
ఇద్దరు దొంగలు.. ఒకడు దొరికాడు.. మరొకడు..?
రాయచోటిటౌన్: దొంగతనానికి వచ్చాడు... ఫ్లాన్ ఫెయిల్ కావడంతో పోలీసులకు దొరికిపోయాడు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం రాత్రి పట్టణంలోని దాదేసాహెబ్ వీధిలో ఇద్దరు దొంగతనానికి వచ్చారు. అటు ఇటు తిరుగుతూ స్థానికుల కంటబడ్డారు. వీరిని పట్టుకోవడానికి స్థానికులు చేసిన ప్రయత్నంలో ఒకరు పారిపోయాడు. ఒక వ్యక్తి మాత్రం దొరికాడు. అతనిని పోలీసులకు అప్పగించారు. అర్ధరాత్రి సమయంలో రెండోవ్యక్తి పక్కనే ఉన్న కోనేరు ( వీరభద్రస్వామి) పక్కనుంచే పారిపోయాడు.
అయితే అదే సమయంలో స్థానికులు కోనేరులో పడిపోయాడని చెప్పడంతో తెల్లవారి నుంచి ఆ వ్యక్తి కోసం పోలీసులతో పాటు ఫైర్ స్టేషన్ సిబ్బందితో కలసి తీవ్రంగా గాలింపు చేపట్టారు. అయినా ఎలాంటి ప్రయోజనం లేదు. అయితే దొరికిన వ్యక్తి మాత్రం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ వ్యక్తి రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఒక సారి తనది తమిళనాడని.. మరో సారి కర్నాటక అని.. చివరిగా తనది గాలివీడు అంటూ పలు రకాలుగా సమాధానాలు చెప్పడంతో ఆ వ్యక్తి దొంగా లేక మతిస్థిమితం లేక ఇలా మాట్లాడుతున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లు సమాచారం. ఆ దొంగ నిజాలు చెప్పితే తప్ప అసలు వారు దొంగలా... కాదా అనే విషయాలు వెలుగులోకి వస్తాయి.