తొర్రూరు : ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల నుంచి వసూల్ చేస్తున్న ఫీజుల వివరాలు నోటీసు బోర్డులపై పెట్టే విధంగా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ట్రైబల్ స్టూడెంట్ జేఏసీ అధ్యక్షుడు బానోతు రాజ్‌కుమార్ అన్నారు. సోమవారం స్థానిక సంఘం కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో రాజ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారాన్ని తలపించే విధంగా ప్రైవేట్ విద్యా సంస్థల యజమాన్యం గ్రామాల్లో విచ్చలవిడిగా తిరుగుతూ విద్యార్థులు, తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి పాఠశాలలు, కళాశాలల్లో చేర్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
పాఠశాలలు, కళాశాలల్లో చేరిన తర్వాత విద్యార్థుల నుంచి బలవంతంగా అధిక ఫీజులను వసూళ్లు చేస్తున్నారన్నారు. అందుకే ప్రతి పాఠశాల, కళాశాలలో నోటీసు బోర్డుపై ఫీజులు పెట్టేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో నాయకులు రమేష్‌నాయక్, సతీష్‌నాయక్, బాలాజీనాయక్ పాల్గొన్నారు.
పాలకుర్తి టౌన్‌లో...
పాలకుర్తి టౌన్ : ప్రైవేట్ విద్యా సంస్థలు తాము వసూలు చేస్తున్న ఫీజు వివరాలను నోటీస్ బోర్డుపై పెట్టాలని కేయూ జేఏసీ నాయకులు మేడారపు సుధాకర్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల నాయకులు గజ్జి సంతోష్, జీడి హరీష్, సాయిరాం, జోగు గోపి, అబ్బాస్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.