కోవర్టులుగా వచ్చి.. మాఫియాగా మారి | Police Kills Former Naxalites! | Sakshi
Sakshi News home page

కోవర్టులుగా వచ్చి.. మాఫియాగా మారి

Published Tue, Aug 9 2016 3:39 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

కోవర్టులుగా వచ్చి.. మాఫియాగా మారి - Sakshi

కోవర్టులుగా వచ్చి.. మాఫియాగా మారి

మావోయిస్టు పార్టీలో పనిచేసి అదే పార్టీకి చెందిన ముఖ్యులను హతమార్చి కోవర్టులుగా మారిన పలువురు మాజీ నక్సలైట్లు మాఫియాగా, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నారు. చివరికి పోలీసుల చేతుల్లో హతమవుతున్నారు. గ్రీన్ టైగర్స్, బ్లాక్ టైగర్స్ పేరిట సంఘ వ్యతిరేక కార్యకలాపాలు నడిపినవారు, పోలీసు అధికారుల మెప్పుకోసం మావోయిస్టుల కుటుంబ సభ్యులను సైతం హతమార్చి కలకలం సృష్టించిన వారు ఇలాగే అంతమవుతున్నారు.

మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తించి కోవర్టులుగా మారిన శంకర్‌నాయక్, కత్తుల సమ్మయ్య, సోమ్లానాయక్, బయ్యపు సమ్మిరెడ్డి, శివకుమార్.. తాజాగా నయీమ్ మృతి చెందగా.. జడల నాగరాజు, గోవిందరెడ్డి జాడలేకుండా పోయారు. ఇందులో ఎక్కువ మంది కరీంనగర్ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం.    - పెద్దపల్లి

 
పోలీసుల చేతిలో హతమవుతున్న మాజీ నక్సలైట్లు
మావోయిస్టు పార్టీని దెబ్బతీసి కోవర్టులుగా మారిన వారిలో కత్తుల సమ్మయ్యను మొదటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. కరీంనగర్ జిల్లా కాచాపూర్ గ్రామానికి చెందిన సమ్మయ్య హుస్నాబాద్ దళంలో పనిచేస్తూ 1991లో కోవర్టుగా మారాడు. హిమ్మత్‌నగర్‌లో సేద తీర్చుకుంటున్న భూపతి దళంపై కాల్పులు జరపడంతో కమాండర్ భూపతి సహా మరో ఇద్దరు సభ్యులు చనిపోయారు. అలాగే హైదరాబాద్‌లో డీఐజీ వ్యాస్‌ను హతమార్చిన వారిలో కత్తుల సమ్మయ్య, నయూమ్ ప్రధాన పాత్రధారులు. వీరిద్దరూ పార్టీతో విభేదించి కోవర్టులుగా మారి పౌరహక్కుల సంఘాల నాయకులను హతమార్చారు. రాజధానిలో గ్యాంగ్‌లను నడుపుతూ సెటిల్‌మెంట్లు చేశారు. 1996లో కొలంబోకు వెళ్లిన కత్తుల సమ్మయ్య విమాన ప్రమాదంలో చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారు.

కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం రాణాపూర్‌కు చెందిన మరో కోవర్టు బయ్యపు సమ్మిరెడ్డి 1999లో పోలీసులకు లొంగిపోయి అప్పటి జిల్లా కార్యదర్శి అనుపురం కొమురయ్య ఎన్‌కౌంటర్‌కు సహకరించాడు. పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పురుషోత్తం, కనకాచారి హత్యల్లో పాల్గొన్నాడు. రాష్ట్రవ్యాప్తంగా పలు సంఘటనల్లో పాల్గొన్న సమ్మిరెడ్డి పేరు చెబితే చాలు.. ఎన్నో కేసులు పరిష్కారమయ్యేవి. కానీ సమ్మిరెడ్డి గుంటూరు జిల్లాలో దారుణహత్యకు గురయ్యాడు. నాలుగు రోజుల తర్వాత కుళ్లిపోయిన శవం దొరికింది. తన కుమారుడిని పోలీసులే చంపారని, పార్టీలో ఉండి చనిపోయినా తమ కుటుంబానికి గౌరవం దక్కేదని సమ్మిరెడ్డి తండ్రి రాఘవరెడ్డి చేసిన ప్రకటన సంచలనం రేపింది.

