వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఒంటిమామిడిపల్లికి ఓ అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఒంటిమామిడిపల్లి
ప్రప్రథమంగా ఒంటిమామిడిపల్లి పాఠశాలకు దక్కిన అవకాశం
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఒంటిమామిడిపల్లికి ఓ అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఒంటిమామిడిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక (ప్రీ ప్రైమరీ) తరగతుల నిర్వహణకు విద్యాశాఖ అనుమతించింది. పాఠశాల విద్యా డెరైక్టర్ ఆదేశాల మేరకు వరంగల్ రీజనల్ జాయింట్ డెరైక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నర్సరీ నుంచి ఏడో తరగతి వరకు అనుమతిస్తూ ప్రాథమిక పాఠశాలను ప్రాథమికోన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేశారు. గ్రామ చిన్నారులు పట్టణానికి వెళ్లి చదువుకోవడం ఇబ్బందిగా మారిన తరుణంలో గ్రామ సర్పంచ్ ఊరిలోని సర్కారు బడిలోనే ఇంగ్లిష్ మీడియం చదువు చెప్పించాలనుకున్నారు. దీంతో గత నాలుగేళ్లుగా మూతబడిన ఈ స్కూలును గత జూలైలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తిరిగి ప్రారంభించారు.
గ్రామ కమిటీ కృషి ఫలితంగా:
గ్రామ కమిటీ నిరంతరం చేసిన కృషి ఫలితంగా పాఠశాలలో నర్సరీ నుంచి 7వ తరగతి వరకు అనుమతిస్తూ విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కేవలం ఇద్దరు టీచర్లే ఉండే ఈ స్కూల్లో ప్రస్తుతం తొమ్మిది మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రీ ప్రైమరీ (నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ) తరగతుల బోధన నిమిత్తం గ్రామస్థులు స్వచ్ఛందంగా విరాళాలు వేసుకొని వాలంటీర్లను నియమించుకున్నారు. గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో పట్టుదల ఉంటే ప్రభుత్వ పాఠశాలలను ప్రభావవంతంగా నడిపించవచ్చని ఒంటిమామిడిపల్లి పరిణామంతో రుజువైందని తెలంగాణ ప్రజల విద్యా సంస్కరణల ఉద్యమ చైర్మన్ కంచ ఐలయ్య, ప్రధాన కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. ఒంటిమామిడిపల్లి పాఠశాలకు ఇచ్చిన మాదిరిగానే రాష్ట్రంలో ఆంగ్లమాధ్యమం బోధిస్తున్న ప్రభుత్వ పాఠశాలలన్నింటికీ ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు అవకాశం కల్పించాలని టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావ రవి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.