జడ్చర్ల(మహబూబ్‌నగర్ జిల్లా): జడ్చర్ల మండల పరిధిలోని ఉదండాపూర్‌లో బుధవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. మొహర్రం పండుగ సందర్భంగా పీర్ల చావిడి దగ్గర ఆలావ్ ఆడుతున్న సమయంలో దళితులు, ఇతర కులాలకు మధ్య ఘర్షణ జరిగిన విషయం విదితమే. దాడులకు సంబంధించి దళితులపై దాడి చేసిన 19 మందిని ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు కింద అరెస్టుచేసి జైలుకు పంపడం ఉద్రిక్తతకు దారి తీసింది. బుధవారం ఉదయం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జైలుకు వెళ్లిన వారికి మద్దతుగా ఇతర కులాలకు చెందిన వారంతా ఆటోలు, ట్రాక్టర్లలో జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ సమస్యను విన్నవించేందుకు బయలుదేరే ప్రయత్నం చేశారు.
కేవలం తమ వర్గీయులను మాత్రమే అరెస్ట్ చేసి జైలుకు పంపారని, తమపై దాడి చేసిన దళితులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఈ సందర్బంగా వారు ప్రశ్నించారు. దీంతో విషయం తెలుసుకున్న జడ్చర్ల సీఐ జంగయ్య ఆధ్వర్యంలో పోలీసులు గ్రామానికి వెళ్లి గ్రామస్థులకు నచ్చజెప్పారు. బీసీ, తదితర కులాలపై దాడి జరిపిన 13 మంది దళితులను ఈ సందర్బంగా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో గ్రామంలో కొంత ఉద్రిక్తత చల్లబడింది. ఇలా ఉండగా గ్రామ శివారులో పంట చేల్లో ఉన్న దళిత మహిళ అంజమ్మపై ఇతర కులాల వారు దాడి చేసి కొట్టారని బాధితురాలు లబోదిబోమంది. దీంతో అమెను 108 అంబులెన్స్‌లో వైద్య చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమెను ఎవరు కొట్టలేదని, కావాలనే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఇతరకులాలు వారు ఖండించారు. కాగా గ్రామంలో ఇరువర్గాల మద్య ఆగ్రహావేశాలు రగులుతున్నాయి.
ఉదండాపూర్‌లో ఉద్రిక్తత..
Published Wed, Oct 28 2015 4:16 PM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM
Advertisement