కరీంనగర్ జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన శివకుమార్ ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల కోల్‌బెల్ట్ ప్రాంతంలో సింగరేణి కార్మిక సంస్థ (సికాస) సానుభూతిదారుడుగా పనిచేశాడు. తర్వాత అదే పార్టీపై తిరుగుబాటు చేసి పోలీసులకు సహకరించాడు. పాతికేళ్ల పాటు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన సికాస నేత రమాకాంత్, మరో ఇద్దరు సభ్యుల ఎన్‌కౌంటర్‌కు శివకుమారే కారణమని ప్రచారం జరిగింది. దానికి సంబంధించిన రివార్డు పంపకాల్లో విభేదాలు రావడంతో పోలీసులు శివకుమార్‌ను ఎన్‌కౌంటర్ చేసినట్లు కోల్‌బెల్ట్ ప్రాంతంలో ప్రచారమైంది.

కరీంనగర్ జిల్లా మంథని మండలం ఖమ్మంపల్లికి చెందిన జడల నాగరాజు 1999లో పీపుల్స్‌వార్‌లో దళ సభ్యుడిగా చేరాడు. అప్పటి ఆ పార్టీ జిల్లా కార్యదర్శి విజయ్ అలియాస్ కొట్టె పురుషోత్తంను కాల్చిచంపి పోలీసులకు లొంగిపోయాడు. 2008 వరకు పలు వివాదాస్పదమైన కేసులతో సంబంధం కలిగిన నాగరాజు.. తర్వాత రెండు మూడేళ్ల పాటు మౌనంగానే ఉన్నాడు. 2011 డిసెంబర్ 26న మూడు నెలల్లో తిరిగి వస్తానని భార్య రాణికి చెప్పి వెళ్లిపోయాడు. ఇప్పటివరకు నాగరాజు జాడ లేదు.

పీపుల్స్‌వార్ కేంద్ర కమిటీ నాయకులు నల్ల ఆదిరెడ్డి, శీలం నరేశ్, ఎర్రం సంతోష్‌రెడ్డిలను పోలీసులకు పట్టించిన ఆ పార్టీ అగ్రనేత గోవిందరెడ్డి ఆ తర్వాత జాడ లేకుండా పోయూడు. నల్లగొండ జిల్లాకు చెందిన గోవిందరెడ్డిని ప్రభుత్వమే విదేశాలకు పంపించినట్లు ప్రచారం జరిగింది. అతని తల్లిదండ్రులు చివరి దశలో భిక్షాటన చేస్తూ విషాదకర స్థితిలో మరణించారు. గోవిందరెడ్డి ఆచూకీ ఇప్పటికీ తెలియదు.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన శంకర్‌నాయక్ కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో మావోయిస్టు పార్టీని దెబ్బతీస్తానని, దళాలను మట్టుపెడతానని అంటూ కోవర్టుగా మారాడు. అతను పోలీసులకు సవాలుగా మారడంతో చివరకు పోలీసులే ఎన్‌కౌంటర్‌లో చంపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నల్లగొండ జిల్లా పావురాల గుట్ట వద్ద మావోయిస్టు పార్టీ అప్పటి రాష్ట్ర కార్యదర్శి చిన్నన్నపై కాల్పులు జరిపిన సోమ్లానాయక్.. చివరికి గిరిజనుల చేతిలోనే మరణించాడు. ప్రకాశం, నల్లగొండ జిల్లాల్లో ఆయనకు గతంలో తిండిపెట్టిన వారినే వేధించడంతో మట్టుబెట్టారు.
 
ఇక హైదరాబాద్‌లో మాఫియా రాజ్యాన్ని ఏలిన నయూమ్ వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారడంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి మట్టుబెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు, కోవర్టులు ఒకటేనంటూ పలు సందర్భాల్లో హక్కుల సంఘాల నాయకులు ఆరోపణలు చేశారు. అవసరమైతే కోవర్టులను సైతం ఎన్‌కౌంటర్ చేస్తామని నయీమ్ సంఘటనతో మరోసారి పోలీసులు రుజువు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement