సమరానికి సన్నద్ధం కండి
- టీడీపీని సాగనంపుదాం
- సీఎం నుంచి జన్మభూమి కమిటీ సభ్యుల వరకు దోచుకో..దాచుకో సిద్ధాంతమే
- ధర్మవరం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధ్వజం
- రాష్ట్రంలో దొంగలు పడ్డారు : ఎమ్మెల్సీ వెన్నపూస
- అవినీతికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ : శంకనారాయణ
ధర్మవరం : ‘టీడీపీని సాగనంపే సమయం ఆసన్నమైంది. నాయకులు, కార్యకర్తలు సమరానికి సిద్ధంకండి’ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీడీపీ నాయకుల వేధింపులకు గురైన వారిని నేరుగా కలిసి..వారి బాధలను తెలుసుకోండి.. ఒక్కో కార్యకర్త వంద ఓట్లు వేయించేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. గురువారం ధర్మవరంలోని పరమేశ్వరి పంక‌్షన్‌హాల్‌లో నియోజకవర్గ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ ముఖ్య అథితులుగా హాజరయ్యారు. సమావేశం ఆరంభం కాగానే ఆత్మహత్యలు చేసుకున్న రైతులు, చేనేత కార్మికులు, ప్రత్యర్థుల చేతిలో చనిపోయిన కర్నూల్ జిల్లా వైఎస్సార్‌సీపీ నేత నారాయణరెడ్డి, గుండెపోటుతో మరణించిన వైఎస్సార్‌టీఎఫ్ ముదిగుబ్బ మండల అధ్యక్షుడు సుధాకరరెడ్డికి సంతాపం తెలిపారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు పంచభూతాల్ని అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి నుంచి జన్మభూమి కమిటీ సభ్యుడి వరకు ’దోచుకో– దాచుకో.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు’ అన్న సిద్ధాంతం ప్రకారం రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్నారు. జిల్లాలో రైతాంగం తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత ఏడాది ఆగస్టు నెలలో ధర్మవరం మండలానికి వచ్చిన ముఖ్యమంత్రి పంట నష్టపరిహారం, వాతావరణ బీమా ఇచ్చి రైతాంగాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పటికే ఎనిమిది నెలలవుతున్నా..వాటి ఊసేలేదన్నారు. దీంతో కుటుంబాల్ని ఎలా పోషించుకోవాలో దిక్కుతెలియక రైతులు కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు వలస వెళ్లారన్నారు.
రైతు కంట కన్నీరు తెప్పించిన ఏ నాయకుడికీ భవిష్యత్తు ఉండదని, వారి హయాంలో రాజ్యం బాగుపడిన దాఖలాలు లేవన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే ఒక్క జగన్‌మోనరెడ్డితోనే సాధ్యమని, ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్‌ని ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా పని చేయాలన్నారు. అనంతరం ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుక నుంచి మట్టి వరకు అన్నీ అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు నిద్రలేస్తే అబద్ధాలు చెప్పడం అలవాటుగా మార్చుకున్నారన్నారు. ఆయన కుమారుడు లోకేష్‌బాబు సూట్ కేస్‌బాబుగా మారిపోయారన్నారు.
రాజధాని అంటూ.. రైతుల భూములు లాక్కుంటున్నారు.. సింగపూర్ అంటూ కోట్లు దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేకహోదా, రైల్వేజోన్‌ను అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు తాకట్టుపెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో సుపరిపాలన రావాలంటే జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ మాట్లాడుతూ రైతులు కరువుతో ఇబ్బందులు పడుతున్నారు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అయినా ఈ ప్రభుత్వానికి ఇవేవీ పట్టడం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అరాచాకాలకు చెక్‌పెట్టాలంటే అది ఒక్క వైఎస్ జగన్‌తోనే సాధ్యమన్నారు.