మాట మార్చారు..
మాట మార్చారు..
Published Thu, Aug 10 2017 12:16 AM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM
పోలవరం నిర్వాసితులపై వివక్ష
50 మంది పేర్లు తొలగింపు
పోలవరం ఎడమ ప్రధాన కాలువ నిర్మాణానికి వీలుగా ఇళ్లను తొలగించనున్న కుమ్మరిలోవ కాలనీ నిర్వాసితుల పునరావాసం విషయంలో ప్రభుత్వం మాట మార్చింది. పలు సాకులతో కొంతమంది నిర్వాసితుల పేర్లను జాబితా నుంచి తొలగించారు. కోల్పోయిన ఇళ్లను మరోచోట ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని వారు వాపోతున్నారు. మరో ఇల్లు, ప్రభుత్వ ఉద్యోగాలు, పదవీ విరమణ చేసి ప్రభుత్వ పింఛన్లు పొందుతున్నారన్న కారణాలతో ప్రత్యామ్నాయ ఇళ్ల మంజూరు జాబితాలో పేర్లు తొలగించినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. తొలి రెండు విడతల జాబితాల్లో ఉన్న తమ పేర్లను చివరి జాబితాలో తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు దశాబ్దాలుగా నివాసం ఉన్నా ఇప్పుడు పునరావాసం కాలనీలో ఇళ్లకు అనర్హులమంటూ అన్యాయం చేస్తున్నారని వాపోతున్నారు.
తుని రూరల్ (తుని) : తుని పట్టణాన్ని ఆనుకుఉన్న కొండవద్ద కుమ్మరిలోవ కాలనీని 1996లో నిర్మించారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులతోపాటు తునికి చెందిన పలువురు కాలనీలో నివాసాలు ఉంటున్నారు. ఈ ఇళ్లలో పేదలు, వ్యవసాయదారులు, కుల వృత్తిదారులు, ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ఉన్నారు. కాలక్రమంలో కొన్ని క్రయవిక్రయాలు జరిగాయి. కుటుంబాలు పెరగడంతో వేర్వేరు ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకున్నారు. కొంతమందికి ఉద్యోగాలు లభించడం, కొందరు పదవీ విరమణ కూడా చేశారు. ఇటీవల పోలవరం ఎడమ ప్రధాన కాలువ తవ్వకానికి కుమ్మరిలోవ కాలనీ అడ్డంగా ఉందంటూ కాలనీలో 323 ఇళ్లను తొలగించేందుకు నిర్ణయించారు. నష్ట పరిహారంతోపాటు పునరావాసంలో ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తామని అధికారులు చెప్పడంతో కాలనీలో ఇళ్లు ఖాళీ చేసేందుకు కాలనీవాసులు అంగీకరించారు. 323 ఇళ్లు తొలగిస్తుండగా దుద్దికలోవలో రూ.వంద కోట్లతో 424 ఇళ్లు నిర్మించేందుకు 26 ఎకరాల భూమిని సేకరించారు.
కొత్తగా మెలిక పెట్టారు...
ఇప్పుడు కొత్తగా మెలిక పెట్టారు. ప్రభుత్వం నుంచి జీతాలు, పదవీ విరమణ చేసి ప్రభుత్వం నుంచి పింఛన్లు తీసుకుంటున్న నిర్వాసితులకు నష్టపరిహారం ఒక్కటే వర్తిస్తుందని, పునరావాసంలో ఇళ్లు, ప్రత్యేక ప్యాకేజీలు లభించవని స్థానిక అధికారులు చెబుతున్నట్టు బాధితులు తెలిపారు. ఇళ్ల నిర్మాణాన్ని సొంతంగా చేపడతారా? ప్రభుత్వం నిర్మించాలా? అనేదానిపై సర్వే చేస్తున్న అధికారులు తమను సంప్రదించకపోవడంతో జాబితా నుంచి తమను తొలగించారంటూ పలువురు ఆందోళన చెందుతున్నారు. దీంతో 50 మంది వరకు బాధితులు సోమవారం పెద్దాపురం ఆర్డీఓ, బుధవారం తుని తహసీల్దార్‌ను కలసి విషయాన్ని విన్నవించారు. రాజకీయ నాయకులు జోక్యం వల్లే అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఇళ్లు కోల్పోయిన అందరికీ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇళ్లు ఇవ్వకపోతే కాలనీ ఖాళీ చేయమని, అవసరమైతే కాలువ తవ్వకాన్ని అడ్డుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతాను..
ప్రభుత్వ నిబంధనలు ప్రకారం నిర్వాసితులకు పరిహారం మాత్రమే లభిస్తుందని తహసీల్దార్ బి.సూర్యనారాయణ అన్నారు. బాధితుల ఆందోళన, వినతి పత్రాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని ఆయన చెప్పారు.
కూతురికి ఇల్లు ఇచ్చాను
పెళ్లి సందర్భంలో కూతురికి కాలనీ ఇల్లు ఇచ్చాం. మరో చోట ఇల్లు కట్టుకుని జీవిస్తున్నాం. కాలువ తవ్వకానికి ఆ ఇంటిని తొలగించనున్నారు. నష్టపరిహారం ఇచ్చారు. తమ పేరుతో రెండు ఇళ్లు ఉన్నందున పునరావాసంలో ఇల్లు మంజూరు చేయకుండా అన్యాయం చేస్తున్నారు.
– గేదెల ఎర్రియ్యమ్మ, బాధితురాలు
పరిహారమే ఇచ్చారు
పోలవరం కాలువ తవ్వకానికి కాలనీ ఇళ్లు తొలగిస్తామని అంటున్నారు. 2012లో తుపానుకు ఇల్లు కూలిపోయింది. పిల్లలు అద్దె ఇళ్లల్లో ఉంటున్నారు. నేను కూలిపోయిన ఇంటి స్థలంలో పూరిపాక కట్టుకున్నాను. దీనికి నష్ట పరిహారం ఇచ్చారు. పునరావాసంలో ఇల్లు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు.
– నాగం మాణిక్యం, బాధితురాలు, కుమ్మరిలోవ కాలనీ
Advertisement
Advertisement