నేటినుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్
నేటినుంచి పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్
Published Wed, Dec 7 2016 10:50 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM
– రోజుకు 1000 మందికి ఆహ్వానం
– ఈనెల 20 వరకు దేహదారుఢ్య పరీక్షలు
– అభ్యర్థుల పట్ల మర్యాదపూర్వకంగా మసలుకోవాలి: ఎస్పీ
కర్నూలు: పోలీసు శాఖలో సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్ల భర్తీకి ప్రభుత్వం అనుమతించడంతో గురువారం నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. గత నెలలో ప్రాథమిక పరీక్ష రాసి 11,762 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారు. వీరిని రోజుకు 1000 మంది చొప్పున హాజరు కావలసిందిగా ఆహ్వానాలు పంపారు. బరువు, ఛాతీ, ఎత్తు కొలతల్లో అర్హత సాధించినవారికి లాంగ్‌జంప్ 100 మీటర్లు, 1600 మీటర్లు పరుగు పోటీలు నిర్వహించనున్నారు. గతంలో పోలీసు అధికారులు దగ్గరుండి వారి కనుసన్నల్లో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించేవారు. అలా కాకుండా ఈసారి కానిస్టేబుళ్ల ఎంపిక పోటీలు సాంకేతిక పద్ధతిలో నిర్వహించనున్నారు. ఛాతీ, ఎత్తు కొలతలతో పాటు పరుగుపందెం కూడా అధికారుల ప్రమేయం లేకుండా సాంకేతిక పద్ధతి ద్వారానే ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం రెండు సాఫ్ట్‌వేర్ కంపెనీల సిబ్బందికి నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ నెల 20 వరకు ప్రతిరోజు ఉదయం 5 నుంచి సాయంత్రం 4 గంటల వరకు క్రీడామైదానంలో స్క్రీనింగ్ టెస్టు నిర్వహిస్తారు. అభ్యర్థులకు కేటాయించిన సమయాల్లోనే దేహదారుఢ్య పరీక్షలకు అందుబాటులో ఉండాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డులతో అభ్యర్థులు హాజరుకావలసి ఉంటుంది.
అభ్యర్థుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించండి : ఎస్పీ
ఏపీఎస్పీ రెండవ పటాలం మైదానంలో స్క్రీనింగ్ టెస్టు ఏర్పాట్లను ఎస్పీ ఆకె రవికృష్ణ పరిశీలించారు. దేహదారుఢ్య పరీక్షల వద్ద విధులు నిర్వహించే సిబ్బందితో బుధవారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. డిగ్రీలు, పీజీలు, ఆపై చదువులు చదివిన అభ్యర్థులు పోలీస్ కానిస్టేబుళ్ల ఎంపికకు హాజరవుతున్నారని వారి పట్ల మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు. అసభ్యకర పదజాలాన్ని వాడకూడదని ఆదేశించారు. ఏవైనా సమస్యలు తలెత్తితే పైఅధికారులకు 'సెట్' ద్వారా అందించాలని ఆదేశించారు.
Advertisement
Advertisement