భోజనంలో విషం కలుపుతాం | poison mixing in food | Sakshi
Sakshi News home page

భోజనంలో విషం కలుపుతాం

Published Mon, Sep 12 2016 9:26 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM

పాఠశాల వద్ద మద్యం బాటిళ్లను పరిశీలిస్తున్న ఎంఈఓ

పాఠశాల వద్ద మద్యం బాటిళ్లను పరిశీలిస్తున్న ఎంఈఓ

  • సోమవారం సెలవు ఇవ్వాలని డిమాండ్‌
  • నోటీసుబోర్డుపై హెచ్‌ఎంకు హెచ్చరికలు
  • జోగిపేట పాఠశాలలో బీభత్సం.. రికార్డులు చోరీ
  • సంఘటన స్థలాన్ని సందర్శించిన ఎస్‌ఐ, ఎంఈఓ
  • జోగిపేట: హెచ్‌ఎం భిక్షపతి సార్‌.. సోమవారం సెలవు ఇవ్వకపోతే అక్షయ పాత్ర భోజనంలో విషం కలుపుతామని నోటీసు బోర్డుపై రాసి ఉండడం స్థానికంగా కలకలం రేపింది. అంతే కాకుండా హెచ్‌ఎంని ఉద్దేశించి బోర్డుపై చాక్‌పీస్‌తో బూతులు రాశారు. స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో అల్లరిమూకల ఆగడాలు ఎక్కువయ్యాయి.

    చేనేత సహకార సంఘం సమీపంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో కొన్ని సంవత్సరాలుగా బాలుర ఉన్నత పాఠశాల తరగతులను నిర్వహిస్తున్నారు. శని, ఆదివారాలు సెలవు ఉండడంతో  రాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాలలోకి చొరబడి నానా బీభత్సవం సృష్టించారు. సోమవారం ఉదయం ఎప్పటిలాగే సిబ్బంది పాఠశాలకు రాగా ఈ విషయం బయటపడింది.

    నోటీసు బోర్డుపై రాసిన వాటిని విద్యార్థులతో తుడిపి వేయించారు. పాఠశాల ఆవరణలోని ఉర్దూ మీడియం తరగతి గదుల్లో బీరు సీసాలను పగులగొట్టి మూడు కల్లు సీసాలను వరండాలో వదిలివెళ్లారు.   పాఠశాలలోని కార్యాలయం గది తాళాలు పగులగొట్టి విద్యార్థులకు సంబంధించిన రికార్డులను ఎత్తుకెళ్లారు. టీచింగ్‌ సిలబస్‌ పుస్తకాలు, పిల్లల ప్రాజెక్టు నోట్‌పుస్తకాలు, పరీక్షా పత్రాలు లెస్సన్‌ ప్లాన్లు, ప్రోగ్రెస్‌ కార్డులు,  మరో గదిలో టేబుళ్లపై విద్యార్థులు పెట్టుకున్న నోటు బుక్కులను దగ్ధం చేశారు.

    గతంలో ఎన్నిసార్లు దొంగతనాలు జరిగినా సంబంధిత శాఖ పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఇన్‌చార్జి హెచ్‌ఎం సతీష్‌కుమార్‌ ఈ విషయమై  పోలీసులకు, ఎంఈఓకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, ఏఎస్‌ఐ సైదోద్దిన్, ఎంఈఓ కృష్ణలు వచ్చి వివరాలు సేకరించారు. స్థానికులే ఈ సంఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమాన వ్యక్తం చేశారు. అయితే హెచ్‌ఎంపై కోపంతో రాతలు రాసి ఉండడంతో విద్యార్థులే ఈ పని చేసి ఉంటారని కూడా అనుమానం వ్యక్తం చేశారు.

    మూడు నెలల క్రితమే 11 కంప్యూటర్ల చోరీ
    మూడు నెలల క్రితమే బాలుర ఉన్నత పాఠశాలలోనే గుర్తు తెలియని దొంగలు చొరబడి గది తాళాలు పగులగొట్టి  11 కంప్యూటర్లు, హోండా కంపెనీకి చెందిన జనరేటర్లను ఎత్తుకెళ్లారు. ఇప్పటి వరకు ఆ కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఈ కేసులో విచారణనూ స్థానిక పోలీసులు చేపట్టడం లేదన్న విమర్శలున్నాయి. ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న పాఠశాలకు రక్షణ లేకుంటే ఎలా అని పలువురు ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement