- టెండర్లు పిలవకనే రూ.62 కోట్లతో సీసీ రోడ్లు
- మొక్కుబడి తనిఖీలు
- సీఎం నియోజకవర్గ స్పెషల్
పీలేరు, న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న పీలేరు నియోజకవర్గంలో కాంట్రాక్టర్లు హల్‌చల్ చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఎం25 కాంక్రీట్‌తో సీసీ రోడ్ల నిర్మాణం చేపడితే వాటి జీవిత కాలం దాదాపు 30 సంవత్సరాలు, అయితే ఎక్కడా నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో దశాబ్ద కాలంలోనే సీసీరోడ్ల రూపురేఖలు మారిపోయి గతుకులమయమవుతున్నాయి.
పీలేరు నియోజకవర్గంలో సుమారు రూ.62 కోట్లకు పైగా సీసీ రోడ్ల నిర్మాణపనులు చేపట్టారు. రూ.5 లక్షల లోపు పనులను టెండర్ లేకుండా హ్యాబిటేషన్ కమిటీ పేరిట పనులు మంజూరు చేస్తున్నారు. రూ.5 లక్షలు దాటితే టెండర్లు పిలవాలి. అయితే గతంలో పిలిచిన టెండర్లను రద్దుచేసి నామినేషన్ ప్రాతిపదికన హాబిటేషన్ కమిటీల పేరిట పనులు చేపట్టారు. రూ.62 కోట్లతో సీసీ రోడ్లు నిర్మించినా ఎక్కడా ఐదు లక్షలకు మించకుండా రోడ్ల నిర్మాణాన్ని పలు భాగాలుగా విడగొట్టి వేర్వేరు వ్యక్తుల పేరిట పనులు చేపట్టారు.
నిబంధనలు ఇలా ...
రూ.ఐదు లక్షల లోపు పనులు చేయాలంటే ఐదుగురు సభ్యులతో హ్యాబిటేషన్ కమిటీని ఏర్పాటుచేయాలి. కమిటీలో ఒకరి పేరిట వర్క్‌ఆర్డర్ తీసుకోవాల్సివుంటుంది. ఏ ప్రాంతంలో సీసీరోడ్డు నిర్మిస్తామో అక్కడి స్థానిక ప్రజలతో కమిటీ ఎన్నుకోవాలి. అనంతరం పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ ఆమోదంతో పంచాయతీ కార్యాలయ నోటీస్ బోర్డులో పనుల వివరాలు తెలియజేయాలి. హేబిటేషన్ కమిటీ సిఫార్సు చేసిన వ్యక్తి పేరిట పనుల నిర్వహణ కోసం వర్క్‌ఆర్డర్ ఇస్తారు. డిపార్ట్‌మెంట్ అధికారులతో పాటు హేబిటేషన్ కమిటీ సభ్యులు పనిని పర్యవేక్షించాలి. ఎం25 కాంక్రీట్‌తో సిమెంట్ రోడ్ వేయాలి. ఓ వ్యక్తి పేరిట ఒకే పనిచేయాలి.
ప్రస్తుతం జరుగుతున్నదిలా....
పలు చోట్ల పనులను రూ.లక్షకు రూ. ఎనిమిదివేలు కమీషన్ తీసుకొని అమ్మేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
టెండర్లు లేకుండా జరిగే సీసీ రోడ్లను ఎం25 కాంక్రీట్‌తో నిర్మించాల్సి ఉంటుంది. ఇందులో ఒక క్యూబిక్ మీటర్‌కు 350 కిలోల సిమెంట్, 550 కిలోల ఇసుక, 1050 నుంచి 1100 కిలోల కంకరతో నిర్మాణ పనులు చేపట్టాలి. ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో ఎక్కడా ఎం25 కాంక్రీట్ వేయడంలేదనే ఆరోపణలున్నాయి.
సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయిన తరువాత 21 రోజులపాటు నీటితో క్యూరింగ్ చేయాలి. ఎక్కడా ఇది జరగడంలేదు. నిర్మాణంలో నాణ్యమైన ఇసుక వాడడంలేదని ఆరోపణలున్నాయి. పడా రోడ్లను 17 సెంటీమీటర్లు, పంచాయతీ రోడ్లను 20 సెంటీమీటర్ల ఎత్తు వేయాలి. పలు చోట్ల ఇలా నిర్మాణాలు చేపట్టడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. పీలేరు నియోజకవర్గంలో భారీస్థాయిలో సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతున్నా కేవలం ఒకే డీఈ అన్ని పనులను పర్యవేక్షిస్తున్నారు.
క్వాలిటీ...క్వాంటిటీలో రాజీలేదు...
సీసీ రోడ్ల నిర్మాణంలో ఎక్కడా క్వాలిటీ, క్యాంటిటీలో రాజీపడలేదని పీలేరు పంచాయతీరాజ్ డీఈ రమణయ్య ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. పక్కాగా అన్ని పనులకు హ్యాబిటేషన్ కమిటీ అమోదం ఉందన్నారు.
హైకోర్టును ఆశ్రయిస్తాం...
పీలేరు మండలంలో ఇటీవల రూ.18 కోట్లతో సీసీ రోడ్లు మంజూరు చేశారని, అయితే వాటికి హ్యాబిటేషన్ కమిటీ ఆమోదంతో సీసీరోడ్డు, డ్రైయిన్లు నిర్మించాల్సిఉందన్నారు. అయితే రహస్య కమిటీల ద్వారా ఎంపిక చేసిన వారికి పనులు కట్టబెడుతున్నారని, అధికారులపై హైకోర్టుకు వెళతామని వైఎస్సార్‌సీపీ పీలేరు సీనియర్ నేత, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు బీడీ. నారాయణరెడ్డి తెలిపారు. అపుడు వాస్తవాలు తెలుస్తాయన్నారు.