తుందుర్రులో పోలీసు రాజ్యం
తుందుర్రులో పోలీసు రాజ్యం
Published Mon, Oct 3 2016 1:25 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
– వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడికి మహిళల మొర
– పార్టీ పరంగా అండగా ఉంటామంటూ నాని భరోసా
భీమవరం: ఆక్వాఫుడ్‌పార్క్ నిర్మాణం పేరుతో తమ గ్రామంలో పోలీసు రాజ్యమేలుతోందని పోలీసుల బూట్లు చప్పుళ్లతో గజగజ వణికిపోతూ ఎప్పుడు ఏమి జరుగుతుందోననే భయనకవాతావరణంలో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నామని భీమవరం మండలం తుందుర్రు గ్రామ ప్రజలు వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నానికి మొరపెట్టుకున్నారు. ఆదివారం భీమవరం వచ్చిన నానిని మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసంలో కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. విషవాయువులను వెదజల్లే గోదావరి మెగా ఆక్వాఫుడ్ నిర్మాణం వల్ల తాగు, సాగునీరు కలుషితం కావడమేగాక పచ్చని పంటపొలాలు సర్వనాశనమయ్యే ప్రమాదముందని ఫుడ్‌పార్క్‌ను ప్రజలకు ఇబ్బందిలేని సముద్రతీరంలో నిర్మించుకోవాలంటూ గత రెండున్నరేళ్లుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పెడచెవిని పెట్టి ఫుడ్‌పార్క్ యాజమాన్యానికి కొమ్ము కాస్తూ పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి తమను ఇంటిలోనుంచి బయటకు రాకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. అక్రమ కేసులను బనాయించి మగవారిని జైలులో పెట్టారని నాన్న ఏడంటూ పిల్లలు అడిగే ప్రశ్నకు సమాదానం చెప్పలేక జీవచ్చవంలా కాలం వెళ్లదీస్తుమని మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. ఇంటి నుంచి ఏ ఇతర అవసరాలకు బయటకు వెళ్లాలన్నా ఆధార్‌కార్డు చూపించాలంటూ నిబంధనలు విధించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఇదే ప్రశ్నించే అందరిపై అక్రమంగా కేసులు బనాయించి జైలు పంపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎప్పుడు పోలీసులను చూడని తాము నిత్యం పోలీసు జీప్ హారన్లు, బూట్లు చప్పుళ్లుతో బెంబేలెత్తిపోతున్నామని తక్షణం గ్రామంలో 144 సెక్షన్‌ను ఎత్తివేసే విధంగా కృషిచేయాలని కోరారు. తమకు మేలు చేస్తారని ఓట్లు వేసి గెలిపించిన ఎంపీ, ఎమ్మెల్యేలు ఫుడ్‌పార్క్ యాజమన్యానికి తొత్తులుగా మారి ప్రజల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. పుడ్‌పార్క్ నిర్మాణం కారణంగా గ్రామంలో ప్రశాంత వాతావరణం కరువైందని బంధువులు, మిత్రులు కూడ గ్రామంలోనికి రావడానికి బయపడుతున్నారన్నారు. దీనికి స్పందించిన నాని మాట్లాడుతూ ఇక్కడి సమస్యను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దష్టికి తీసుకువెళ్లి అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని భరోసా ఇచ్చారు. బాధిత గ్రామాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అధైర్యపడవద్దంటూ ధైర్యం చెప్పారు.
ఇది ఇలా ఉండగా ఫుడ్‌పార్క్ నిర్మాణం వల్ల జీవనోపాధి పొందుతున్నామని దీనిని అడ్డుకోవద్దంటూ ఫుడ్‌పార్క్ పరిరక్షణ కమిటీ నాయకులు కొంతమంది నానికి విన్నవించారు. దీనికి స్పందించిన నాని మాట్లాడుతూ పరిశ్రమలస్ధాపనకు వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ వ్యతిరేకం కాదని అయితే తుందుర్రులో చేపట్టిన చర్యలనే తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఫుడ్‌పార్క్ నిర్మాణం వల్ల ఉత్పన్నమయ్యే ఇబ్బందుల పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నది ప్రభుత్వం ప్రజలకు పూర్తి వివరించి వారిని ఒప్పించి పార్క్ నిర్మించాలని తాము చెబుతున్నామని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులేని ప్రాంతంలో ఫుడ్‌పార్క్ నిర్మిస్తే తామ పార్టీ పరంగా పూర్తిగా సహకరిస్తామని నాని స్పష్టం చేశారు.
Advertisement
Advertisement