ఆదిలాబాద్: ప్రజల కోసమే పోలీసులున్నారని ప్రజా సంక్షేమమే తమ ఆకాంక్ష అని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. సోమవారం తిర్యాణి మండలంలోని రోంపల్లి, గుండాల, మంగి గ్రామాల్లో పోలీసులు జనమైత్రి గ్రామసభ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో రోడ్డు, తాగునీరు, విద్యా, వైద్యం తదితర సౌకర్యాలు ఏర్పడినపుడే గ్రామాలు సంపూర్ణంగా అభివృద్ధి చెందుతాయన్నారు. అసాంఘిక శక్తులకు సహకరించి గ్రామాల వెనకబాటు తనానికి కారణం కావద్దన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లకు మంచి భవిష్యత్‌ను చూపించాలని మావోయిస్టుల వైపు అకర్షితులు కాకుండా చూడాలన్నారు. అసాంఘిక శక్తులకు సహకరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మంగి గ్రామంలో సెల్ టవర్, రోడ్డు నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 23 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉండి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని వారు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని వారికి పునరావాసం కల్పించి ప్రభుత్వం ఉపాది కల్పిస్తుందన్నారు.
యువకుల కోసం పోటీపరీక్షల గైడెన్సు, పుస్తకాలు శిక్షణ కల్పిస్తామన్నారు. అనంతరం అడిషల్ ఎస్పి పనసారెడ్డి మాట్లాడుతూ, ఖైరిగూడలో బల్లార్షను మావోయిస్టులు పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో కాల్చి చంపారని అతడు ఏడు సంవత్సరాల నుంచే పోలీస్ ఇన్ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నాడ ని వారి లేఖలో పేర్కొన్నార ని అన్నారు. ఏడేళ్ల కుర్రాడు పోలీస్‌లకు సమాచారం ఇస్తాడా అని ప్రశ్నించారు. రోంపల్లి, మంగి గ్రామాల్లో పోలీ స్ అధికారులు ప్రజలతో కలిసి అల్పాహారం, భోజనం చేశారు. రోంపల్లి నుంచి గుండాలకు కాలినడకన పోలీస్ అధికారులు చేరుకుని అక్కడి ప్రజలతో సమావేశమయ్యారు. బెల్లంçపల్లి డీఎస్పీ రమణారెడ్డి, సీఐ కరుణాకర్, ఎస్సైలు బుద్దేస్వామి, అశోక్ జనమైత్రి గ్రామపోలీస్ అధికారులు కిరణ్, శ్రీనివాస్, మండల వైస్ ఎంపీపీ మెస్రం గణేశ్ పాల్గొన్నారు.