ఒంటి గంట వరకు ఓకే..
♦ న్యూ ఇయర్ వేడుకలపై జంట పోలీసు కమిషనర్లు
♦ ఫ్లైఓవర్ల మూత, ఔటర్ రింగ్ రోడ్లపై పూర్తి నియంత్రణ
♦ హోటళ్లు, రిసార్ట్‌లు, పబ్‌ల్లో మినిట్ టూ మినిట్ రికార్డు తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: నగరానికి న్యూ ఇయర్ జోష్ వచ్చింది. మరో ఐదు రోజుల్లో జరగనున్న ఈ వేడుకల కోసం ప్రముఖ డీజేలతో కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈవెంట్ నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. హోటళ్లు, పబ్‌లు, రెస్టారెంట్లు ముస్తాబవుతున్నాయి. న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా నిర్వహించేందుకు జంట పోలీసు కమిషనర్లు చర్యలు తీసుకుంటున్నారు. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ డిసెంబర్ 31 అర్ధరాత్రి ఒంటి గంట వరకు న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించుకోవచ్చని వారు పేర్కొంటున్నారు. ఈ వేడుకలకు తుపాకీ లెసైన్స్‌దారులు ఆయుధాలను వెంట తెచ్చుకోవద్దని, వాటిని వినియోగించవద్దని ఆంక్షలు విధించారు. సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో న్యూ ఇయర్ కార్యక్రమాలు నిర్వహించేవారు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని నగర, సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు.
మినిట్ టూ మినిట్ రికార్డు...
‘నయా జోష్ వేడుకల్లో అసభ్యకర దృశ్యాలు చోటుచేసుకుంటే కఠినంగా వ్యవహరిస్తాం. మద్యం తాగి అల్లరి చేసేవారిని కంట్రోల్ చేసేందుకు ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోవాలి. డివిజనల్ ఫైర్ ఆఫీసర్, రీజినల్ ఫైర్ ఆఫీసర్లను ఈవెంట్ నిర్వాహకులు సంప్రదించాలి. ఈవెంట్ మొదలైన దగ్గరి నుంచి పూర్తయ్యే వరకు జరిగిన తీరును వీడియో రికార్డు ఫుటేజీ చేసి సీపీ కార్యాలయానికి పంపించాలి. బాణాసంచాలు కాల్చరాదు. ఏదైనా పార్టీలో ఘర్షణ, గాయాలు, దుర్మరణం చెందితే ప్రాసిక్యూషన్ చేసేందుకు కీలకమైన లెసైన్స్‌ను ఈవెంట్ నిర్వాహకులు ఉంచుకోవాలి. ఈవెంట్‌లో పాల్గొనేందుకు వచ్చే ప్రేక్షకుల వాహనాన్ని తనిఖీ చేయాలి. రోడ్లపై పార్కింగ్ చేయకుండా చూసుకోవాల’ని జంట నగర పోలీసులు సూచిస్తున్నారు.
ఫ్లైఓవర్ల మూత...
మద్యం తాగి మితిమీరిన వేగంతో వెళ్లేవారిని నియంత్రించేందుకు ఔటర్ రింగ్‌రోడ్డుతో పాటు ఇతర హైవేల మీద మాసివ్ వెహికల్ చెకింగ్ నిర్వహిస్తారు. సాధారణ ప్రజలకు ఓఆర్‌ఆర్‌పై రాత్రి 11 నుంచి ఉదయం ఐదు గంటల వరకు అనుమతి ఉండదు. ఆర్‌జీఐ నుంచి వచ్చే ప్రయాణికులను అనుమతిస్తారు. పీవీఆర్ ఎక్స్‌ప్రెస్ హైవేతో పాటు అన్ని ఫ్లైఓవర్లు రాత్రి 11 నుంచి ఉదయం ఐదు గంటల వరకు మూసి ఉంటాయి.
డీజేలకు అనుమతి తప్పనిసరి..: సీవీ ఆనంద్
‘స్టార్ హోటళ్లు, పబ్‌లు, రిసార్ట్‌లు, ఫామ్‌హౌస్‌ల్లో డీజేలకు అనుమతి లేదు. 45 డెసిబుల్స్ మించి లౌడ్ స్పీకర్లు వినియోగించరాదు. డీజే అవసరమున్న ఈవెంట్ నిర్వాహకులు స్థానిక ఎస్‌హెచ్‌వో, ఏసీపీల నుంచి తప్పనిసరి గా అనుమతి తీసుకోవాలి’ అని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.