పోలవరం పునరావాసంపై రీ సర్వే నిర్వహించాలి
-
పట్టిసీమ ప్యాకేజీ ఇక్కడెందుకు అమలు చేయరు..?
-
జాతీయ ప్రాజెక్టుపై ఎందుకంత నిర్లక్ష్యం
-
మెరుగైన ప్యాకేజీ తరువాతే పనులు చేపట్టాలి
-
అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్
కాకినాడ సిటీ :
పోలవరం ముంపు బాధితులకు పునరావాస ప్యాకేజీ చెల్లింపులకు సంబంధించి రీ సర్వే నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలని అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. సోమవారం కాకినాడ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సీపీఐ ఆధ్వర్యంలో పోలవరం నిర్వాసితుల సమస్యలపై అఖిలపక్ష రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. నిర్వాసితుల సమస్యలపై సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గొప్పలకు పోతోందన్నారు. ముంపు బాధితులను నిర్లక్ష్యం చేస్తూ ప్రాజెక్టు కాంట్రాక్ట్ సంస్థలకు అండగా ఉంటోందని విమర్శించారు. బాధితులకు మెరుగైన ప్యాకేజీ కల్పించే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మీనమేషాలు లెక్కిస్తున్నారని, పోలవరం ప్రాజెక్టు గుత్తేదారులకు లాభాలు చేకూర్చేవిధంగా అంచనాలను పెంచేందుకు వెనుకాడటంలేదన్నారు. త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో పర్యటనను ఖరారు చేస్తామన్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్టు ప్రకటించిన మర్నాడే రాష్ట్ర ప్రభుత్వం పోలవరం కాంట్రాక్టర్లకు 2014–15 ధరలను వర్తింపజేస్తూ పాత పనులకు కూడా అంచనాలు పెంచుతూ జీఓ 96 జారీ చేసిందన్నారు. అయితే కనీసం ముంపు బాధితులకు పునరావాసాన్ని పెంచే ఆలోచన చేయకపోవడం చూస్తే ప్రభుత్వతీరు అర్ధమవుతుందని మండిపడ్డారు. మాజీ ఎంపీ మిడియం బాబూరావు మాట్లాడుతూ పట్టిసీమ పునరావాసంలో ఎకరాకు రూ.52లక్షలు కూడా ఇచ్చారని, పోలవరం పునరావాసానికి వచ్చేటప్పటికి రూ.5 లక్షలు ఇవ్వడానికి తర్జనభర్జన ఎందుకు పడుతోందన్నారు.
పా్యకేజీ తరువాతే పనులు చేపట్టాలి...
పోలవరం బాధితులకు మెరుగైన ప్యాకేజీ ప్రకటించిన తరువాతనే ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పరిహారాన్ని పట్టిసీమ తరహాలోనే పోలవరం బాధితులకు ఇవ్వాలని, ఎకరానికి రూ.15 లక్షలు చెల్లించాలని, 18 సంవత్సరాలు నిండిన యువతను ప్రత్యేకంగా గుర్తించి రూ.10 లక్షలు చెల్లించాలని, ఆరు సంవత్సరాల క్రితం చెల్లించిన పరిహారం భూములకు కూడా ప్రస్తుతం ఇచ్చే పరిహారాన్ని వర్తింప చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానించారు. మెరుగైన ప్యాకేజీ ప్రకటించే విషయంలో ప్రభుత్వం స్పందించకుంటే అమరావతిలో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీపీఎం జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వై.మాలకొండయ్య, కాంగ్రెస్ బీసీ సెల్ రాష్ట్ర నాయకులు నురుకుర్తి వెంకటేశ్వర్లు, పోలవరం నిర్వాసితుల అఖిలపక్ష నాయకులు కె.మంగరాజు, ఎం.దుర్గాప్రసాద్, ఇంటి పూర్‌ణయ్య, పొడియం అప్పారావు, కుంజా మోహనరావు తదితరులు పాల్గొన్నారు.