. 10 వేల చొప్పున జరిమానా వర్తిస్తుంది.