10వేల దరఖాస్తు ఫీజు చట్ట విరుద్ధం
హైకోర్టును ఆశ్రయించిన పలు ప్రైవేటు విద్యా సంస్థలు
సాక్షి, హైదరాబాద్: గుర్తింపు పొందాలంటే ప్రీ ప్రైమరీ స్కూళ్లు దరఖాస్తు ఫీజు కింద రూ.10వేల రుసుం చెల్లించాలంటూ జారీ చేసిన ఉత్తర్వులపై ఉమ్మడి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరింది. ఇందులో భాగంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, జిల్లా విద్యాశాఖాధికారులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది.