పోలవరం కాలువకు భారీ గండి
పోలవరం కాలువకు భారీ గండి
Published Mon, Aug 1 2016 9:17 PM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
సీతారామపురం(నూజివీడు): నూజివీడు మండలం సీతారామపురం వద్ద రామిలేరుపై ఉన్న పోలవరం కుడి కాలువ అండర్‌టన్నెల్ వింగ్‌వాల్‌కు అడుగుభాగంలో సోమవారం తెల్లవారుజామున భారీ గండి పడింది. దీంతో గోదావరి జలాలు రామిలేరు లోకి చేరి అక్కడి నుంచి కొల్లేరుకు తరలుతున్నాయి. గతనెల 8వ తేదీ నుంచి గోదావరి జలాలు వస్తుండగా గండిపడిన సమయంలో దాదాపు 4,800ల క్యూసెక్కులు ప్రవహిస్తున్నాయి. గతంలో పశ్చిమగోదావరి జిల్లా జానంపేట వద్ద తమ్మిలేరుపై ఉన్న అక్విడెక్ట్‌కు గండి పడిన విధంగానే కాలువ లోపల భాగంలో నుంచి అండర్‌టన్నెల్ వింగ్‌వాల్(గోడ) కిందిభాగం గుండా
గండి పడింది. భారీ గండి కావడం, నీటి ఉధృతి బాగా ఎక్కువగా ఉండడంతో రామిలేరులోకి 1200ల క్యూసెక్కుల వరకు వెళుతోంది. గండి పడిన విషయం తెలిసిన వెంటనే జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్‌చీఫ్ ఎం. వెంకటేశ్వరరావు, పోలవరం ఎస్‌ఈ వై శ్రీనివాస్‌యాదవ్, ఈఈ చినబాబు, నూజివీడు డీఎస్పీ వల్లూరి వెంకటేశ్వరరావు, జలవనరుల శాఖ ఎపెక్స్ కమిటీ సభ్యులు ఆళ్ల గోపాలకృష్ణ, తెలుగురైతు జిల్లా అధ్యక్షులు చలసాని ఆంజనేయులు తదితరులు హుటాహుటిన వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. సీతారామపురం, ఎంఎన్‌పాలెం, పల్లెర్లమూడికి చెందిన పలువురు రైతులు, ప్రజలు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
గతంలోనే హెచ్చరించిన ‘సాక్షి’ .....
రామిలేరుపై పోలవరం అండర్‌టన్నెల్ నిర్మాణపనులు జరుగుతున్నప్పుడే ‘సాక్షి’ హెచ్చరించింది. పనులను హడావుడిగా చేయడం వల్ల నీటి సరఫరా జరిగే సమయంలో లీకేజీలు ఏర్పడి గండి పడే అవకాశాలున్నాయని గతనెల 7వ తేదీన సాక్షి ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అండర్‌టన్నెల్ కాంక్రీట్‌పనులు హడావుడిగా చేయడం వల్ల ఎక్కడ ఏ చిన్నలోపం జరిగినా గండ్లు పడే అవకశాలుంటాయని కథనంలో హెచ్చరించడం జరిగింది. అయినప్పటికీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పదేపదే ఇంజినీరింగ్ అధికారుల వెంటపడి పనులను పూర్తిచేయించారు. దీనికి పోలవరం ఇంజినీరింగ్ అధికారులతో పాటు ఎన్నెస్పీ ఇంజినీరింగ్ అధికారులకు కూడా విధులు కేటాయించి రాత్రిపగలు అక్కడే డ్యూటీలు వేసి మరీ హడావుడి పనులు చేయించారు. ఎక్కడైనా లోపముంటే ఆ లోపాన్ని సరిదిద్దుకునే అవకాశం కూడా ఇవ్వకుండా చేయడం వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గండి వద్దే కూర్చున్న మంత్రి దేవినేని ఉమా:
గండి వద్దకు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఉదయం 11గంటలకు చేరుకొని పరిశీలించారు. పోలవరం కాలువ ఉన్నతాధికారులతో మాట్లాడి గండి పూడ్చేవరకు ఇక్కడే ఉండి పరిశీలిస్తానని తెలిపి పొద్దుపోయే వరకు అక్కడే ఉన్నారు. సీతారామపురం, పల్లెర్లమూడికి చెందిన స్థానిక రైతులు కూడా తరలివచ్చి గండి పూడ్చే పనుల్లో నిమగ్నమయ్యారు.
Advertisement