
పాదయాత్రకు పోలీసుల అడ్డుకట్ట
లక్ష్మిపేట భాదిత కుటుంబాల కోసం సీపీఎం యాత్ర
ఉద్రిక్తత..
పాదయాత్ర చేస్తున్న దళిత నేతలను రాజాంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొది. పోలీసులకు, దళిత సంఘాల నేతలకు మద్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ముందుగానే పాదయాత్ర చేస్తున్నట్లు సమాచారం ఇచ్చిన తమను అడ్డుకోవడం తగదని దళిత నేతలు మండిపడ్డారు. పాదయాత్రను సైతం దురుసుగా అడ్డుకుని బలవంతంగా తమను వ్యాన్‌లు ఎక్కించడం అప్రజాస్వామ్యమని అన్నారు.
రాజాం : వంగర మండలంలోని లక్ష్మిపేట గ్రామ బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎ.మాల్యాద్రి పేర్కొన్నారు. లక్ష్మిపేట బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, ప్రభుత్వ తాత్సరాన్ని నిరసిస్తూ స్థానిక బస్టాండ్ వద్ద గురువారం ఆయన సీపీఎం చేపట్టిన పాదయాత్రను ప్రారంభించారు. యాత్ర బస్టాండ్ నుంచి అంబేడ్కర్ విగ్రహాం వరకు చేరుకోగానే పోలీసులు పాదయాత్రను అడ్డుకున్నారు. పాదయాత్రలో పాల్గొన్న 11 మందిని లగేజి ఆటోలపై ఎక్కించారు. రాజాం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం వరకు పోలీస్‌స్టేషన్‌లో ఉంచి అనంతరం విడిచిపెట్టారు. ఈ సందర్భంగా మళ్లీ పాదయాత్రను ప్రారంభించిన ఆయన దళిత సంఘాల నేతల శాంతియుత పోరాటాన్ని పాలకులు అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
లక్ష్మిపేటలో దోషులను వెంటనే శిక్షించడంతో పాటు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబరు 69 వెంటనే అమలు చేయాలని కోరారు. లక్ష్మిపేట బాధిత కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. మడ్డువలస రిజర్వాయర్ మిగులు భూములను దళితులకు మాత్రమే పంపిణీ చేయాలని కోరారు. తమ పాదయాత్రను రాజాం, సంతకవిటి, రేగిడి, వంగర, వీరఘట్టం మండలాలు మీదుగా పాలకొండ వరకు ఈ నెల 21న వరకు నిర్వహిస్తామని తెలిపారు. 21న పాలకొండలో ధర్నా చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి భవిరి కృష్ణమూర్తి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి డి.గణేష్, సీపీఎం డివిజన్ నాయకులు సీహెచ్ రామ్మూర్తినాయుడు తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం నేతల అరెస్టులకు ఖండన
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ) : లక్ష్మిపేట దళితులకు న్యాయం చేయాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్రను భగ్నం చేస్తూ యాత్రలో పాల్గొన్న కార్యకర్తల్ని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు చౌదరి తేజేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. లక్ష్మిపేట నరమేధం జరిగి నాలుగేళ్లు గడుస్తున్నా నేటికి బాధిత కుటుంబాలకు ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. బాధితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, భూమిని ఇవ్వాలని, ఉపాధి కల్పించాలని, చట్టంలో ఉన్నా అమలు చేయకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రధాన ముద్దారుు అరుున బొత్స వాసుదేవనాయుడును పార్టీలో చేర్చుకుని అందలం ఎక్కించడం ప్రభుత్వ నీతిని తెలియజేస్తోందని తెలిపారు.
పాదయాత్రను భగ్నం సీపీఎం నాయకులు జిల్లా కార్యదర్శి భవిరి కృష్ణమూర్తి, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి, జిల్లా కన్వీనర్ డి.గణేష్, సీపీఎం నాయుకులు రామ్మూర్తినాయుడు, మజ్జి గణపతిలతో పాటు 24మందిని అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రజల నుంచి దూరమవుతున్న టీడీపీ పోలీసులతో అధికారాన్ని నిలబెట్టుకోవాలనుకోవడం రాక్షస పాలనవుతుందని పేర్కొన్నారు. ఈ వైఖరిని మార్చుకోకుంటే తగిన మూల్యం చెలించుకోక తప్పదని తెలిపారు.