ప్రధాని మోదీకి ఘన స్వాగతం
⇒ శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికిన గవర్నర్, సీఎం, మంత్రులు
⇒ నేడు డీజీపీల సదస్సులో పాల్గొననున్న మోదీ... సాయంత్రం హస్తినకు పయనం
సాక్షి, హైదరాబాద్: డీజీపీలు, ఐజీపీల సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి శంషాబాద్ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఛండీగఢ్ నుంచి ప్రత్యేక విమానంలో శుక్రవారం సాయంత్రం 6.30కి శంషాబాద్ విమానాశ్రయానికి ప్రధాని చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రు లు, ఉన్నతాధికారులు, బీజేపీ నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ప్రధానికి స్వాగతం పలికిన వారిలో శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నారుుని నరసింహారెడ్డి, కె.తారకరామారావు, పట్నం మహేందర్ రెడ్డి, జోగు రామన్న, ఎన్ ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, తీగల కృష్ణారెడ్డి, మాగంటి గోపీనాథ్, ఎంపీలు మల్లారెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, బీజేపీఎల్పీ నేత కిషన్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, రాజాసింగ్, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, సీఎస్ రాజీవ్ శర్మ, తెలంగాణ, ఏపీ డీజీపీలు అనురాగ్ శర్మ, ఎన్.సాంబశివరావు తదతరులు ఉన్నారు.
ప్రధానితో గవర్నర్, సీఎం భేటీ: విమానాశ్రయంలో స్వాగత కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రధాని మోదీతో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ అక్కడే సుమారు 10 నిమిషాల పాటు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అనంతరం ప్రధాని రోడ్డు మార్గాన సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీకి చేరుకున్నారు. శుక్రవారం రాత్రి అకాడమీలోనే బస చేయనున్నారు. శనివారం ఉదయం అకాడమీలో జరిగే యోగా కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొననున్నారు. ఆ తర్వాత అక్కడ జరిగే డీజీపీ, ఐజీపీల సదస్సులో ప్రసంగిస్తారు. సాయంత్రం ఢిల్లీకి బయల్దేరతారు.
కట్టుదిట్టమైన బందోబస్తు
పోలీస్ అకాడమీ పరిసరాలు ఖాకీమయం
హైదరాబాద్: ఎక్కడ చూసినా పోలీసు లు.. అడుగడుగునా తనిఖీలు.. ఎత్తైన భవనాలపై అధునాతన ఆయుధాలతో నిఘా.. హైదరాబాద్‌లోని శివరాంపల్లి పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచి కనిపించిన దృశ్యాలివీ! సర్దార్ వల్లభాయ్ నేషనల్ పోలీస్ అకాడమీలో డీజీపీల సదస్సుకు ప్రధాని రాక నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారులతోపాటు పోలీసు అకాడమీ చుట్టూ పెద్దసంఖ్యలో కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు, సీఆర్‌పీఎఫ్, రాపిడ్ యాక్షన్ సిబ్బందిని మోహరించారు. పోలీసు అకాడమీ భవనం ముందు భారీ జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. ప్రధాని రాక నేపథ్యంలో బీజేపీ నాయకులు అకాడమీ ప్రధాన రహదారిపై రోడ్డుకు ఇరువైపుల భారీ బ్యానర్లు ఏర్పాటు చేశారు. కానీ పోలీసులు వాటన్నిటిని తొలగించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేరిట ఉన్న బ్యానర్లను మాత్రం తీసివేయలేదు.
మంత్రులకు తప్పని తిప్పలు..
ప్రధాని కాన్వాయ్ మార్గంలోని చౌరస్తాలను బారికేడ్లతో మూసేశారు. దీంతో సుమారు 45 నిమిషాల పాటు జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించిపోయారుు. కాసేపు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ప్రధానికి స్వాగతం పలికేందుకు దాదాపు రాష్ట్ర మంత్రులందరూ, బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు రావడంతో వీఐపీ పార్కింగ్ పూర్తిగా నిండిపోయింది. ప్రధాని కాన్వాయ్ వెళ్లిన తర్వాత మంత్రుల కాన్వాయ్‌లు రావడానికి పదిహేను నిమిషాల సమయం పట్టింది. దీంతో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ కాన్వాయ్‌ల కోసం వీఐపీ గేటు ముందు ఎదురుచూపులు చూడాల్సి వచ్చింది.