పోలీసుల ఉక్కుపాదం
- ధర్నా చౌక్‌లోనూ నిరసనకు అవకాశమివ్వని వైనం
- వెలంపల్లి, గౌతంరెడ్డి సహా 20 మంది అరెస్ట్
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్) : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ అలంకార్ సెంటర్‌లోని ధర్నాచౌక్‌లో వైఎస్సార్ సీపీ శ్రేణులు చేపట్టిన ధర్నాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ధర్నాకు అనుమతి లేదంటూ పార్టీ నాయకులను అరెస్ట్ చేసి ఉంగుటూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ధర్నా చౌక్‌లో వేసిన టెంట్‌ను పోలీసులే తొలగించారు. పార్టీ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి పి.గౌతంరెడ్డి, కార్యదర్శి పైలా సోమినాయుడు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త బొప్పన భవకుమార్, కార్పొరేటర్ బుల్లా విజయ్‌కుమార్, మైనార్టీ విభాగం నగర అధ్యక్షుడు గౌస్‌మొహిద్దీన్, ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షుడు విశ్వనాథ రవి, పార్టీ నగర ప్రధాన కార్యదర్శి తంగిరాల రామిరెడ్డి సహా 20మంది కార్యకర్తలను అరెస్ట్ చేసి ఉంగుటూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
తమను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని కోరినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. నగరంలో 144 సెక్షన్ అమల్లో ఉందని, ఎటువంటి నిరసన, ధర్నా కార్యక్రమాలు చేయడానికి వీల్లేదని పోలీసులు చెప్పారు. తాము అనుమతి కోసం లెటర్ పెట్టామని, అనుమతి నిరాకరించినట్లు తమకు లిఖిత పూర్వకంగా ఎటువంటి లెటర్ రాలేదని వెలంపల్లి శ్రీనివాస్, గౌతంరెడ్డి పోలీసులకు చెప్పారు. వారి వాదనను వినిపించుకోకుండా వాహనాల్లో ఎక్కించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తోందని వెలంపల్లి శ్రీనివాస్, గౌతంరెడ్డి మండిపడ్డారు. బస్సు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ప్రతిపక్ష నేతపై అక్రమంగా కేసులు బనా యించడమే కాకుండా నిరసన తెలిపేందుకు వచ్చిన తమను అక్రమంగా అరెస్ట్ చేయడం మంచి పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాత్రి పది గంటల సమయంలో నాయకులను ఉంగుటూరు నుంచి సత్యనారాయణపురం పీఎస్‌కు తీసుకువచ్చారు.