సదస్సులో మాట్లాడుతున్న ప్రొఫెసర్ కోదండరాం
తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం
ఇల్లెందు:
‘అడవులను కాపాడుకోవడమనేది అటు పాలకులు, ఇటు ప్రజల సమష్టి లక్ష్యం. అంతమాత్రాన, ప్రజలను (పోడు రైతులను) పాలకులు తమ శత్రువులుగా చూడకూడదు’’ అని, తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఏజెన్సీలోని ఖనిజ సంపదను తరలించకుపోతుంటే పట్టించుకోని పాలకులు.. అడవిపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసీలపై జులుం సాగించడం, వారి పోడు భూముల్లోని పంటలను ధ్వంసం చేయడం తగదని అన్నారు. పోడు భూముల సమస్యలను పరిష్కరించాలన్న డిమండుతో, పంటల ధ్వంసానికి వ్యతిరేకంగా న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సోమవారం ఇల్లెందులో భారీ ప్రదర్శన, స్థానిక మార్కెట్ యార్డులో సదస్సు జరిగాయి. సదస్సులో ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. అడవుల పెంపకం, హరితహారం పేరుతో గిరిజనుల నుంచి పోడు భూములను ప్రభుత్వం గుంజుకుంటోందని విమర్శించారు. అడవిని ప్రభుత్వం తన ఆస్తిగా మార్చుకోవడం, మైదాన ప్రాంతం నుంచి గిరిజనేతరులు అడవుల్లోకి చొచ్చుకురావడంతో పోడు సమస్య ఏర్పడిందని అన్నారు. అనేక పోరాటాల ఫలితంగా 2005 డిసెంబర్ 13న అటవీహక్కు చట్టం వచ్చిందన్నారు. అప్పటి వరకు గిరిజనుల ఆధీనంలోగల భూములకు గుర్తింపును, హక్కును ఈ చట్టం కల్పించిందన్నారు. దీనికి లోబడే పోడు సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అడవుల పరిరక్షణలో భాగంగా కలప స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు తెలంగాణ జేఏసీ సహా అందరం కృషి చేద్దామని అన్నారు.
న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోడు రంగారావు మాట్లాడుతూ.. పోడు భూముల్లోని పంటలను అటవీ అధికారులు ధ్వంసం చేయడాన్ని గిరిజనులు తట్టుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘బీడు, బంజర, అటవీభూముల్లో మొక్కలు నాటి కాపాడుకోవాలని చెబితే ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చేవారు. కానీ, పేదల నుంచి పోడు భూములను లాక్కుని.. అందులోని పంటలను ధ్వంసం చేసి, మొక్కలు పెంచుతామనడం సరికాదు’’ అని అన్నారు. ‘‘తెలంగాణ ప్రాంతంలో వందల ఎకరాలను పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు అప్పనంగా అప్పగిస్తున్న ప్రభుత్వం.. పేదలు తమ కడుపు నింపుకునేందుకు సేద్యం చేసుకుంటున్న భూములను దౌర్జన్యంగా స్వాధీనపర్చుకుంటోంది. వారి నోటికాడి ముద్దను లాగేసుకుంటోంది’’ అని విమర్శించారు. టేకులపల్లి మండలంలో 20 ఎకరాలను ఏలూరి కోటేశ్వర్‌రావు, 50 ఎకరాలను లక్కినేని, ఖమ్మంలోని ఎన్‌ఎస్‌పీ కాలువ వెంట కోట్ల రూపాయల విలువైన భూములను కొందరు బడాబాబులు ఆక్రమిస్తే ప్రభుత్వం ఎలా ఊరుకుందని, వాటిని (ఆక్రమిత భూములను) ఎందుకు స్వాధీనపర్చుకోలేదని ప్రశ్నించారు. పోడు భూముల సాధించుకునేందుకు పోరాటం తప్ప మరో మార్గం లేదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, జడ్పీటీసీ సభ్యులు చండ్ర అరుణ, గౌని ఐలయ్య, గుండాల ఎంపీపీ చాట్ల పద్మ, నాయకులు నాయిని రాజు, జగ్గన్న, చిన్న చంద్రన్న, జేఏసీ నాయకులు పాపారావు, విశ్వ, ప్రభాకరాచారి, మురళి, ధర్మార్జున్ తదితరులు పాల్గొన్నారు.