హోదా పోరుపై పోలీస్ జులుం
హోదా పోరుపై పోలీస్ జులుం
Published Sat, Sep 10 2016 10:09 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
* ఉద్రిక్తంగా సాగిన బంద్
* పాలకపార్టీ ఆదేశాలతో పోలీసుల ఓవర్‌యాక్షన్
* అడుగడుగునా ఆటంకాలు... అరెస్టులు
చిలకలూరిపేట టౌన్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు చిలకలూరిపేటలో శనివారం నిర్వహించిన బంద్‌కు పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాపకం కోసం ఓవర్ యాక్షన్ ప్రదర్శించారు. శాంతియుతంగా ఉన్న నియోజకవర్గంలో పోలీస్ 30 యాక్ట్, 144 సెక్షన్లు విధించి బంద్‌ను అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. అర్ధరాత్రి నుంచే వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లకు వెళ్లి ముందస్తు అరెస్టుల పేరున భయానక వాతావరణం సృష్టించారు. తెల్లవారుజామున ఆర్టీసీ బస్‌స్టేషన్ చేరుకున్న పార్టీ నాయకులతో పాటు వామపక్ష నాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
అడుగడుగునా ఆటంకాలు ....
పాలక పక్ష ఆదేశాలతో బంద్‌ను విఫలం చేసేందుకు కంకణం కట్టుకున్న పోలీసులు ప్రత్యేక బలగాలతో ఆర్టీసీ బస్ స్టేషన్‌వద్ద మోహరించారు. వైఎస్సార్‌సీపీ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. పరిస్థితులను ఊహించిన పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ నాయకత్వంలో పట్టణంలో పార్టీ కార్యాలయం వద్ద నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్‌ఆర్‌టీ సెంటర్, చౌత్రా సెంటర్ , మెయిన్ బజార్, కూరగాయల మార్కెట్, మీదుగా ర్యాలీ కొనసాగింది. కళామందిర్ సెంటర్‌కు ర్యాలీ చేరుకొనే సమయానికి నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అర్బన్ సీఐ బి.సురేష్‌బాబు, రూరల్ సీఐ శోభన్‌బాబు పలువురు ఎస్‌ఐలు పోలీసు సిబ్బందితో వచ్చి ర్యాలీని అడ్డుకున్నారు. పోలీసులు బైక్ ర్యాలీ అడ్డుకోవడంపై వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.శాంతియుతంగా కొనసాగుతున్న కార్యక్రమాన్ని ఎలా అడ్డుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వాహనాలను అడ్డుకోవడంతో పాదయాత్రగా ముందుకు సాగారు. ఈ తరుణంలో మిమ్మల్ని అరెస్టుచేస్తున్నామని అర్బన్ సీఐ బి సురేష్‌బాబు చెప్పగా, అరెస్టుకు నిరాకరించి పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేసుకుంటూ ముందుకు కదిలారు. దీంతో ఒక్కసారిగా పోలీసులు కార్యకర్తలను తోసివేసి మర్రి రాజశేఖర్ అరెస్టుకు ప్రయత్నించారు. ఈ తరుణంలో కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట ఏర్పడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు బలవంతంగా మర్రి రాజశేఖర్‌తో పాటు మరికొందరు నాయకులను పోలీసు వాహనాలలో ఎక్కించుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనికి నిరసనగా పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏవీఎం సుభాని ఆధ్వర్యంలో పాదయాత్రగా పట్టణంలో ప్రదర్శన నిర్వహిస్తున్న వారిని పోలీసులు చౌత్రాసెంటర్‌లో అడ్డుకొని సుభానీతో పాటు మరికొందరిని అరెస్టు చేసి నాదెండ్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ప్రశాంతంగా బంద్...
పోలీసులు ఎన్ని అటంకాలు సృష్టించినా బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ముందురోజే పట్టణంలో అన్ని వర్గాల ప్రజలకు సమాచారం అందజేయడం, విస్తృత ప్రచారం నిర్వహించడంతో దుకాణాలు తెరుచుకోలేదు. పాఠశాలలు, కళాశాలలు పూర్తిగా మూతపడ్డాయి.
Advertisement